సాక్షి, సిటీబ్యూరో : గ్రేటర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. మేయర్ అభ్యర్థిగా ఆర్కేపురం కార్పొరేటర్ రాధాధీరజ్‌రెడ్డి పేరును ఖరారు చేసినట్లు తెలిసింది. వరుసగా నాలుగుసార్లు కార్పొరేటర్‌గా గెలుపొందిన సీనియర్ నాయకుడు శంకర్ యాదవ్‌కు పార్టీ ఫ్లోర్‌లీడర్ పదవి కట్టబెట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఎన్నికల్లో బీజేపీ 48 స్థానాలను కైవసం చేసుకోగా, లింగోజిగూడ డివిజన్ కార్పొరేటర్ ఇటీవల మృతి చెందారు. దీంతో ఆ పార్టీ సభ్యుల సంఖ్య 47కు చేరింది. మరో రెండు ఎక్స్ అఫీషియో ఓట్లు ఉన్నాయి. మొత్తంగా అధికార టీఆర్‌ఎస్‌తో పోలిస్తే బీజేపీ బలం తక్కువగానే ఉంది. అయితే మేయర్ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థుల నుంచి తమకు కొంత మంది సపోర్ట్ చేసే అవకాశం ఉందని, ఆ మేరకే పార్టీ అభ్యర్థిని మేయర్ బరిలో నిలిపినట్లు బీజేపీ స్పష్టం చేసింది. బుధవారం అభ్యర్థులతో సమావేశం నిర్వహించి ఓటింగ్‌పై జాగ్రత్తలను వివరించింది. అభ్యర్థులకు విప్ జారీ చేసింది. ప్రమాణ స్వీకారానికి ముందు అభ్యర్థులు గురువారం ఉదయం బషీర్‌బాగ్‌లోని అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించనున్నారు. అల్పాహారం తీసుకుని జీహెచ్‌ఎంసీకి ర్యాలీగా వెళతారు.
పోటీలో ఎంఐఎం..
ఎక్స్‌అఫీషియో సభ్యులతో కలుపుకొని రెండో అతిపెద్ద పార్టీగా అవతరించిన మజ్లిస్ (ఏఐఎంఐఎం) మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు పోటీ పడేందుకు సిద్ధమైంది. ఇందుకు అంతర్గతంగా అభ్యర్థుల ఖరారుపై కసరత్తు పూర్తి చేసింది. పార్టీ జాతీయ కార్యదర్శి, యాకుత్‌పురా ఎమ్మెల్యే అహ్మద్ పాషా ఖాద్రీకి విప్ జారీ చేసే అధికారం కట్టబెట్టింది. పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ పార్లమెంట్ సమావేశాల్లో బిజీగా ఉండటంతో మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థిత్వాలకు సంబంధించి బీఫాం బాధ్యతలను కూడా పాషా ఖాద్రీకి అప్పగించింది. ఈ మేరకు బుధవారం ఎమ్మెల్యే అహ్మద్ పాషా ఖాద్రీ, ఎమెల్సీ సయ్యద్ అమీన్–ఉల్–హసన్ జాఫ్రీలు కలిసి హైదరాబాద్ జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి శ్వేతా మహంతికి ఫాం– ఎ,అనెక్జ్సర్–1, 2లను సమర్పించారు. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలపై పార్టీపరంగా అవలంబించాల్సిన వ్యూహంపై గురువారం ఉదయం దారుస్సలాంలో జరిగే కొత్త కార్పొరేటర్ల ప్రత్యేక సమావేశంలో దిశానిర్దేశం జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment