సాక్షి, హైదరాబాద్: డ్రగ్స్ ఫ్రీ సిటీగా హైదరాబాద్‌నుమార్చడమే ఇందిరమ్మ రాజ్యం లక్ష్యం అని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్రంలో క్లీన్ అండ్ గ్రీన్ పరిపాలన అందిస్తామని, అభివృద్ధి..సంక్షేమమే తప్ప డ్రగ్స్ ఉండదన్న భరోసా హైదరాబాద్ ప్రజలకు కల్పించాలన్నారు. డ్రగ్స్ విక్రయాలకు చోటులేదని, నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మంగళవారం సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో వేర్వేరుగా జరిగిన జూబ్లీహిల్స్, సనత్‌నగర్ కాంగ్రెస్ అసెంబ్లీ నియోజకవర్గ బూత్ కమిటీల సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాంతాలు, మతాల పేరిట విభజన చేసి ప్రజలను రెచ్చగొట్టి శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారి పట్ల ఉపేక్షించమన్నారు. పోలీస్, రెవెన్యూ, హెల్త్, పౌరసరఫరాలు, జీహెచ్‌ఎంసీ అన్ని వ్యవస్థలను ప్రజలకు జవాబుదారీగా పనిచేయిస్తామని చెప్పారు. ప్రజలు ఈ వ్యవస్థలు, సంస్థలు తమ కోసమే ఏర్పాటు చేశారన్న భావన కల్పించేలా పాలన ఉంటుందన్నారు.
బీఆర్‌ఎస్ బండారం బయటపెడతాం..
ఇంటికో ఉద్యోగం, ఊరికో బడి, కేజీ టు పీజీ, మూడు ఎకరాల భూ పంపిణీ, దళిత సీఎం, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కట్టిస్తామని వాగ్దానాలు చేసి పదేళ్లు అధికారంలో ఉండి, అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన గత బీఆర్‌ఎస్ పాలకులు నలభై రోజులు నిండని కాంగ్రెస్ ప్రభుత్వంపై గ్యారంటీలు అమలు చేయడం లేదంటూ నోటికి వచి్చనట్టు మాట్లాడటానికి సిగ్గుందా? బుద్ధి ఉందా? అంటూ భట్టి మండిపడ్డారు. రాష్ట్ర సంపద, వనరులను దోపిడీ చేసిన గత బీఆర్‌ఎస్ పాలకులు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసి, పుట్టబోయే బిడ్డపై కూడా అప్పుల భారం మోపారని దుయ్యబట్టారు.
గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్‌లో సృష్టించిన ఆస్తులను బీఆర్‌ఎస్ పాలకులు అమ్ముకొని బతికారని, హైదరాబాద్ అభివృద్ధికి వారు చేసింది ఏమీ లేదని విమర్శించారు. ప్రభుత్వం, ప్రజలకు మధ్యన కాంగ్రెస్ శ్రేణులు వారధులుగా పనిచేసి ఆరు గ్యారంటీలు ప్రజ లకు అందేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ జాతీయనేత జెట్టి కుసుమకుమార్, అజారుద్దీన్, అనిల్‌యాదవ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment