Landless People
-
రూ.12వేల సాయానికి అర్హుల ఎంపిక ఎలా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూమిలేని ప్రతీ కుటుంబానికి ఏటా రూ.12వేల ఆర్థిక సాయాన్ని అందించే పథకానికి ఈ నెల 28న శ్రీకారం చుట్టబోతున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించిన నేపథ్యంలో అర్హుల ఎంపికపై జోరుగా చర్చ సాగుతోంది. ఏడాదిలో రెండు విడతలుగా ఈ మొత్తాన్ని చెల్లిస్తామని, తొలి విడతగా ఈనెల 28న అర్హుల బ్యాంకు ఖాతాల్లో జమచేయనున్నట్లు భట్టి చెప్పారు. రాష్ట్రంలో వ్యవసాయ భూమి ఉన్న రైతులకు ఎకరాకు ఏటా రూ. 12వేల చొప్పున ఆర్థిక సాయం అందించే కార్యక్రమం ఇప్పటికే కొనసాగుతోంది.రైతులతోపాటు రైతు కూలీలకు కూడా సాయం అందజేయనున్నట్లు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. గత సెపె్టంబర్లో రూ.12వేల సాయం ప్రకటన చేసిన భట్టి ఆదివారం ఖమ్మంలో ఈ మేరకు స్పష్టత ఇచ్చారు. ఈ నెల 28న తొలివిడతగా రూ. 6వేలు ఇస్తామని ప్రకటించారు. సోమవారం నుంచి పునఃప్రారంభమవుతున్న శాసనసభ సమావేశాల్లో భూమిలేని పేదలను గుర్తించి, ఎంత మందికి పథకాన్ని అమలు చేయాలనే అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. భూమిలేని పేదలు ఎందరు? రాష్ట్రంలో రైతు కుటుంబాలు 64 లక్షల వరకు ఉండగా, భూమిలేని కుటుంబాలు, కూలీ నాలీ చేసుకునే వారు కలిపి 50 లక్షల వరకు ఉన్నట్లు అంచనా. అయితే రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం కింద 53.06 లక్షల కుటుంబాల్లోని వారికి జాబ్‌కార్డులున్నాయి. వారిలో 34.52 లక్షల కుటుంబాల వారే ఈ పథకాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకుంటున్నట్లు ఇటీవల ఓ సర్వేలో తేలింది. జాబ్‌కార్డు ఉన్న వారిలో కూడా కొందరు చిన్న, సన్నకారు రైతులు ఉంటారు. అయితే, భూమిలేని కుటుంబాలను గుర్తించేందుకు ఇప్పటివరకు పూర్తిస్థాయి సర్వే ఏదీ జరగలేదు.2014లో జరిపిన సకుటుంబ సర్వే వివరాలు వెల్లడి కాకపోగా, కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల చేపట్టిన కులగణనతో కూడిన కుటుంబసర్వే ఇంకా పూర్తికాలేదు. అయితే మండలాల స్థాయిలో ఉన్న లెక్కల ప్రకారం సుమారు 40లక్షల కుటుంబాలను భూమిలేని కుటుంబాలుగా ప్రభుత్వం గుర్తించినట్లు సమాచారం. ఏ పథకానికైనా రేషన్‌కార్డును ప్రాథమిక అర్హతగా చెబుతున్న ప్రభుత్వం.. రైతు రుణమాఫీ తరహాలో కుటుంబంలో ఒక్కరినే ఇందుకు అర్హులుగా గుర్తిస్తుందా అనేది తెలియాల్సి ఉంది.గుంట భూమి ఉన్న రైతుకు కూడా రైతుభరోసా పథకాన్ని వర్తింపజేస్తున్న ప్రభుత్వం.. ఈ పథకంలో లబ్ధి పొందని వారందరినీ భూమిలేని కు టుంబాలుగా పరిగణనలోకి తీసుకుంటుందేమోన ని రైతు కూలీ సంఘాల నేతలు పేర్కొంటున్నారు. 30 లక్షల కుటుంబాలకు ఇచ్చినా..భూమిలేని కుటుంబాలను ప్రభుత్వం ఏ ప్రాతిపదికన గుర్తించినా... కనీసం 30 లక్షల కుటుంబాలను అర్హులుగా తేల్చే అవకాశం ఉందని సమాచారం. ఈలెక్కన ఒక్కో కుటుంబానికి తొలివిడత రూ. 6వేల చొప్పున బ్యాంకు ఖాతాల్లో వేస్తే రూ.1,800 కోట్ల భారం ప్రభుత్వంపై పడే అవకాశం ఉంది. ఈలెక్కన సంవత్సరానికి రూ. 3,600 కోట్లు అవసరమవుతాయి. అర్హుల గుర్తింపుపై స్పష్టత వస్తే ఈ లెక్కల్లో తేడా ఉండే అవకాశం ఉంది.అర్హులందరికీ ఇవ్వాలిసారంపల్లి మల్లారెడ్డి, సీపీఎం నేత కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు భూమిలేని కుటుంబాలకు, రైతు కూలీలకు రూ.12వేల ఆర్థిక సాయాన్ని చిత్తశుద్ధితో అమలు చేయాలి. రైతు రుణమాఫీలో కోతలు పెట్టినట్టుగా ఈ పథకం కింద పేదలకు అన్యాయం చేయొద్దు. రాష్ట్రంలో 60 లక్షల వ్యవసాయ కుటుంబాలు ఉంటే, 40 లక్షల కుటుంబాలు భూమి లేని పేదలే. వీరందరికీ ఆర్థిక సాయాన్ని అందించాలి. -
భూమిలేని రైతుకూలీలకు ఏటా రూ.12 వేలు
చింతకాని: ఎన్నికల ముందు ఇచ్చిన హామీ అమల్లో భాగంగా భూమిలేని నిరుపేద రైతు కూలీల కుటుంబాలకు ఈ ఏడాది నుంచి ఖాతాల్లో రూ.12 వేలు జమ చేస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచలో దళితబంధు లబ్ధిదారులు 847 మందికి రెండో విడతగా రూ.15.54 కోట్ల మేర మంజూరు పత్రాలను మంగళవారం ఆయన అందజేశారు. నిరంకుశ రాచరిక పరిపాలన నుంచి తెలంగాణ ప్రజాస్వామ్య పరిపాలనలోకి వచ్చినందున తమ ప్రజాప్రభుత్వం సెపె్టంబర్ 17న ప్రజాపాలన దినోత్సవంగా ప్రకటించిందని తెలిపారు. ఈ ప్రకటనను వ్యతిరేకించిన వారు రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకించినట్టేనన్నారు.ఈ విషయంలో భిన్నాభిప్రాయాలున్నా ప్రజాపాలన దినోత్సవాన్ని స్వాగతించాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టబోతున్నామని, ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు రూ.6 లక్షలు, ఇతరులకు రూ.5 లక్షల మేర అందిస్తామని తెలిపారు. సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులపై ప్రజలు ఆసక్తి చూపుతున్నందున రైతులు దృష్టి సారించాలని, సేంద్రియ విధానంలో సాగు చేసే ఉత్పత్తుల అమ్మకానికి ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని భట్టి తెలిపారు.చిన్నాభిన్నమైన ఆర్థికవ్యవస్థను సరిచేస్తూ ఒకటో తేదీనే ఉద్యోగులకు వేతనాలు ఇస్తున్నామని, ఆస్పత్రి మందుల బిల్లులు, కల్యాణలక్ష్మి, మధ్యాహ్న భోజన కారి్మకుల గౌరవ వేతనం, హాస్టల్ మెస్ బిల్లుల బకాయిలను చెల్లించామని వెల్లడించారు. కాగా, దళితబంధు యూనిట్లను లబ్ధిదారుల నుంచి కొనడానికి వీల్లేదని, బెదిరించి తీసుకువెళ్లడం నేరమని భట్టి స్పష్టం చేశారు. అలా ఎవరైనా యూనిట్లను తీసుకెళ్తే తిరిగి అప్పగించాల్సిన బాధ్యత స్పెషల్ ఆఫీసర్లు, జిల్లా యంత్రాంగంపై ఉందన్నారు. సమావేశంలో కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.