సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ నూతన మేయర్‌గా టీఆర్‌ఎస్ అభ్యర్థి గద్వాల విజయలక్ష్మి ఎన్నికయ్యారు. మేయర్ పీఠం కోసం పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఆమె వైపు మొగ్గు చూపింది. సీనియర్ నేత, కేసీఆర్ సన్నిహితుడు కేశవరావు కూతురైన విజయలక్ష్మి.. బంజారాహిల్స్ డివిజన్ 93 కార్పొరేటర్‌గా రెండు సార్లు ఎన్నికయ్యారు. ఈ సారి ఏకంగా మేయర్ పీఠాన్ని అధిరోహించారు. ఆమె వ్యక్తిగత వివరాలు ఇలా ఉన్నాయి...
బాల్యం, విద్యాభ్యాసం..
కేశవరావు కుమార్తె అయిన విజయలక్ష్మి బాల్యం, విద్యాభ్యాసం మొత్తం అంతా హైదరాబాద్‌లోనే సాగింది. హోలీ మేరీ స్కూల్‌లో పాఠశాల విద్యను పూర్తి చేసిన విజయలక్ష్మి.. రెడ్డి మహిళా కాలేజీలో చదివారు. భారతీయ విద్యాభవన్‌లో జర్నలిజం పూర్తి చేశారు. అనంతరం సుల్తానా ఉల్ లూమ్ లా కాలేజీలో ఎల్ఎల్‌బీ పూర్తి చేశారు.
వివాహం..
విజయలక్ష్మి వివాహం బాబీ రెడ్డితో జరిగింది. పెళ్లి తర్వాత ఆమె అమెరికా వెళ్లారు. దాదాపు 18 ఏళ్లపాటు అమెరికాలోనే ఉన్నారు. అక్కడ ఆమె అగ్రరాజ్యంలోనే ఐదు అతిపెద్ద యూనివర్సిటీల్లో ఒకటైన నార్త్ కరోలినా యూనివర్సిటీలో.. కార్డియాలజీ విభాగంలో రీసెర్చ్ అసిస్టెంట్‌గా పని చేశారు. 2007లో భారత్ తిరిగొచ్చిన విజయలక్ష్మి.. రాజకీయాల్లో తండ్రి వారసత్వాన్ని కొనసాగించడం కోసం అమెరికా పౌరసత్వాన్ని వదిలేసుకున్నారు.
రాజకీయ ప్రస్థానం
తొలిసారి 2016లో విజయలక్ష్మి టీఆర్ఎస్ తరఫున బంజారాహిల్స్ కార్పొరేటర్‌గా భారీ మెజార్టీతో విజయం సాధించారు. అప్పటి నుంచి బంజారాహిల్స్ డివిజన్ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మరో సారి విజయం సాధించి.. ఈ సారి ఏకంగా మేయర్ పదవిని అలంకరించారు.
డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత..
డిప్యూటీ మేయర్‌గా ఎన్నికైన మోతే శ్రీలత తార్నాక డివిజన్ నుంచి గెలుపొందారు. ఆమె వ్యక్తిగత జీవితానికి వస్తే.. బీఏ చదివిన శ్రీలత శోభన్ రెడ్డిని వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు రాజీవి, శ్రీతేజస్వి. 20 ఏళ్లుగా బొటిక్ నిర్వహించిన శ్రీలత.. తరువాత రాజకీయాల్లో ప్రవేశించారు. కొంతకాలం పాటు టీఆర్‌ఎస్ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. తాజా ఎన్నికల్లో తార్నక కార్పొరేటర్‌గా విజయం సాధించిన మోతే శ్రీలత.. డిప్యూటీ మేయర్ పదవిని దక్కించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment