సాక్షి, హైదరాబాద్: బాలికపై సామూహిక అత్యాచారం ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ దర్యాప్తునకు ముందుకు రాకుంటే.. బాధితులకు న్యాయం జరిగేదాకా న్యాయపరంగా బీజేపీ పోరాడుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. ఈ ఘటనపై సీబీఐ విచారణ జరిపించేలా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌కు రాసిన బహిరంగ లేఖలో కోరారు. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య, డ్రగ్స్ సహా ఎనిమిదేళ్లుగా సాగుతున్న అనేక ఘటనలపై అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలన్నారు. పబ్బులను వెంటనే మూసివేయాలని డిమాండ్ చేశారు.
అత్యాచారం ఘటనపై ప్రభుత్వం, పోలీసులు వ్యవహరిస్తున్న తీరు నిందితులకు అండగా నిలబడుతున్నట్లు స్పష్టమౌతుందని చెప్పారు. ఇందులో రాష్ట్ర హోంమంత్రి మనవడు, ఎంఐఎం ఎమ్మెల్యే కుమారుడు, వక్ఫ్‌బోర్డు చైర్మన్ కుమారుడు, టీఆర్‌ఎస్ నాయకుల కుటుంబసభ్యుల ప్రమేయం ఉందని వెల్లడించారు. దీంతో పోలీసులు నిష్పాక్షిక విచారణ జరుపుతారనే నమ్మకం ప్రజలకు లేదన్నారు. అధికార పార్టీ పెద్దలు, ఎంఐఎం నేతల కుటుంబసభ్యులను కేసు నుంచి తప్పించడానికి సీసీ ఫుటేజీను, ఇతర ఆధారాలను తారుమారు చేసి కేసును పక్కదారి పట్టించేందుకు పోలీస్‌శాఖ శతవిధాలా ప్రయత్నిస్తోందని బండి ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment