సాక్షి, హైదరాబాద్: కోవిడ్ సెకండ్ వేవ్ భారత్‌ను ఆరోగ్య, ఆర్థిక, పర్యావరణ అంశాల్లో తీవ్ర ప్రభావానికి గురిచేసింది. దేశవ్యాప్తంగా పెద్దసంఖ్యలో కరోనా కేసులు వెల్లువెత్తడంతో వివిధ రూపాల్లో జాగ్రత్తల కోసం ఉపయోగించి పారేసిన బయో మెడికల్ వ్యర్థాలు (బీఎండబ్ల్యూ) పర్యావరణం, ఆరోగ్య సంబంధిత అంశాలపై ఏ మేరకు ప్రభావితం చేస్తాయోనని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీగా కేసుల పెరుగుదలతో కరోనా పేషెంట్లతో ఆసుపత్రులన్నీ నిండిపోవడంతో, మునుపెన్నడూ లేనివిధంగా పీపీఈ కిట్లు, మాస్క్‌లు, ఫేస్‌షీల్డ్‌లు, గ్లౌజులు, సిరంజీలు, హెడ్, షూ కవర్లు తదితర వస్తువుల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది.
2 నెలల్లో 50 శాతం వృద్ధి.. : ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లోనే మన దేశంలో బీఎండబ్ల్యూ దాదాపు 50% అధికంగా ఉత్పత్తి అయినట్లు ‘సెంటర్ ఫర్ సైన్స్ ఎన్విరాన్‌మెంట్–స్టేట్ ఆఫ్ ఇండియాస్ ఎన్విరాన్‌మెంట్ ఇన్ ఫిగర్స్–2021’ నివేదికలో వెల్లడైంది. ఏప్రిల్‌లో రోజుకు 139 టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి కాగా, మేలో 203 టన్నులకు పెరిగింది. గత నెల 10న అత్యధిక స్థాయిలో రోజుకు 250 టన్నుల వ్యర్థాల ఉత్పత్తి అయింది. వ్యర్థాల నిర్వహణ, చికిత్స, నాశనం చేయడానికి సంబంధించి కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ వ్యర్థాలను శుద్ధి చేసి పర్యావరణానికి హాని కలగకుండా బయటికి వదిలేందుకు దేశవ్యాప్తంగా 198 కామన్ బయో మెడికల్ వేస్ట్ ట్రీట్‌మెంట్ అండ్ డిస్పోజల్ ఫెసిలిటీస్ (సీబీడబ్ల్యూటీఎఫ్) ఉన్నాయి.
రాష్ట్రంలో రోజుకు సగటున 6.3 టన్నులు..
- సీపీసీబీ మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రంలోని వివిధ శుద్ధి ప్లాంట్లు, ఫెసిలిటీస్ ద్వారా సమర్థవంతంగా ఎప్పటికప్పుడు బీఎండబ్ల్యూ ఉత్పత్తులను ట్రీట్‌మెంట్ చేస్తున్నట్టు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీపీసీబీ) అధికారులు చెబుతున్నారు.
- రాష్ట్రంలో కోవిడ్ ట్రీట్‌మెంట్ అందిస్తున్న ఆసుపత్రుల నుంచి ప్రతిరోజు వివిధ ఏజెన్సీల ద్వారా బయో మెడికల్ వ్యర్థాలను సేకరిస్తున్నారు.
- 2021 మే నెలలో సగటున రోజుకు 6.3 టన్నుల దాకా వ్యర్థాలు ఉత్పత్తి అయ్యాయి.
- ఏప్రిల్‌లో రోజుకు 2.8 నుంచి 3 టన్నుల దాకా వచ్చేది. మే నెలతో పోల్చితే ప్రస్తుతం క్రమంగా తగ్గుతూ... జూన్‌లో సగటున 4 టన్నుల దాకా బీఎండబ్ల్యూ వస్తోంది.
- గతేడాది కోవిడ్ మొదటి దశలో సగటున రోజుకు 2 వేల టన్నుల దాక వ్యర్థాలు ఉత్పత్తి అయ్యాయి.
- గతేడాది కరోనా తీవ్ర స్థాయికి వెళ్లినప్పుడు కొన్ని రోజులు రోజుకు 4.5 టన్నుల దాకా ఈ వ్యర్థాలు ఉత్పత్తి అయ్యాయి.
సెకండ్ వేవ్‌లో తెలంగాణలో..
- ఈ ఏడాది మార్చి నుంచి జూన్ 20 వరకు (గత మూడున్నర నెలల్లో) మొత్తం 382 టన్నుల బీఎండబ్ల్యూ ఉత్పత్తి
- అయ్యింది.
- ఈ కాలంలో సగటున రోజుకు 5.2 టన్నుల చొప్పున మెడికల్ వ్యర్థాలొచ్చాయి.
- ప్రస్తుతం రోజూ సరాసరి 3.8 నుంచి4 టన్నుల దాకా వస్తోంది. ఇప్పుడు క్రమంగా తగ్గుతోంది.
దేశవ్యాప్తంగా చూస్తే..
- మే నెలలో సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న కేరళ, గుజరాత్, మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక నుంచే 50 శాతం బయో మెడికల్ వేస్ట్ ఉత్పత్తి అయ్యింది.
- గత నెలలో రెండోదశ తీవ్ర స్థాయికి చేరుకున్న దశలో దేశవ్యాప్తంగా రోజుకు 2 లక్షల కేజీలకు పైగా బీఎండబ్ల్యూ ఉత్పత్తి అయ్యేది.
- గత 3 నెలల్లో రోజు వారి బీఎండబ్ల్యూని ఓసారి పరిశీలిస్తే.. మార్చిలో 75 వేల కేజీలు, ఏప్రిల్‌లో 1.39 లక్షల కేజీలు, మేలో 2.03 లక్షల కేజీల వ్యర్థాలు ఉత్పత్తి అయ్యాయి.
- దేశంలో ఉత్పత్తి అయ్యే నాన్ కోవిడ్ బయోమెడికల్ వేస్ట్‌తో పోలిస్తే మేలో ఉత్పత్తి అయిన బీఎండబ్ల్యూ మూడో వంతుగా ఉంది.
- 2020 జూన్ నుంచి 2021 మే 10 మధ్యలో మొత్తం 45,308 టన్నుల కోవిడ్ బీఎండబ్ల్యూ ఉత్పత్తి అయినట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
- భారత్‌లోని ఆసుపత్రి వ్యర్థాల్లో 12 శాతం వరకు శుద్ధి చేయకుండానే వదిలేస్తున్నారు. ఈ విషయంలో బిహార్, కర్ణాటక అథమ స్థాయిలో ఉన్నాయి.
ప్రధానంగా ఆసుపత్రుల నుంచి సేకరించిన బీఎండబ్ల్యూనే ట్రీట్ చేస్తున్నారు. కోవిడ్‌కు అనేక మంది ఇళ్లలోనే ఉంటూ చికిత్స తీసుకున్నారు. మాస్క్‌లు, గ్లౌజులు, ఫేస్‌షీల్డ్‌లు వంటి వాటి వ్యక్తిగత వినియోగం కూడా గణనీయంగా పెరిగింది. వీటిని ఉపయోగించాక ఏ మేరకు సురక్షితంగా వాటిని పారవేశారనేది ప్రశ్నార్థకమే. ముఖ్యంగా గ్రామాల్లో బీఎండబ్ల్యూ నిర్వహణ ఏ విధంగా ఉంది అన్నదానిపై పూర్తిస్థాయిలో గణాంకాలు, సమాచారం అందుబాటులో లేదు. రోడ్లపై అక్కడక్కడ మాస్క్‌లు, ఇతర వ్యర్థాలు నిర్లక్ష్యంగా పారేసిన దృశ్యాలు మనకు తరచుగా కనిపిస్తున్న విషయం బహిరంగ రహస్యమే. ఈ వ్యర్థాలు బాధ్యతారహితంగా పడవేయకుండా, పర్యావరణానికి నష్టం కలగని విధంగా క్రమపద్ధతిలో వాటిని శుద్ధిచేసే కార్యాచరణలో అన్నిస్థాయిల్లో ప్రజలను భాగస్వాములను చేయాలి.
– ప్రీతి బంతియా మహేశ్, చీఫ్ ప్రోగ్రామ్ కో–ఆర్డినేటర్, టాక్సిన్ లింక్ ఎన్విరాన్‌మెంట్ గ్రూప్
Comments
Please login to add a commentAdd a comment