సాక్షి, మంచిర్యాల: మెట్టినింటికి వెళ్లేటప్పుడు అప్పగింతల్లో కొత్తగా పెళ్లయిన వధువు కన్నవారిని తలుచుకుంటూ కన్నీరు పెట్టుకుంటుంది. ఈ సీన్ ఎక్కడైనా చూస్తాం. కానీ ఈ వధువు మాత్రం కాస్త డిఫరెంట్. కట్టుకున్న భర్తతో జీవితాంతం సంతోషంగా ఉంటాననే ఆనందంతో స్టెప్పులేసింది. మంచిర్యాల జిల్లా జన్నారానికి చెందిన నవవధువు సాయి శ్రీయ అప్పగింతల్లో కొత్త ట్రెండ్‌ను సృష్టించింది. ఇటీవల బాగా హిట్ అయిన ఓ ప్రైవేట్ ఆల్బమ్‌లోని గాయని మోహన భోగరాజు పాడిన ‘బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా..’ పాటకు కట్టుకున్న భర్త ముందు ఆడి కొత్త జీవితంలోకి భర్తను మనసారా ఆహ్వానించింది. పాటలోని పదాలకు అనుగుణంగా స్టెప్పులేస్తూ నూతన వరుడిని ఆకట్టుకుంది.
‘పట్టుచీరనే గట్టుకున్నా.. గట్టుకున్నుల్లో గట్టుకున్నా’అంటూ తన సింగారాన్ని ఒలకపోసింది. ‘నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా..’అంటూ చేతిని తన భర్తకందించింది. ‘నువ్వు నన్నేలుకున్నావురో దండ మెల్లోన ఏస్తానురో.. నేను నీ యేలు వట్టుకోని మల్లె జల్లోన ఎడతానురో’అంటూ తన ఆనందం వ్యక్తపరిచింది. ‘మంచి మర్యాదలు తెలిసినదాన్ని.. మట్టి మనుషుల్లోనా పెరిగినదాన్ని’అంటూ నిష్కపటత్వాన్ని ఆవిష్కరించింది. ‘నే అవ్వసాటు ఆడపిల్లనయ్యో.. మా నాన్న గుండెల్లోనా ప్రేమనయ్యో.. ఏడు గడపలల్ల ఒక్కదాన్నిరయ్యో.. మా అన్నదమ్ములకు ప్రాణమయ్యో ప్రాణమయ్యో, నేను ప్రాణమయ్యో..’అంటూ తన కుటుంబ సభ్యులతో ఉన్న అనుబంధాన్ని తన భర్తకు వివరించింది. ‘ఎన్ని మారాలు జేస్తు ఉన్నా నన్ను గారాలు జేసుకొని.. చేతుల్లో పెంచారు పువ్వల్లే నన్ను’అంటూ తాను ఎంత గారాబంగా పెరిగిందో చెప్పుకొచ్చింది.
డ్యాన్స్ చేస్తున్న పెళ్లి కూతురు సాయి శ్రీయ
‘నా కుడికాలు నీ ఇంట్లో వెట్టినంకా వెట్టినంకుల్లో, వెట్టినంకా.. సిరిసంపద సంబురం గల్గునింకా గల్గునింకుల్లో, గల్గునింకా’అంటూ తాను అడుగు పెడితే అత్తవారింటికి ఐశ్వర్యాలే అంటూ పాటలోని చరణాలకు తగ్గట్టుగా డ్యాన్స్ చేసి ఆకట్టుకుంది. సాయిశ్రీయ చేసిన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. పెళ్లి కూతురు భలేగా డ్యాన్స్ చేసిందంటూ నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. బయట కూడా ఈ డ్యాన్స్ గురించే చర్చించుకుంటున్నారు. కొత్త దంపతులు ఇలాగే జీవితాంతం సంతోషంగా ఉండాలంటూ కామెంట్లు పెడుతూ విష్ చేస్తున్నారు.
ట్రెండ్ సృష్టించిన వధువు: ఈ నెల 14న మంచిర్యాల జిల్లా జన్నారానికి చెందిన అటవీ శాఖ ఉద్యోగి ఎఫ్‌ఎస్‌వో రాము, సురేఖ దంపతుల పెద్ద కూతురు సాయి శ్రీయను రామక్రిష్ణాపూర్‌కు చెందిన ఆకుల అశోక్‌తో వివాహం జరిపించారు. అప్పగింతల సమయంలో వధువు చేసిన డ్యాన్స్ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయగా, గత రెండు రోజులుగా అన్ని సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అయింది. ఒక్క రోజులోనే యూట్యూబ్‌లో 3.5 లక్షల మంది ఈ వీడియోను వీక్షించారు. కుటుంబసభ్యులు, వధూవరులు ‘సాక్షి’తో మాట్లాడుతూ.. సరదాగా చేసిన డ్యాన్స్ ఇంత ప్రాచుర్యం పొందుతుందని అనుకోలేదని ఆనందం వ్యక్తం చేశారు. సాయి శ్రీయ ప్రస్తుతం విప్రోలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తోంది. వరుడు అశోక్ జీహెచ్‌ఎంసీ పరిధిలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు. (చదవండి: ‘బుల్లెట్టు బండి’ పాటకు వధువు సూపర్ డ్యాన్స్ .. భర్త ఫిదా)
ఐఏఎస్ ఆఫీసర్ ట్వీట్..
కరీంనగర్‌కు చెందిన మధ్యప్రదేశ్ కేడర్ ఐఏఎస్ అధికారి పి.నరహరి ఈ పాటపై స్పందించారు. ‘పెళ్లి కూతురు.. పెళ్లికొడుకు కోసమే డ్యాన్స్ చేసింది. సంతోషంగా అతన్ని తన జీవితంలోకి ఆహ్వానిస్తోంది. నిజమైన ప్రేమ.. అతడి బుల్లెట్టు బండిపై సవారీ చేయాలనుకుంటోంది’అని ట్వీట్ చేశారు.
చదవండి: కొత్త మొక్క కనుగొన్న శాస్త్రవేత్తలు: పేరేంటంటే ‘జలకన్య’
చదవండి: ప్రధాని మోదీకి ప్రత్యేక ఆలయం.. ఎక్కడో తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment