
సాక్షి, హైదరాబాద్ : ప్రగతి భవన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొత్తగా ఎన్నికైన బీజేపీ కార్పొరేటర్లు మంగళవారం నాడు ప్రగతి భవన్ ముట్టడికి యత్నించారు. నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లతో ప్రమాణ స్వీకారం, పాలకమండలి ఏర్పాటు చేయాలనే ఎజెండాతో నిరసన తెలియజేశారు. ముందుగానే పోలీసులకు సమాచారం అందడంతో అక్కడ పెద్ద ఎత్తున బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రగతిభవన్ ముట్టడికి యత్నించిన కార్పొరేటర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, బీజేపీ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తాము గెలిచి నెల రోజులు అవుతున్నా కూడా తమకి ఎలాంటి గుర్తింపు లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. (రేవంత్‌కు షాక్.. టీపీసీసీ చీఫ్‌గా సీనియర్ నేత!)
ప్రజలు ఎన్నుకుంటే, ప్రజాస్వామ్య పద్దతిలో గెలిచాము.. ప్రజలకి ఏం సమాధానం చెప్పాలి మేము అంటూ మండిపడ్డారు. తమని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, తామే ఏమన్నా రౌడీలమా అంటూ కార్పొరేటర్లు ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్ డౌన్ డౌన్ అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతకుముందు బీజేపీ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అధ్యక్షతన హరిత ప్లాజాలో సమావేశం నిర్వహించారు. ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన లింగోజిగూడ కార్పొరేటర్ ఆకుల రమేష్ గౌడ్ మృతికి సంతాపం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment