రూ.12వేల సాయానికి అర్హుల ఎంపిక ఎలా? | bhatti vikramarka says land less farmers get 12k for year new scheme will start | Sakshi
Sakshi News home page

రూ.12వేల సాయానికి అర్హుల ఎంపిక ఎలా?

Published Mon, Dec 16 2024 5:17 AM | Last Updated on Mon, Dec 16 2024 5:17 AM

bhatti vikramarka says land less farmers get 12k for year new scheme will start

తొలి విడతగా ప్రతి భూమి లేని కుటుంబానికి రూ. 6వేలు

భూమిలేని వ్యవసాయ కుటుంబాల లెక్క ఎలా తీసుకుంటారు? 

రాష్ట్రంలో 40 లక్షల కుటుంబాలకు భూమి లేదని అంచనా  

30 లక్షల కుటుంబాలను అర్హులుగా గుర్తించినా 

ఏటా రూ.3,600 కోట్ల భారం పడే అవకాశం 

అసెంబ్లీ సమావేశాల్లో అర్హుల ఎంపికపై స్పష్టత వచ్చే అవకాశం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో భూమిలేని ప్రతీ కుటుంబానికి ఏటా రూ.12వేల ఆర్థిక సాయాన్ని అందించే పథకానికి ఈ నెల 28న శ్రీకారం చుట్టబోతున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించిన నేపథ్యంలో అర్హుల ఎంపికపై జోరుగా చర్చ సాగుతోంది. ఏడాదిలో రెండు విడతలుగా ఈ మొత్తాన్ని చెల్లిస్తామని, తొలి విడతగా ఈనెల 28న అర్హుల బ్యాంకు ఖాతాల్లో జమచేయనున్నట్లు భట్టి చెప్పారు. రాష్ట్రంలో వ్యవసాయ భూమి ఉన్న రైతులకు ఎకరాకు ఏటా రూ. 12వేల చొప్పున ఆర్థిక సాయం అందించే కార్యక్రమం ఇప్పటికే కొనసాగుతోంది.

రైతులతోపాటు రైతు కూలీలకు కూడా సాయం అందజేయనున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. గత సెపె్టంబర్‌లో రూ.12వేల సాయం ప్రకటన చేసిన భట్టి ఆదివారం ఖమ్మంలో ఈ మేరకు స్పష్టత ఇచ్చారు. ఈ నెల 28న తొలివిడతగా రూ. 6వేలు ఇస్తామని ప్రకటించారు. సోమవారం నుంచి పునఃప్రారంభమవుతున్న శాసనసభ సమావేశాల్లో భూమిలేని పేదలను గుర్తించి, ఎంత మందికి పథకాన్ని అమలు చేయాలనే అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.  

భూమిలేని పేదలు ఎందరు? 
రాష్ట్రంలో రైతు కుటుంబాలు 64 లక్షల వరకు ఉండగా, భూమిలేని కుటుంబాలు, కూలీ నాలీ చేసుకునే వారు కలిపి 50 లక్షల వరకు ఉన్నట్లు అంచనా. అయితే రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం కింద 53.06 లక్షల కుటుంబాల్లోని వారికి జాబ్‌కార్డులున్నాయి. వారిలో 34.52 లక్షల కుటుంబాల వారే ఈ పథకాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకుంటున్నట్లు ఇటీవల ఓ సర్వేలో తేలింది. జాబ్‌కార్డు ఉన్న వారిలో కూడా కొందరు చిన్న, సన్నకారు రైతులు ఉంటారు. అయితే, భూమిలేని కుటుంబాలను గుర్తించేందుకు ఇప్పటివరకు పూర్తిస్థాయి సర్వే ఏదీ జరగలేదు.

2014లో జరిపిన సకుటుంబ సర్వే వివరాలు వెల్లడి కాకపోగా, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇటీవల చేపట్టిన కులగణనతో కూడిన కుటుంబసర్వే ఇంకా పూర్తికాలేదు. అయితే మండలాల స్థాయిలో ఉన్న లెక్కల ప్రకారం సుమారు 40లక్షల కుటుంబాలను భూమిలేని కుటుంబాలుగా ప్రభుత్వం గుర్తించినట్లు సమాచారం. ఏ పథకానికైనా రేషన్‌కార్డును ప్రాథమిక అర్హతగా చెబుతున్న ప్రభుత్వం.. రైతు రుణమాఫీ తరహాలో కుటుంబంలో ఒక్కరినే ఇందుకు అర్హులుగా గుర్తిస్తుందా అనేది తెలియాల్సి ఉంది.

గుంట భూమి ఉన్న రైతుకు కూడా రైతుభరోసా పథకాన్ని వర్తింపజేస్తున్న ప్రభుత్వం.. ఈ పథకంలో లబ్ధి పొందని వారందరినీ భూమిలేని కు టుంబాలుగా పరిగణనలోకి తీసుకుంటుందేమోన ని రైతు కూలీ సంఘాల నేతలు పేర్కొంటున్నారు.  

30 లక్షల కుటుంబాలకు ఇచ్చినా..
భూమిలేని కుటుంబాలను ప్రభుత్వం ఏ ప్రాతిపదికన గుర్తించినా... కనీసం 30 లక్షల కుటుంబాలను అర్హులుగా తేల్చే అవకాశం ఉందని సమాచారం. ఈలెక్కన ఒక్కో కుటుంబానికి తొలివిడత రూ. 6వేల చొప్పున బ్యాంకు ఖాతాల్లో వేస్తే రూ.1,800 కోట్ల భారం ప్రభుత్వంపై పడే అవకాశం ఉంది. ఈలెక్కన సంవత్సరానికి రూ. 3,600 కోట్లు అవసరమవుతాయి. అర్హుల గుర్తింపుపై స్పష్టత వస్తే ఈ లెక్కల్లో తేడా ఉండే అవకాశం ఉంది.

అర్హులందరికీ ఇవ్వాలి
సారంపల్లి మల్లారెడ్డి, సీపీఎం నేత 
కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు భూమిలేని కుటుంబాలకు, రైతు కూలీలకు రూ.12వేల ఆర్థిక సాయాన్ని చిత్తశుద్ధితో అమలు చేయాలి. రైతు రుణమాఫీలో కోతలు పెట్టినట్టుగా ఈ పథకం కింద పేదలకు అన్యాయం చేయొద్దు. రాష్ట్రంలో 60 లక్షల వ్యవసాయ కుటుంబాలు ఉంటే, 40 లక్షల కుటుంబాలు భూమి లేని పేదలే. వీరందరికీ ఆర్థిక సాయాన్ని అందించాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement