గ్రేటర్‌లో పెరిగిన వీటి విక్రయాలు
రోజుకు 80 వేల కేసులకు పైగా అమ్మకాలు
డిమాండ్ మేరకు పెరగని ఉత్పత్తి
బీర్‌ల తయారీని తగ్గించిన కంపెనీలు
సాక్షి, హైదరబాద్: గ్రేటర్‌లో బీర్‌ల అమ్మకాలు పెరిగాయి. ప్రతీ వేసవిలో సాధారణంగానే బీర్‌లకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. మద్యం ప్రియులు లిక్కర్‌కు బదులు చల్లటి బీర్‌ల వైపు మొగ్గు చూపుతారు. వేసవి తాపం నుంచి ఊరట పొందేందుకు వీటిని ఆశ్రయిస్తారు. పెరిగిన బీర్‌ల అమ్మకాల మేరకు ఉత్పత్తి మాత్రం పెరగడం లేదు. ప్రతిరోజూ గ్రేటర్‌లో 60 వేల నుంచి 80 వేల కేస్‌లకు పైగా బీర్‌లు అమ్ముడవుతున్నట్లు అంచనా. మరో 20 వేల కేస్‌లకు డిమాండ్ ఉన్నప్పటికీ కొరత దృష్ట్యా వినియోగదారులకు అందడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వంద కేస్‌ల కోసం ఆర్డర్ చేసే వైన్ షాపులకు 70 కేస్‌ల వరకే లభిస్తున్నట్లు వైన్‌షాపుల నిర్వాహకులు తెలిపారు. ఏప్రిల్ నెలలోనే కొరత ఇలా ఉంటే మే నెలంతా బీర్‌ల డిమాండ్‌ను ఎదుర్కోవడం ఎలా అని వ్యాపారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
వచ్చే నెల మరింత డిమాండ్..
బీర్ కంపెనీల నుంచి ప్రస్తుతం రోజుకు లక్షన్నర నుంచి 2 లక్షల కేస్‌ల వరకు అందుతున్నాయని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజూ లక్షన్నర నుంచి 2 లక్షల కేస్‌లు అమ్ముడవుతున్నట్లు అంచనా. గ్రేటర్‌లోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోనే సగానికి ఎక్కువగా బీర్‌ల విక్రయాలు జరుగుతున్నాయి. గతేడాది ఏప్రిల్‌లో గ్రేటర్‌లో సుమారు 12 లక్షల కేస్‌లకుపైగా బీర్‌ల అమ్మకాలు జరిగాయి. ఈసారి 15 లక్షల కేస్‌లకు పైగా డిమాండ్ ఉండే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
మే నెలలో ఈ డిమాండ్ మరింత పెరగనుంది. ఈ మేరకు ఉత్పత్తి పెరగడం లేదని అధికారులు చెబుతున్నారు. ‘ఇప్పటి వరకు సాధారణ రోజుల్లోలాగే బీర్‌ల ఉత్పత్తి ఉంది. డిమాండ్ మేరకు పెరగలేదు. కానీ.. ఎండలు తీవ్రమయ్యే కొద్దీ ఉత్పత్తి పెంచాల్సి ఉంటుంది. ఈ మేరకు కంపెనీలు బీర్‌లను అందజేస్తాయా? లేదా? అనే అంశంపై సందిగ్ధత నెలకొంది’ అని ఒక అధికారి వివరించారు. మరోవైపు బీర్‌ల అమ్మకాలు పెరగడంతో మద్యం విక్రయాలు కొంత మేరకు తగ్గుముఖం పట్టినట్లు వైన్‌షాపుల నిర్వాహకులు చెప్పారు.
బకాయిల పెండింగ్..
వినియోగదారుల డిమాండ్ మేరకు లక్షల కొద్దీ కేస్‌ల బీర్‌లను ఉత్పత్తి చేసే కంపెనీలు కొన్ని రోజులుగా ఉత్పత్తిని తగ్గించాయి. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు పెండింగ్‌లో ఉండడమే ఇందుకు కారణమని వ్యాపార వర్గాలు తెలిపారు. దాదాపు రూ.4 వేల కోట్లు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. దీంతో 8 కంపెనీలు తమ ఉత్పత్తిని తగ్గించుకున్నాయి. సిబ్బంది సంఖ్యను కూడా తగ్గించారు. ఒకవైపు బీర్‌ల అమ్మకాలు గణనీయంగా పెరుగుతుండగా.. మరోవైపు వీటి తయారీ సంస్థలు ఉత్పత్తులను తగ్గించడం గమనార్హం.
వేసవి కారణంగా నీటి ఎద్దడి కూడా బీర్‌ల తయారీకి ఇబ్బందిగా మారిందని పలు కంపెనీల నిర్వాహకులు చెబుతున్నారు. ‘రోజుకు లక్షన్నర నుంచి 2 లక్షల కేసుల బీర్‌లను ప్రస్తుతం తయారు చేస్తున్నాం. కానీ ఇదే సమయంలో గతంలో 2 లక్షల కేస్‌లకు పైగా కూడా ఉత్పత్తి జరిగింది. డిమాండ్ మేరకు ఉత్పత్తి పెరగాల్సి ఉండగా, వివిధ కారణాల దృష్ట్యా అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది’ అని ఒక కంపెనీ నిర్వాహకుడు విస్మయం వ్యక్తం చేశారు. 40 లక్షల లీటర్‌ల నీళ్లు బీర్‌ల ఉత్పత్తికి అవసరమని, కొద్దిరోజులుగా నీటి లభ్యత తగ్గడంతోనూ బీర్‌ల ఉత్పత్తిపై ప్రభావం పడిందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment