చేవెళ్లలో జరిగిన సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న అమిత్ షా
చేవెళ్ల నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే రాజ్యాంగ వ్యతిరేక ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని, వాటి ఫలాలు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు అందేలా చర్యలు తీసుకుంటామని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ప్రకటించారు. పార్టీకి పెరుగుతున్న మద్దతు, ఈ సభకు వచ్చిన ప్రజాస్పందన చూస్తుంటే, వచ్చే ఎన్పికల్లో తెలంగాణలో బీజేపీ భారీ మెజారిటీతో అధికారంలోకి రాబోతోందనే విషయం స్పష్టమౌతోందన్నారు.
సీఎం కేసీఆర్, బీఆర్‌ఎస్ సర్కార్‌పై ప్రజల్లో పెల్లుబుకుతున్న జనాగ్రహాన్ని మొత్తం ప్రపంచం వీక్షిస్తోందన్నారు. చేవెళ్లలో బీజేపీ విజ యసంకల్ప సభతో గత 8, 9 ఏళ్ల అవినీతిమయ బీఆర్‌ఎస్ పాలనకు ‘రివర్స్ కౌంటింగ్’ మొదలైనట్టేనని చెప్పారు. ఉద్యోగాల ఆశ చూపి నిరుద్యోగ యువతను నిండా ముంచిన కేసీఆర్ సర్కార్‌కు ఒక్క నిమిషం కూడా అధికారంలో కొనసాగే హక్కు లేదని మండిపడ్డారు.
తాను మళ్లీ వస్తానని, అన్నింటికీ లెక్కలు అడుగుతానని, ఇచ్చిన హామీల అమలు ఏమయ్యిందో నిలదీస్తానన్నారు. ఆదివా రం చేవెళ్లలో జరిగిన తొలి ‘విజయసంకల్ప యాత్ర’ బహిరంగసభలో అమిత్‌షా పాల్గొన్నారు. చిలుకూరు బాలాజీ భగవాన్‌కి ప్రార్థనలు, ఉమ్మడి ఏపీ మాజీ ఉప ముఖ్యమంత్రి కొండా వెంకట రంగారెడ్డికి ప్రణామాలంటూ ప్రసంగం ప్రారంభించారు.
ఎంఐఎం చేతుల్లో కారు స్టీరింగ్
‘బీఆర్‌ఎస్ ఎన్నికల గుర్తు అయిన కారు స్టీరింగ్ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేతుల్లో ఉంది. అందువల్ల దాని దిశ సరిగా ఉండదు. ఒవైసీ ఎజెండాపై నిర్లజ్జగా నడుస్తున్న తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 17న తెలంగాణ స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించడం లేదు. మోదీ నేతృత్వంలో ఇక్కడ బీజేపీ అధికారానికి వచ్చాక పరేడ్ గ్రౌండ్స్‌లో ఈ ఉత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తాం. మీరు మజ్లిస్‌కు భయపడవచ్చేమో కానీ బీజేపీ భయపడదు. డబుల్ బెడ్‌రూం స్కీంలోనూ మైనారిటీలకు రిజర్వేషన్లు కల్పించారు.
విద్యలోనూ ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించారు. ఇది ఇక ముందు సాగదు. మజ్లిస్ స్టీరింగ్‌తో నడుస్తున్న కేసీఆర్ పాలనతో రాష్ట్రాభివృద్ధి జరగదు. అధికార, పోలీసు యంత్రాంగం పూర్తిగా రాజకీయంగా ప్రభావితమై ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తోంది. మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు కిందిస్థాయి వరకు చేరడం లేదు. అయితే కేసీఆర్ ఏం చేసినా తెలంగాణలోని పేదలను ప్రధాని మోదీ నుంచి దూరం చేయలేరు.
రాబోయే ఎన్నికల్లో భారీమెజారిటీతో ఇక్కడ బీజేపీ అధికారానికి రావడం ఖాయం. కమలం పువ్వుకు ఓటెయ్యండి, కమలంపై కూర్చు ని మహాలక్ష్మీ, వైభవ్‌లక్ష్మీ తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. ఎవరి చేతుల్లోనో స్టీరింగ్‌తో నడిచే ప్రభుత్వంలా కాదు. దేశాభివృద్ధిలో తెలంగాణను భాగస్వామి చేసేలా రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. 2024లో కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం, ఆయన అండదండలతో 2023లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడేలా ప్రజలు సహకరించాలి..’ అని అమిత్‌షా కోరారు.
లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి
ఒక్క ఉద్యోగ భర్తీ పరీక్షను కూడా సరిగ్గా నిర్వహించలేని ప్రభుత్వానికి అధికారం చెలాయించే అర్హత లేదు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డాక టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీతో సంబంధమున్న ప్రతి ఒక్కరినీ జైలుకు పంపుతాం. రాష్ట్రంలో ఎస్‌ఎస్‌సీ ప్రశ్నపత్రాలు కూడా లీక్ అయ్యాయి. టీఎస్‌పీఎస్సీ లీకేజీతో లక్షలాది మంది నిరుద్యోగులు, యువత జీవి తం నాశనమైంది. ఎన్నికల మైదానంలో ఈ నిరు ద్యోగులు కూడా కేసీఆర్ ప్రభుత్వ లెక్కాపత్రాలు సరిచేసి తగిన తీర్పు ఇవ్వబోతున్నారు.
టీఎస్‌పీఎస్సీ లీకేజీపై కేసీఆర్ కనీసం నోరు విప్పలేదు. కేసీఆర్ ఎవరిని రక్షించాలని అనుకుంటున్నారు? ఆయనకు ధైర్యముంటే ఈ అంశంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. విచారణ నిర్వహించకుండా మీరు తప్పించుకోగలమని అనుకుంటున్నారేమో.. బీజేపీ ప్రభుత్వం ఏర్పడగానే అవినీతికి పాల్పడేవారిని జైలుకు పంపించడం ఖాయం. నిరుద్యోగ యువతపై లాఠీలు ప్రయోగించి, బీజేపీ నేతలను జైలుకు పంపించి ప్రజల నోరుమూయించలేరు.
లీకేజీపై ప్రశ్నిస్తే సంజయ్‌ను జైలుకు పంపారు
‘పేపర్ లీకేజీని నిలదీసినందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను జైలుకు పంపించారు. కా నీ 24 గంటలు కూడా ఆయన్ను అందులో ఉంచలేకపోయారు. సంజయ్ చేసిన తప్పేమిటో కేసీఆర్ చె ప్పాలి. నిరుద్యోగ యువతకు జరిగిన నష్టంపై గొంతెత్తిన సంజయ్‌ను అరెస్ట్ చేయడాన్ని మీరు సమర్థిస్తారా? (సభికులు లేదంటూ కేకలు పెట్టారు).
కేసీఆర్ సర్కార్ జైలుకు పంపినా, కేసులు పెట్టినా బీజేపీ కార్యకర్తలు భయపడరు. ప్రభుత్వా న్ని గద్దె దింపేదాకా విశ్రమించరు. బీజేపీ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను అసెంబ్లీలో మాట్లాడనీయకుండా అడ్డుకుంటే లక్షలాది మంది ప్రజలు బీ జేపీకి మద్దతుగా నిలిస్తే మీరేమీ చేయలేకపోయారు’ అని విమర్శించారు.
రాష్ట్రానికి పెద్దయెత్తున కేంద్రం నిధులు
‘మోదీ ప్రభుత్వం రాష్ట్రానికి పెద్ద ఎత్తున నిధులిస్తోంది. మూడేళ్లలో రామగుండం ఫ్యాక్టరీ తెరిపించడం, ఎంఎంటీఎస్ రైలు విస్తరణ, తదితరాలన్నీ కలిసి భారీగా మేలు జరిగింది. తెలంగాణకు మెగా టెక్స్‌టైల్ పార్కు కూడా మోదీ ఇచ్చారు. రూ.లక్ష కోట్లు ఇక్కడ హైవేల కోసం ఖర్చయ్యాయి. ఎనిమిదేళ్ల పాలనలో తెలంగాణలో జాతీయ రహదారులు రెండింతలు అయ్యాయి. ఈ ప్రాంతం గుండా వెళ్లే హైదరాబాద్–బీజాపూర్ హైవే కోసం డబ్బులిచ్చినా, కేసీఆర్ ఇంకా భూసేకరణ చేయకపోవడంతో ఐదేళ్లు ఆలస్యమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
చేవెళ్ల ప్రజలకు అందాల్సిన ప్రయోజనం అందుబాటులోకి రాలేదు. ఒకసారి రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిందంటే మోదీ ఇచ్చే రూపాయికి బీజేపీ ప్రభుత్వం 25 పైసలు కలిపి రూ.1.25 ఖర్చు చేస్తుంది..’ అని అమిత్‌షా అన్నారు. ప్రసంగానికి ముందు మహాత్మా బసవేశ్వర జయంతి పురస్కరించుకుని స్టేజిపై ఏర్పాటు చేసిన ఆయన విగ్రహానికి అమిత్‌షా నివాళులర్పించారు. హైదరాబాద్‌కు చెందిన బడే గులాం అలీఖాన్ జయంతి సందర్భంగా ప్రణామాలు తెలిపారు.
రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు యాదవ్ అధ్యక్షతన జరిగిన సభలో బండి సంజయ్, కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి, పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మధ్యప్రదేశ్ ఇన్‌చార్జి మురళీధర్ రావు, పార్టీ నేతలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎ.చంద్రశేఖర్, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, ఏవీఎన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ముఖ్య నేతలతో భేటీ
అమిత్‌షాకు శంషాబాద్ విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. పలువురు ముఖ్య నేతలతో పాటు ఎంపీ అరవింద్, రఘునందన్‌రావు, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తదితరులు శాలువాలు కప్పి సత్కరించారు. అక్కడినుంచి అమిత్‌షా నేరుగా నోవాటెల్ హోటల్‌కు చేరుకున్నారు.
అక్కడ తరుణ్‌ఛుగ్, కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్ర రాజకీయాలపై, భవిష్యత్తులో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించినట్లు తెలిసింది. సుమారు నలభై నిమిషాల పాటు ఆయన పార్టీ నేతలతో కలిసి ఉన్నారు. అనంతరం రోడ్డు మార్గంలో చేవెళ్లకు బయలుదేరి వెళ్లారు. కాగా ట్రిపుల్ ఆర్ సినీ బృందంతో అమిత్‌షా భేటీ రద్దయ్యింది.
ప్రజల దృష్టి మళ్లించేందుకే బీఆర్‌ఎస్‌గా మార్పు
‘మీ కుటుంబ అవినీతిమయ పాలన గురించి తెలంగాణ ప్రజలకు పూర్తిస్థాయిలో తెలిసి వచ్చింది. భారీగా ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అవుతున్నాయి. పలు కుంభకోణాల్లో మీ సన్నిహితులే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వివిధ ప్రాజెక్టుల నిర్మాణంలో తెలంగాణలో అవినీతి గంగ వరదలా పారింది. వాటిని, తెలంగాణను కేసీఆర్ కుటుంబం ఏటీఎంగా వాడుకుంటోంది. తమ అవినీతి, అక్రమాలు, వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చారు.
ప్రధాని కావాలని కేసీఆర్ కలలు కంటున్నారు. కొన్ని రాష్ట్రాల్లో పర్యటించి ప్రధాని అయినట్టు అనుకుంటున్నారు. కానీ ప్రధానమంత్రి కుర్చీ ఖాళీ లేదు. అందులో మోదీ ఉన్నారు. 2024 ఎన్నికల్లోనూ మళ్లీ పూర్తి మెజారిటీతో ప్రధాని కాబోతున్నారు. చేవెళ్ల ప్రజలు 2024లో మోదీని ప్రధానిని చేస్తారా.. లేదా.. రెండు చేతులెత్తి చెప్పండి.
రాష్ట్రంలోనే వారి పాలన, పని ముగిసిపోతుంటే, ఇంకా జాతీయ రాజకీయాల గురించి గొప్పలెందుకు? లోక్‌సభ ఎన్నికల సినిమా రావడానికి ముందే ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ఏర్పడే ట్రైలర్ రాబో తోంది..’ అని అమిత్‌షా అన్నారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావాలా వద్దా? ఢిల్లీలో మోదీకి వినిపించేలా గట్టిగా చెప్పండి అంటూ ‘భారత్ మాతా కీ జై’ నినాదాలు చేయించారు.
Comments
Please login to add a commentAdd a comment