
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘‘బయో ఏషియా’’ సదస్సు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్నట్లు మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రకటించారు. 2023 సంవత్సరానికి గాను ఫిబ్రవరి 24 –26వ తేదీల్లో 20వ బయో ఏషియా సదస్సు నిర్వహించనున్నారు. ‘అడ్వాన్సింగ్ ఫర్ వన్: షేపింగ్ ద నెక్స్‌ట్ జనరేషన్ ఆఫ్ హ్యూమనైజ్డ్ హెల్త్ కేర్’ ఇతివృత్తంగా సాగుతుందని మంత్రి తెలిపారు.
శాఖ ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, బయో ఏషియా సీఈఓ శక్తి నాగప్పన్‌లతో కలిసి ఆయన మంగళవారం సదస్సు లోగోను ఆవిష్కరించారు. భవిష్యత్ తరాల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వాలు, విద్య, పరిశోధన, నియంత్రణ సంస్థలు కలిసికట్టుగా పని చేయాల్సిన అవసరాన్ని కోవిడ్ మహమ్మారి మానవాళికి తెలిపిందని, అందుకే అదే ఇతివృత్తంగా సదస్సు నిర్వహిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు.