విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు రావొద్దు
అధికారులు, సిబ్బందితో సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి
సాక్షి, హైదరాబాద్: వర్షాకాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యుత్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ఆదేశించారు. వర్షాలు, ఈదురుగాలుల మూలంగా చెట్లు విరిగిపోవడం, స్తంభాలు కూలిపోవడం, విద్యుత్ తీగలు ఊడిప డటం లాంటి ఘటనలు జరుగుతుంటాయని, క్షేత్రస్థాయి సిబ్బంది అప్రమత్తంగా ఉండి సమస్య వచి్చన వెంటనే స్పందించాలని సూచించారు. శని వారం సచివాలయంలో ఆయన విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ‘ప్రజలు, పరిశ్రమలకు అవసరమైన విద్యుత్ అందుబాటులో ఉంది.
సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు చేపట్టండి. లైన్స్ క్లియరెన్స్ (ఎల్‌సీ) విషయంలో జాగ్రత్త వహించాలి. ఒకేసారి పలు ప్రాంతాల్లో ఎల్‌సీలు ఇవ్వొద్దు. ఎల్‌సీ తీసుకునే సమయంలో స్థానిక వినియోగదారులకు ముందస్తు సమాచారం ఇవ్వండి. వర్షాకాలంలో కరెంటు సరఫరా, మరమ్మతులు, పునరుద్ధరణ విషయంలో ఇంధన శాఖ ప్రధాన కార్యదర్శి నుంచి క్షేత్రస్థాయిలోని లైన్‌మెన్ వరకు అప్రమత్తంగా ఉండాలి. నిరంతరం సమీక్షలు నిర్వహించడంతో పాటు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేసుకోండి’అని భట్టి ఈ సమీక్షలో సూచించారు. ఈ సమావేశంలో ఇంధన శాఖ ప్రధాన కార్యదర్శి ఎస్.ఎం.ఎ.రిజ్వి, ఎస్‌పీడీసీఎల్ ఎండీ ముషారఫ్ అలీ, ట్రాన్స్‌కో జేఎండీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
అమరుల ఆశయాలకు అనుగుణంగా ప్రజాపాలన..
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా రాష్ట్ర ప్రజలకు భట్టి విక్రమార్క శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, ఆలోచనల మేరకు యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ ప్రజల చిరకాల కోరికను నెరవేర్చారని శనివారం ఒక ప్రకటనలో ఆయన తెలిపారు. బీఆర్‌ఎస్ హయాంలో తెలంగాణ రాష్ట్ర సాధన ఆశయాలు, ఆకాంక్షలు పదేళ్లుగా ఆచరణకు నోచుకోలేదని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం పాలన మొదలయ్యాక ప్రజలు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటున్నారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment