బాసర ట్రిపుల్‌ఐటీకి న్యాక్‌ ‘సి’ గ్రేడ్‌ | Basara IIIT Gets C Grade From NAAC | Sakshi
Sakshi News home page

బాసర ట్రిపుల్‌ఐటీకి న్యాక్‌ ‘సి’ గ్రేడ్‌

Published Mon, Jan 3 2022 3:29 PM | Last Updated on Mon, Jan 3 2022 3:29 PM

Basara IIIT Gets C Grade From NAAC - Sakshi

బాసర (ముధోల్‌): నిర్మల్‌ జిల్లాలోని బాసర ట్రిపుల్‌ఐటీ (ఆర్జీయూకేటీ)కి న్యాక్‌ ‘సి’ గ్రేడ్‌ గుర్తింపునిచ్చింది. నేషనల్‌ అసెస్‌మెంట్‌ అండ్‌ అక్రెడిటేషన్‌ కమిటీ బృందం గతేడాది బాసరను సందర్శించిన విషయం తెలిసిందే. ఉన్నత విద్యాసంస్థల్లో స్థితిగతులు, మౌలిక వసతులు, బోధన, బోధనేతర అంశాలు, పరిశోధనలు ఇలా ప్రతీ అంశాన్ని పరిశీలించి తదనుగుణంగా న్యాక్‌ గ్రేడ్లను నిర్ణయిస్తుంది. ఇందులో భాగంగా బాసర ట్రిపుల్‌ ఐటీకి ‘సి’ గ్రేడ్‌ ప్రదానం చేస్తూ కమిటీ సర్టిఫికెట్‌ను తన వెబ్‌సైట్‌లో పొందుపర్చింది. 

అధికారుల తీరే కారణమా..?
తెలంగాణకే తలమానికమైన బాసర ట్రిపుల్‌ ఐటీలో ప్రవేశాల కోసం ఏటా వేల సంఖ్యలో విద్యార్థులు పోటీ పడతారు. ఎన్నో ఆశలతో వర్సిటీలో అడుగుపెట్టిన వారిని ఈసారి న్యాక్‌ గ్రేడ్‌ నిరాశపర్చింది. స్థానిక అధికారుల తీరుతో పాటు న్యాక్‌ బృందం వర్సిటీలో పర్యటించినప్పుడు వీసీ పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోవడంతోనే సరైన గుర్తింపు దక్కలేదనే విమర్శలున్నాయి. అలాగే కమిటీకి వర్సిటీ అధికారులు వివరించిన తీరు కూడా సరిగా లేదనే వాదన కూడా వినిపిస్తోంది.

మరోవైపు వర్సిటీ ప్రారంభం నుంచి రెగ్యులర్‌ వీసీ లేకపోవడం, పరిశోధనలకు పెద్దపీట వేయకపోవడం వంటి విషయాలు బృందాన్ని నిరాశపర్చినట్లు సమాచారం. న్యాక్‌గ్రేడ్‌ ఆధారంగానే యూజీసీ (యూనివర్సిటీ గ్రాంట్‌ కమిషన్‌) నిధుల మంజూరు ఉంటుంది. ఈ గ్రేడ్‌ ఆధారంగానే క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లలో మల్టీ నేషనల్‌ కంపెనీలు పాల్గొనడంతో పాటు వర్సిటీకి జాతీయ స్థాయి గుర్తింపు దక్కుతుంది. వర్సిటీ నుంచి విద్యార్థికి లభించిన సర్టిఫికెట్‌నూ హైప్రొఫైల్‌గా భావిస్తారు. ఈక్రమంలో వర్సిటీకి తక్కువ గ్రేడ్‌ గుర్తింపు రావడంపై వారంతా నిరాశ వ్యక్తం చేస్తున్నారు. (సూర్యాపేటలో ర్యాగింగ్‌ రక్కసి; గదిలో బంధించి.. పిడిగుద్దులు గుద్ది)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement