సాక్షి, న్యూఢిల్లీ: పదో తరగతి ప్రశ్నపత్రం లీక్ కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టు అంశం దేశ రాజధాని హస్తినను తాకింది. సంజయ్ అరెస్టుపై బీజేపీ అగ్రనేతలు, కేంద్ర మంత్రులు భగ్గుమన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీతోపాటు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, ఇతర నేతలు అత్యవసర సమావేశాలు నిర్వహించి తదుపరి కార్యాచరణపై చర్చించారు. సంజయ్‌కు బాసటగా నిలిచేందుకు కేంద్ర మంత్రులను రాష్ట్రానికి పంపాలని, న్యాయ పోరాటానికి బాసటగా నిలవాలని నిర్ణయించారు. ఇదే సమయంలో రాజకీయ పోరాటంలో భాగంగా ఆందోళనలు, నిరసనలు కొనసాగించాలని రాష్ట్ర నేతలకు సూచించినట్టు తెలిసింది.
పరిణామాలను మోదీకి వివరించిన నడ్డా, షా..
బండి సంజయ్ అరెస్ట్, తదనంతర పరిస్థితులను జేపీ నడ్డాకు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌ఛుగ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వివరించారు. ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారో చెప్పకుండానే సంజయ్‌ను అదుపులోకి తీసుకున్నారని వివరించారు. దీనిపై స్పందించిన నడ్డా.. పార్టీ నేత, న్యాయవాది అయిన రామచందర్‌రావు, కొందరు నేతలతో మాట్లాడారు. అనంతరం దాదాపు అరగంట పాటు అమిత్‌షాతో భేటీ అయ్యారు.
అరెస్టును న్యాయపరంగా ఎదుర్కోవాల్సిన తీరు, రాజకీయంగా ఎండగట్టేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. తర్వాత నడ్డా, అమిత్‌షా ఇద్దరూ మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో పార్లమెంట్‌లో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. కక్షపూరితంగా సంజయ్‌ను అరెస్ట్ చేశారని ప్రధానికి వివరించారు.
ఈ సందర్భంగా సంజయ్ అరెస్ట్‌పై తొలుత న్యాయపరంగా కొట్లాడాలని, అవసరమైతే ఢిల్లీ నుంచి ప్రత్యేక న్యాయబృందాన్ని రాష్ట్రానికి పంపాలని నిర్ణయించినట్టు సమాచారం.
ఇదే సమయంలో రాజకీయంగా ప్రత్యేక కార్యాచరణ తీసుకోవాలని, నిరసన కార్యక్రమల్లో పాల్గొనేలా కేంద్ర మంత్రులను రాష్ట్రానికి పంపాలని భావనకు వచ్చినట్టు సమాచారం. ఈ భేటీ జరిగిన కొంతసేపటికే రాష్ట్ర నేతలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన తరుణ్ ఛుగ్.. గురువారం నుంచి చేపట్టాల్సిన ఆందోళనలపై మార్గనిర్దేశం చేసినట్టు తెలిసింది.
లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు
బండి సంజయ్ అరెస్టుపై బీజేపీ ఎంపీలు బుధవారం లోక్‌సభ స్పీకర్ ఓం ప్రకాశ్‌బిర్లాను కలసి ఫిర్యాదు చేశారు. ఎంపీ అయిన సంజయ్ హక్కులకు భంగం కలిగించేలా పోలీసులు వ్యవహరిస్తున్నారంటూ రూల్ 223 ప్రకారం బీజేపీ ఎంపీ సోయం బాపురావు ప్రివిలేజ్ నోటీసులు అందించారు. అరెస్టుకు కారణాలు చెప్పలేదని.. గుండె సంబంధ వ్యాధితో బాధపడుతున్న సంజయ్‌ను మందులు కూడా తీసుకోనివ్వలేదని ఆరోపించారు.
తర్వాత ఈ అంశంపై పార్లమెంటులోని గాంధీ విగ్రహం వద్ద ఎంపీలు కె.లక్ష్మణ్, జీవీఎల్ నరసింహారావు, సోయం బాపురావు నిరసన తెలిపారు. సంజయ్ అరెస్టును ట్విట్టర్ వేదికగా కేంద్రమంత్రులు పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, అనురాగ్ ఠాకూర్ తదితరులు ఖండించారు. బీజేపీకి పెరుగుతున్న ఆదరణను ఓర్వలేక, అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు కేసీఆర్ ప్రభుత్వం ఇలాంటి చర్యలకు దిగుతోందని ఆరోపించారు.
మెసేజ్ వస్తే చూడటం తప్పా?
కేసీఆర్ ప్రభుత్వం ఏ వ్యవస్థలనూ గౌరవించడం లేదు. కారణాలు చెప్పకుండా అరెస్టులు చేస్తున్నారు. పరీక్ష పత్రాల లీకేజీ వ్యవహారాల్లో ప్రజలను తప్పదోవ పట్టించేలా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. మెసేజ్‌లు వస్తే చూడటం కూడా తప్పేనా? సంజయ్ అరెస్టుపై, కేసీఆర్ కుటుంబ అవినీతి పాలనపై బీజేపీ శ్రేణులు అన్ని రకాలుగా పోరాడుతాయి. పాలన తీరును ప్రశ్నించినందుకు జైల్లో వేస్తామంటే.. బీజేపీ నేతలెవరూ భయపడరు.
– తరుణ్ ఛుగ్, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి
బీఆర్‌ఎస్‌కు ఇవి చివరి రోజులు
సంజయ్‌ను అక్రమంగా అరెస్ట్ చేయడం ద్వారా దాష్టీకానికి పాల్పడ్డారు. అవినీతి ఆరోపణలతో సతమతమవుతున్న బీఆర్‌ఎస్ పార్టీ, దాని నాయకత్వం రాజకీయ అస్తిత్వానికి ఇవి చివరి రోజులు.
– బీఎల్ సంతోష్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి
ప్రధాని పర్యటనను పక్కదోవ పట్టించేందుకే..
వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమికి తనను కన్వీనర్‌ను చేస్తే పార్టీలకు నిధులిస్తానని కేసీఆర్ చెప్పిన విషయాన్ని ప్రముఖ పాత్రికేయుడు రాజ్‌దీప్ సర్దేశాయ్ బయటపెట్టారు. పైగా ఈనెల 8న హైదరాబాద్‌లో ప్రధాని పర్యటన ఉంది. ఈ అంశాలను పక్కదోవ పట్టించేందుకే బండి సంజయ్‌ను అక్రమంగా అరెస్ట్ చేశారు.
– ధర్మపురి అరవింద్, ఎంపీ
లీకేజీలు, ప్యాకేజీలు బయటకు రావొద్దనే..
బండి సంజయ్‌ను అకారణంగా, అన్యాయంగా అరెస్టు చేశారు. లీకేజీలు, ప్యాకేజీల విషయం బయటికి రాకుండా ప్రశ్నించే గొంతులను నొక్కే ప్రయత్నమిది. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు గుణపాఠం తప్పదు.
– కె.లక్ష్మణ్, ఎంపీ
మోదీ దృష్టికి బండి అరెస్టు
Published Thu, Apr 6 2023 1:37 AM | Last Updated on Thu, Apr 6 2023 8:16 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment