![Beer Prices Hike By Telangana Govt](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/beer.jpg.webp?itok=bIAXBJUw)
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బీర్ల ధరలు పెరిగాయి. బీరు కంపెనీలకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాథమిక ధర (బేసిక్ ప్రైస్)ను, తదనుగుణంగా బీర్ల గరిష్ట చిల్లర ధర (ఎమ్మార్పీ)ను పెంచుతూ ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఏఎం రిజ్వీ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ధరల నిర్ణాయక కమిటీ (పీఎఫ్‌సీ) సిఫారసు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే ధరలు ఏ మేరకు పెంచాలన్న దానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు.
విశ్వసనీయ సమాచార ప్రకారం అన్నిరకాల బ్రాండ్లపై 15% మేర ప్రాథమిక ధర పెంపునకు ప్రభుత్వం అనుమతించింది. అంటే ప్రస్తుతం ఉన్న ఎమ్మార్పీపై 15% మేర పెంచి బీర్లను విక్రయిస్తారన్నమాట. దీని ప్రకారం లైట్ బీరు ధర ప్రస్తుతం ఉన్న రూ.150 నుంచి రూ.180కి పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా స్ట్రాంగ్ బీరు రూ.160 నుంచి రూ.190కి పెరగనుంది. మద్యం ధరల పెంపులో ప్రభుత్వం అనుసరించే రౌండింగ్ అఫ్ పద్ధతి ప్రకారం ధరలు పెరిగే అవకాశం ఉందని ఎక్సైజ్ వర్గాలు వెల్లడించాయి.
పాత స్టాకు పాత రేటుకే: ప్రస్తుతం డిపోల్లో ఉన్న బీర్లు, సోమవారం డిపోల నుంచి వైన్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లకు వెళ్లిన బీర్ల ధరలు మంగళవారం నుంచి పెరుగుతాయి. సోమవారం నాటికే వైన్ షాపులకు చేరుకున్న బీర్లను మాత్రం పాత ధరలకే అమ్మాల్సి ఉంటుంది. వాస్తవానికి ధరల పెంపు సమయంలో ప్రతి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఎంత స్టాకు ఉంది అనే వివరాలను తెలుసుకోవడంతో పాటు ధర ఎంత పెరుగుతుంది అనే సమాచారం కూడా క్షేత్రస్థాయి సిబ్బందికి ఎక్సైజ్ శాఖ అందిస్తుంది.
కానీ ఈసారి ఉత్తర్వులు అలా రాలేదని, తమను ఎలాంటి స్టాక్ వివరాలు అడగలేదని ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో బీర్ల ధర సరిగ్గా ఎంత పెరుగుతుంది అన్న దానిపై మంగళవారమే స్పష్టత రానుంది. ఇటీవల బేసిక్ ధరల పెంపు, బకాయిల చెల్లింపు విషయంలో ప్రభుత్వ తీరుకు నిరసనగా కింగ్‌ఫిషర్ బ్రాండ్ తయారు చేసే మద్యం కంపెనీ సరఫరా నిలిపివేసింది. అయితే కొద్ది కాలం తర్వాత మళ్లీ పునరుద్ధరించింది. ఈ విధంగా బీర్ల కంపెనీలు చాలాకాలంగా చేస్తున్న డిమాండ్‌ను, ధరల నిర్ణాయక కమిటీ సిఫారసును పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం, బేసిక్ ధర తదనుగుణంగా ఎమ్మార్పీని కూడా పెంచుతూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment