విగ్రహ ప్రతిష్టాపనకు రావాల్సిందిగా రామ్‌నాథ్ కోవింద్‌కు ఆహ్వానం అందజేస్తున్న శ్రీచినజీయర్ స్వామి
సాక్షి, న్యూఢిల్లీ/శంషాబాద్ రూరల్ (హైదరాబాద్): వచ్చే ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లో జరగబోయే 216 అడుగుల భగవద్రామానుజుల విగ్రహం (స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ) ఆవిష్కరణ కార్యక్రమానికి రావాల్సిందిగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడులకు త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి ఆహ్వానాన్ని అందజేశారు. మంగళవారం ఢిల్లీలోని రాష్ట్రపతిభవన్‌లో రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసిన ఆయన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరుకావాలని కోరారు.
రాష్ట్రపతిని కలిసిన అనంతరం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని చినజీయర్ స్వామి కలిశారు. కాగా, నేడు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను కలసి ఆహ్వానించనున్నట్లు తెలిసింది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణను కూడా ఆహ్వానించనున్నారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతులను కలిసినవారిలో చినజీయర్ స్వామితోపాటు మై హోమ్ గ్రూప్స్ అధినేత జూపల్లి రామేశ్వరరావు, ధనుష్ ఇన్ఫోటెక్ సీఎండీ. డి.ఎస్.ఎన్.మూర్తి తదితరులు ఉన్నారు.
ఫిబ్రవరి 2న ముహూర్తం
శ్రీ భగవద్రామానుజుల సహస్రాబ్దిని పురష్కరించుకుని ఏర్పాటు చేస్తున్న సమతామూర్తి రామానుజుల విగ్రహ ఆవిష్కరణకు ముహూర్తం ఖరారైంది. సమతామూర్తి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 2 నుంచి 14వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా 1,035 హోమగుండాలతో ప్రత్యేక యాగ క్రతువు చేపట్టనున్నారు. యాగంలో 2 లక్షల కిలోల ఆవు నెయ్యి వినియోగించనున్నారు.
1,100 టన్నుల బరువు ఉండే 216 అడుగుల పంచలోహ విగ్రహంతోపాటు దాదాపు 40 ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ.వెయ్యి కోట్ల అంచనాతో స్ఫూర్తి కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. 2014లో ఈ పనులకు చినజీయర్ స్వామి భూమిపూజ చేశారు. నిత్యం పూజలు అందుకునేవిధంగా 120 కిలోల బంగారంతో మరో విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. ఇక్కడ అద్భుతమైన మ్యూజికల్ ఫౌంటెయిన్, శ్రీరామానుజుల జీవిత విశేషాలను తెలియజేసేలా ఉత్తమ సాంకేతిక విజ్ఞానంతో సన్నివేశాలు, వివిధ ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నారు.
స్ఫూర్తి కేంద్రంలో 108 దివ్య క్షేత్రాలు
స్ఫూర్తి కేంద్రంలో భద్రవేది, దివ్య మండపంతోపాటు 108 దివ్యక్షేత్రాలు, గరుడ మండపం, శరణాగత మండపం, గ్రంథాలయం ఏర్పాటు చేస్తున్నారు. చైనాలో ప్రత్యేక నిపుణులతో, ఆధునిక సాంకేతికతతో విగ్రహాల తయారీ చేపట్టారు. విడి భాగాలుగా ఇక్కడికి తరలించి విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment