సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బీజేపీ ‘ఎలక్షన్ మోడ్’లోకి వచ్చింది. వచ్చే 7, 8 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉండగా, దానికి సంబంధించిన కసరత్తును పూర్తి చేసింది. పార్టీపరంగా చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళికకు తుదిరూపు ఇచ్చింది. తెలంగాణపై పూర్తి ఫోకస్ పెట్టిన బీజేపీ అధినాయకత్వం ప్రత్యక్ష పర్యవేక్షణలో వరుస కార్యక్రమాల నిర్వహణకు సంసిద్ధమైంది. ఈ నెల 6వ తేదీ మొదలుకుని వరుస కార్యక్రమాలతో వేడెక్కించనుంది.
6న పార్టీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని రాష్ట్రంలోని పోలింగ్ బూత్ కమిటీల సభ్యులతో ఎన్నికల సన్నద్ధతపై ప్రధాని మోదీ వర్చువల్‌గా మాట్లాడనున్నారు. రాష్ట్రంలో కేంద్రం చేపట్టిన/చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసేందుకు 8న రాష్ట్రానికి రానున్నారు.
మే నెలలో కూడా ప్రధాని మరోసారి రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంది. ఈ పర్యటనలో భాగంగా వరంగల్‌లో మెగా టెక్స్‌టైల్ పార్క్, రైల్వే వ్యాగన్ తయారీ యూనిట్ తదితర పనులకు శంకుస్థాపన చేస్తారని సమాచారం.
పలు అంశాలపై ఆందోళన కార్యక్రమాలు
కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలప్రచారంతో పాటు.. కేసీఆర్ సర్కార్ వైఫల్యాలు, ఎన్నికల హామీలు అమలు చేయపోవడం, టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ, తదితర అంశాలపై మండలాలు, నియోజకవర్గాల వారీగా ఆందోళన కార్యక్రమాల నిర్వహణకు బీజేపీ నిర్ణయించింది. రాష్ట్రంలోని 34,902 పోలింగ్ బూత్ కమిటీల నియామకాన్ని ఈ నెల 5వ తేదీలోగా పూర్తి చేయనుంది.
6న బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి పోలింగ్ బూత్‌లో పార్టీ పతాకావిష్కరణ నిర్వహించనుంది. అదేరోజు ఉదయం 9 గంటలకు బూత్ కమిటీలను ఉద్దేశించి ప్రధాని మాట్లాడతారు. 11న పూలే జయంతి, 14న డా.బీఆర్ అంబేడ్కర్ జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తారు.
అగ్రనేతల ఫుల్ ఫోకస్
ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనలు దాదాపు ఖరారవగా..కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కూడా రాష్ట్రంలో పర్యటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే క్షేత్రస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పార్టీ యంత్రాంగాన్ని సంసిద్ధం చేయడం, నేతల మధ్య సమన్వయాన్ని మెరుగు పరచడం తదితర అంశాలపై బీజేపీ అధినాయకత్వం దృష్టి పెట్టింది.
‘మిషన్ తెలంగాణ–90’ (తొంభై సీట్లలో గెలుపు లక్ష్యం) కార్యాచరణ ప్రణాళిక అమలు ఎలా జరుగుతోంది? అన్న దానిపై, అలాగే పోలింగ్ బూత్ స్థాయిలో నిర్వహిస్తున్న కార్యక్రమాలపై అమిత్‌షా ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నట్టు విశ్వసనీయ సమాచారం. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీని గట్టెక్కించే పనిలో నిమగ్నమైన అమిత్‌షా, తెలంగాణలో పార్టీని అధికారంలోకి తేవడానికి కూడా అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
మరోవైపు ఫిబ్రవరిలో ‘స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్’ జరిగిన తీరుపై సవివరమైన నివేదిక సమర్పించాల్సిందిగా రాష్ట్ర పార్టీని నడ్డా ఆదేశించినట్లు తెలిసింది. జిల్లాల వారీగా చేపడుతున్న కార్యక్రమాలు, ఎన్నికలకు సన్నద్ధమౌతున్న తీరుపై జిల్లాల అధ్యక్షులతో నేరుగా సమీక్షలు నిర్వహించనున్నట్టు సమాచారం. ‘బూత్ సశక్తికరణ్ అభియాన్’ ఎంతవరకు వచ్చింది? తదితర అంశాలను కూడా సమీక్షించనున్నారని తెలిసింది.
30న 100 సెంటర్లలో మన్ కీ బాత్
ఏప్రిల్ 30న మోదీ మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్‌ను ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో వంద సెంటర్లలో నిర్వహిస్తారు. ఇక మే నెలలో కేంద్రం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించారు. మే రెండో వారంలో 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 500 మంది ముఖ్య కార్యకర్తలతో సమ్మేళనాలు ఉంటాయి.
మే 15 నుంచి జూన్ 15 వరకు నియోజకవర్గ కేంద్రాల వారీగా రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ‘సాలుదొర–సెలవు దొర’ పేరిట భేటీలు ఉంటాయి. జూన్ 1 నుంచి ఇంటింటికీ బీజేపీ పేరిట ఎన్నికల ప్రచారం ముమ్మరం చేస్తారు.
జూలైలో కేంద్రం చేసిన కార్యక్రమాలు ప్రధానంగా ప్రస్తావిస్తూ కేసీఆర్ సర్కార్ వైఫల్యాలను ఎండగడతారు. ఆగస్టు, సెప్టెంబర్‌లలో మహిళా, యువ, రైతు వర్గాలతో సమావేశాలు ఉంటాయి. అక్టోబర్, నవంబర్‌లలో రాష్ట్రవ్యాప్తంగా విజయ సంకల్ప యాత్రలు నిర్వహిస్తారు.
Telangana: ఎన్ని‘కళ’ కమలం
Published Tue, Apr 4 2023 2:56 AM | Last Updated on Tue, Apr 4 2023 11:37 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment