బంజారాహిల్స్: అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వీధికుక్కను చేరదీయడమే కాకుండా ఆస్పత్రికి తీసుకెళ్లి ఎక్స్‌రే తీయించి చికిత్స నిర్వహించిన ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు ఆ వీధికుక్క ఆరోగ్యంపై దృష్టి పెట్టారు. బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కు వద్ద విధి నిర్వహణలో ఉండే ఇంటర్‌సెప్టర్ వెహికిల్ పోలీస్ కానిస్టేబుల్ కె.ప్రవీణ్‌కుమార్, హోంగార్డ్ ఎ.నరేష్ ఇద్దరు గత మూడు వారాల నుంచి పార్కు వద్ద అనారోగ్యంతో బాధపడుతున్న వీధికుక్కను చూస్తూ నిఘా ఉంచారు. ఆహారం తినకుండా దగ్గుతూ గొంతులో ఏదో ఇరుక్కున్నట్లుగా అవస్థలు పడుతున్న ఆ కుక్కను చూసి చలించిపోయారు.
సోమవారం ఉదయం వీరు ఆ కుక్కను తమ వాహనంలో తీసుకెళ్లి బంజారాహిల్స్ రోడ్ నంబర్.3లోని సాగర్‌సొసైటీలో ఉన్న పెట్ క్లినిక్‌లో ఎక్స్‌రే తీయించారు. వైద్యపరీక్షలు నిర్వహించేలా చేశారు. ఎక్స్‌రేలో దాని ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిన్నాయని తెలియడంతో సంబంధిత డాక్టర్ వ్యాధి తగ్గుదల కోసం మందులు రాసిచ్చాడు. పెట్ క్లినిక్‌లో ఫీజులు చెల్లించిన ఈ పోలీసులు మందులను కూడా తమ సొంత డబ్బులతోనే కొనుగోలు చేసి మళ్లీ కేబీఆర్ పార్కు వద్ద వదిలిపెట్టారు.
‘బ్రౌనీ’ అని ఈ వీధికుక్కకు పేరుపెట్టుకున్న ఈ పోలీసులు ప్రతిరోజు బిస్కెట్లు, ఇతర ఆహార పదార్థాలు తీసుకొచ్చి పెడుతుంటారు. ఒక్కసారిగా అనారోగ్యానికి గురైన ఈ కుక్కను చూసి చలించిపోయి తమ సొంత డబ్బులతోనే వైద్యపరీక్షలు నిర్వహించిన వీరి గొప్పదనాన్ని అధికారులు సైతం ప్రశంసించారు. ఈ కుక్క ఆరోగ్యం ఇంకో రెండు వారాల్లో మెరుగుపడుతుందని వైద్యులు చెప్పడంతో పోలీసులిద్దరూ దాని ఆరోగ్యంపైనే పూర్తి దృష్టి కేంద్రీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment