మెస్‌లో భోజనం చేయకుండా కూర్చున్న విద్యార్థులు
నిర్మల్/బాసర: ఫుడ్ పాయిజన్ ఘటన జరిగి 15 రోజులు దాటినా.. మెస్ కాంట్రాక్టర్లను మార్చలేదని, ఆరోజు తమకు అధికారులిచ్చిన హామీలు నెరవేర్చలేదని బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు శనివారం రాత్రి నిరసనకు దిగారు. మెస్‌లలో ఖాళీ బెంచీలపై కూర్చుని డిన్నర్ బాయ్‌కాట్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో ఈ–1, ఈ–2కు చెందిన మూడువేల మంది విద్యార్థులు పాల్గొన్నారు.
ఈనెల 15న ట్రిపుల్‌ఐటీలో ఫుడ్‌పాయిజన్ జరిగింది. మెస్‌లలో నాసిరకం, నాణ్యతలేనివి ఉపయోగించడం వల్లే ఇది జరిగిందని, తమ ప్రాణాల మీదకు వచ్చిందని అదేరోజు విద్యార్థులు ఆందోళన వ్యక్తంచేశారు. దీంతో ఇన్‌చార్జి వీసీ వెంకటరమణ ఈనెల 24నాటికి డిమాండ్లు నెరవేరుస్తామని హామీఇచ్చారు. అయితే సదరు హామీలేవీ నెరవేరకపోవడంతో శనివారం మళ్లీ విద్యార్థులు ఆందోళనకు దిగారు.
దీంతో స్పందించిన అధికారులు రాత్రి 10 గంటల తరువాత మెస్ కాంట్రాక్టర్ల కోసం టెండర్లు పిలుస్తున్నట్లు ప్రకటించారు. వర్సిటీలోని 8,684 మంది విద్యార్థులకు భోజనాలు, టిఫిన్స్ అందించేందుకు ఆగస్టు 6లోపు టెండర్లు దాఖలు చేయాలని డైరెక్టర్ సతీశ్ పేరిట ఆ టెండర్‌లో పేర్కొన్నారు. అయితే విద్యార్థులు మాత్రం రాత్రి 11 గంటల వరకు భోజనం చేయలేదు.
Comments
Please login to add a commentAdd a comment