సాక్షి, బాలానగర్: బాలానగర్ డివిజన్‌లోని నర్సాపూర్ చౌరస్తా రద్దీగా ఉండే నాలుగు రోడ్ల కూడలి. కూకట్‌పల్లి, సికింద్రాబాద్, జీడిమెట్ల వెళ్లే రహదారి. పారిశ్రామిక కేంద్రం కావటంతో నిత్యం వేలాది వాహనాల రాకపోకలు కొనసాగుతూ ఉంటాయి. బాలానగర్‌లో ట్రాఫిక్ దాటితే చాలు అని ప్రజలు అనుకుంటారు. అంతగా ఉంటుంది రద్దీ. ఇక్కడి ప్రజలకు ట్రాఫిక్ కష్టాలకు పరిష్కారం చూపారు. బాలానగర్ ఫ్లై ఓవర్ నిర్మించారు. రయ్ రయ్‌న బాలానగర్‌పై ఓవర్ బ్రిడ్జిపై వాహనాలు పరుగులు తీయడానికి అంతా సిద్ధం చేశారు. ఈ నెల 6న మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు.
సాకారమిలా..
2017 ఆగస్టు 21న బాలానగర్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. రూ.385 కోట్లతో మూడున్నరేళ్ల వ్యవధిలో బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేశారు. బ్రిడ్జి ఇరువైపులా రెండు డివిజన్లు ఉన్నాయి. ఒకటి ఫతేనగర్, మరొకటి బాలానగర్. రెండు డివిజన్లతో వందలాది పరిశ్రమలు ఉన్నాయి. దీంతో నిత్యం కార్మికులు, లారీలు, ఆటో ట్రాలీలతో రద్దీగా ఉంటుంది. బ్రిడ్జి పొడవు 1.13 కిలోమీటర్లు, 24 మీటర్లు వెడల్పు 26 పిల్లర్లతో నిర్మించారు. ఈ బ్రిడ్జికి ఒక ప్రత్యేకత ఉంది. హైదరాబాద్ నగరంలోని అతి ప్రధాన రహదారుల్లో ఒకటి, 6 లేన్లతో సిటీలోనే నిర్మించిన మొట్టమొదటి బ్రిడ్జి ఇది. 2050 సంవత్సరం వరకు ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకొని నిర్మాణం చేశారు. దీనికి బాబూ జగజ్జీవన్‌రామ్ బ్రిడ్జిగా నామకరణం చేయనున్నారు.
ప్రజలకిచ్చిన హామీని నెరవేర్చాం..
బాలానగర్, ఫతేనగర్ డివిజన్ల ప్రజలకిచ్చిన హామీని నెరవేర్చాం. గత 40 సంవత్సరాలు ప్రజలు ట్రాఫిక్ బాధలు పడ్డారు. ట్రాఫిక్ సమస్య తీరనుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని పనిచేశాం.
– మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్యే
బాలానగర్ రూపురేఖలే మారిపోయాయి..
ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తయ్యాయి. వాహనదారులకు అందుబాటులోకి వచ్చింది. సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాం. ఈ బ్రిడ్జి నిర్మాణంతో బాలానగర్ రపురేఖలే మారిపోయాయి.
– యూసఫ్ హుస్సేన్, హెచ్‌ఎండీఏ ఎస్‌ఇ∙
Comments
Please login to add a commentAdd a comment