Hyderabad: Medical Experts Warn Over Coronavirus Third Wave - Sakshi
Sakshi News home page

Covid 19: కరోనా పూర్తిస్థాయిలో తగ్గలే.. ముప్పు పొంచి ఉంది.. వైద్య నిపుణుల హెచ్చరిక

Published Wed, Oct 27 2021 4:09 AM | Last Updated on Wed, Oct 27 2021 1:24 PM

Medical Experts Warn Over Coronavirus Third Wave - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా పూర్తిస్థాయిలో తగ్గిపోలేదని ఏమాత్రం ఏమరపాటుగా వ్యవహరించినా మళ్లీ విరుచుకుపడే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా తగ్గిపోయిందిలే అన్న ధోరణి చాలా మందిలో పెరిగిపోయిందని, కానీ రష్యా, యూకేల్లో కేసులు అకస్మాత్తుగా పెరుగుతుండటంతో థర్డ్‌వేవ్‌ పొంచి ఉందనే విషయాన్ని గమనంలో ఉంచుకుని అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేస్తున్నారు.

సెకండ్‌ వేవ్‌లో ఇన్ఫెక్షన్‌ బారినపడి కోలుకోవడం, వ్యాక్సినేషన్‌ జరగడంతో చాలామందిలో యాంటీబాడీస్‌ వృద్ధి చెందాయి కానీ, అవి ఎన్నోరోజులు ఉండే అవకాశం లేదని చెబుతున్నారు. వ్యాక్సిన్‌ వేసుకున్న తర్వాత కూడా ఆరు నెలల వరకే కరోనా నుంచి రక్షణ ఏర్పడుతుందని, ఆ తర్వాత మళ్లీ వైరస్‌ సోకే ప్రమాదం లేకపోలేదని నిపుణులు అంటున్నారు. ఫస్ట్, సెకండ్‌ వేవ్‌ల్లో ఇన్ఫెక్షన్‌కు గురికానివారు, వ్యాక్సిన్‌ వేసుకోనివారిలో కొందరికి థర్డ్‌వేవ్‌లో ప్రమాదం పొంచి ఉండొచ్చని చెబుతున్నారు.  

తెలంగాణలో స్థిరంగా కేసుల నమోదు... 
రాష్ట్రంలో కరోనా కేసులు స్థిరంగా నమోదవుతూనే ఉన్నాయి. సెకండ్‌ వేవ్‌ ఉధృతి నుంచి బయటపడిన తర్వాత గత రెండు నెలలుగా ఇదే పరిస్థితి నెలకొంది. నిర్ధారణ పరీక్షలను బట్టి చూస్తే రోజుకు సగటున 200 వరకు కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికీ గాంధీ వంటి ఆసుపత్రుల్లో కొందరు చికిత్స పొందుతూనే ఉన్నారు. అలాగే సగటున రోజుకు ఒకరు మరణిస్తున్నారు.

అంటే కరోనా నియంత్రణలోనే ఉన్నా ప్రమాదం మాత్రం తొలగిపోలేదని ఈ లెక్కలు తెలియజేస్తున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. కాబట్టి వ్యాక్సిన్‌ వేసుకోవడంతో పాటు ప్రతిఒక్కరూ విధిగా మాస్క్‌లు ధరించాలని, భౌతికదూరం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరిస్తోంది. 

కేంద్రం సన్నాహాలు.. రాష్ట్రాలకు నిధులు 
థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం ఎప్పటినుంచో సన్నాహాలు మొదలుపెట్టింది. అందుకోసం అత్యవసర కోవిడ్‌ రెస్పాన్స్‌ ప్యాకేజీ–ఫేజ్‌–2 కింద తెలంగాణకు ఇటీవల రూ.456 కోట్లు కేటాయించింది. వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు ఈ నిధులను ఏయే రంగాల్లో ఖర్చు చేయాలన్న దానిపై స్పష్టత కూడా ఇచ్చింది. ప్రస్తుత కోవిడ్‌ పరిస్థితిని ఎదుర్కోవడంపై దృష్టి సారించాలని సూచించింది.

థర్డ్‌వేవ్‌ రాకముందే ముందుచూపుతో ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేసే రంగాలపై నిధులు ఖర్చు చేయాలని స్పష్టం చేసింది. ప్రజారోగ్య సంరక్షణ వ్యవస్థను సిద్ధం చేయడానికి రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో వివిధ కార్యక్రమాలను అమలు చేయాలని సూచించింది. 

పీడియాట్రిక్‌ కేర్‌కు పెద్దపీట 
ఇప్పటివరకు 18 ఏళ్లలోపు పిల్లలకు కరోనా టీకా వేయనందున వారిపై కరోనా పంజా విసిరే ప్రమాదముంది. అందుకే వైద్య ఆరోగ్యరంగంలో మౌలిక సదుపాయాలకు, అందులో ప్రధానంగా పీడియాట్రిక్‌ కేర్‌ యూనిట్లకు వైద్య ఆరోగ్య శాఖ పెద్దపీట వేసింది. ఈ రంగాలకు ఉమ్మడిగా రూ.270 కోట్లు కేటాయించారు. అలాగే ఆసుపత్రుల్లో ఐసీయూ పడకలను పెంచాలని, అందులో 20 పీడియాట్రిక్‌ ఐసీయూ పడకలు ఉండేలా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు.

‘థర్డ్‌వేవ్‌ వచ్చే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని పీజీ మెడికల్‌ రెసిడెంట్లను కోవిడ్‌ మేనేజ్‌మెంట్‌ విధుల కోసం తాత్కాలిక పద్ధతిన నియమించుకోవాలి. కొందరు ఎంబీబీఎస్‌ ఫైనలియర్‌ విద్యార్థులను కోవిడ్‌ కోసం వచ్చే ఏడాది మార్చి వరకు తాత్కాలిక పద్ధతిన తీసుకోవాలి. అలాగే జీఎన్‌ఎం నర్సింగ్‌ ఫైనలియర్‌ విద్యార్థులను తాత్కాలిక పద్ధతిన తీసుకోవాలి. వచ్చే ఏడాది మార్చి నాటికి మెడికల్‌ కాలేజీల్లో 825 ఐసీయూ పడకలు, జిల్లా ఆసుపత్రుల్లో 90 ఐసీయూ పడకలను చిన్న పిల్లల కోసం ప్రత్యేకంగా కేటాయించాలి. రిఫరల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వ్యవస్థలను ఏర్పాటు చేయాలి..’అని కేంద్రం సూచించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement