త్వరలోనే ఇందిరమ్మ ఇళ్లు: భట్టి
చింతకాని: ఎన్నికల ముందు ఇచ్చిన హామీ అమల్లో భాగంగా భూమిలేని నిరుపేద రైతు కూలీల కుటుంబాలకు ఈ ఏడాది నుంచి ఖాతాల్లో రూ.12 వేలు జమ చేస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచలో దళితబంధు లబ్ధిదారులు 847 మందికి రెండో విడతగా రూ.15.54 కోట్ల మేర మంజూరు పత్రాలను మంగళవారం ఆయన అందజేశారు. నిరంకుశ రాచరిక పరిపాలన నుంచి తెలంగాణ ప్రజాస్వామ్య పరిపాలనలోకి వచ్చినందున తమ ప్రజాప్రభుత్వం సెపె్టంబర్ 17న ప్రజాపాలన దినోత్సవంగా ప్రకటించిందని తెలిపారు. ఈ ప్రకటనను వ్యతిరేకించిన వారు రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకించినట్టేనన్నారు.
ఈ విషయంలో భిన్నాభిప్రాయాలున్నా ప్రజాపాలన దినోత్సవాన్ని స్వాగతించాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టబోతున్నామని, ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు రూ.6 లక్షలు, ఇతరులకు రూ.5 లక్షల మేర అందిస్తామని తెలిపారు. సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులపై ప్రజలు ఆసక్తి చూపుతున్నందున రైతులు దృష్టి సారించాలని, సేంద్రియ విధానంలో సాగు చేసే ఉత్పత్తుల అమ్మకానికి ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని భట్టి తెలిపారు.
చిన్నాభిన్నమైన ఆర్థికవ్యవస్థను సరిచేస్తూ ఒకటో తేదీనే ఉద్యోగులకు వేతనాలు ఇస్తున్నామని, ఆస్పత్రి మందుల బిల్లులు, కల్యాణలక్ష్మి, మధ్యాహ్న భోజన కారి్మకుల గౌరవ వేతనం, హాస్టల్ మెస్ బిల్లుల బకాయిలను చెల్లించామని వెల్లడించారు. కాగా, దళితబంధు యూనిట్లను లబ్ధిదారుల నుంచి కొనడానికి వీల్లేదని, బెదిరించి తీసుకువెళ్లడం నేరమని భట్టి స్పష్టం చేశారు. అలా ఎవరైనా యూనిట్లను తీసుకెళ్తే తిరిగి అప్పగించాల్సిన బాధ్యత స్పెషల్ ఆఫీసర్లు, జిల్లా యంత్రాంగంపై ఉందన్నారు. సమావేశంలో కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment