►ఆయన పేరు డాక్టర్ రంగారావు (పేరు మార్చాం). రంగారెడ్డి జిల్లాలోని ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పీహెచ్‌సీ)లో మెడికల్ ఆఫీసర్. ఎంబీబీఎస్ పూర్తయ్యాక ఆయన ఈ పోస్టులో చేరారు. ఆ తర్వాత ఎండీ ఫల్మనరీ పూర్తిచేశారు. పీహెచ్‌సీకి రెగ్యులర్‌గా వెళ్లకుండా మేనేజ్ చేసుకుంటూ హైదరాబాద్ పరిధిలో కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నారు.
►ఆమె పేరు డాక్టర్ ప్రభావతి(పేరు మార్చాం). ఎంబీబీఎస్ పూర్తయ్యాక ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని ఓ పీహెచ్‌సీలో పనిచేస్తున్నారు. తర్వాత ఎండీ గైనిక్ చదివారు. వారానికి ఒకట్రెండు రోజులు పీహెచ్‌సీకి వెళ్లి వస్తూ హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో కన్సల్టెంట్‌గా పనిచేస్తూ నెలకు రూ.2 లక్షలు సంపాదిస్తున్నారు. సొంతంగా ప్రాక్టీస్ చేసుకుంటూ దాదాపు రూ.5 లక్షల వరకు సంపాదిస్తున్నారు.
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్ చదివాక పీహెచ్‌సీల్లో మెడికల్ ఆఫీసర్‌గా చేరినవారు, ఆ తర్వాత పీజీ పూర్తయ్యాక కూడా అక్కడే తిష్ట వేస్తున్నారు. మెడికల్ పీజీలో కార్డియాలజీ, జనరల్ సర్జన్, ఆర్థోపెడిక్, రేడియాలజీ, అనస్థీషియా ఇలా స్పెషలైజేషన్ పీజీ పూర్తయిన తర్వాత పీహెచ్‌సీల నుంచి పెద్దాసుపత్రులకు మారాలి.
ప్రస్తుతం 290 మంది ఇలా పీహెచ్‌సీల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ స్పెషలిస్టు వైద్యులను పని ఉన్నచోటుకు మార్చాలని, ఈ నెల 23, 24 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహించాలని వైద్య, ఆరోగ్య శాఖ భావిస్తోంది. వారు కౌన్సెలింగ్‌కు రాకున్నా, విధుల్లో చేరడానికి అయిష్టత చూపినా, షోకాజ్ నోటీసులిచ్చి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులు భావిస్తున్నట్లు తెలిసింది.
పెద్దాసుపత్రులకు మారితే ప్రైవేట్ వైద్యానికి కష్టం
పెద్దాసుపత్రులకు మారితే ఆయా స్పెషలిస్ట్ వైద్యుల రోజువారీ సమయమంతా అక్కడే సరిపోతుంది. ఉన్నతాధికారుల నిఘా కూడా బాగానే ఉంటుంది. దీంతో ప్రైవేట్ ప్రాక్టీస్ కానీ, కార్పొరేట్ ఆసుపత్రుల్లో కన్సల్టెంట్‌గా వైద్యసేవలు అందించడంకానీ కుదరదు. పీహెచ్‌సీల్లో అయితే వారానికి ఒకసారి అలా సరదాగా వెళ్లొచ్చినా అడిగే నాథుడు ఉండడు.
స్పెషలిస్ట్ వైద్యులుగా పెద్దాసుపత్రులకు వచ్చినా అందే జీతం ప్రైవేట్ ప్రాక్టీస్ ముందు దిగదుడుపే. అవసరమైతే ప్రభుత్వ ఉద్యోగం వదులుకోవడానికైనా కొందరు స్పెషలిస్ట్ వైద్యులు సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ సమస్యను ఎలా పరిష్కరించాలన్న దానిపై వైద్య, ఆరోగ్యశాఖ కసరత్తు చేస్తోంది.
పెద్దాసుపత్రులకు వెళ్లాల్సిందే..
పీహెచ్‌సీల్లో పనిచేస్తున్న పీజీ స్పెషలిస్ట్ వైద్యులు పెద్దాసుపత్రుల్లో సేవలు అందించాలి. ఎంతమంది ఎక్కడెక్కడ పనిచేస్తున్నారో జాబితా తయారు చేశాం. వారిని సామాజిక, ఏరియా, జిల్లా, బోధనాసుపత్రులకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నాం. కానీ, చాలామంది పీహెచ్‌సీలను వదలడానికి అంతగా ఆసక్తి చూపించడం లేదని మా దృష్టికి వచ్చింది. దానికి అనుగుణంగా చర్యలు చేపడతాం.
– డాక్టర్ శ్రీనివాసరావు, ప్రజారోగ్య సంచాలకుడు
Comments
Please login to add a commentAdd a comment