సాక్షి, హైదరాబాద్/కుషాయిగూడ/అబిడ్స్: పీడీ యాక్ట్ కేసులో ఆగస్టు 25న అరెస్టయిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను విడుదల చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని బుధవారం ఆదేశించింది. ఆయనపై నమోదు చేసిన కేసును ఎత్తివేయడంతో పాటు పలు ఆంక్షలు విధించింది. దాదాపు రెండున్నర నెలలుగా చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉంటున్న ఎమ్మెల్యేలకు ఎట్టకేలకు ఊరట లభించింది.
‘మతపరంగా అభ్యంతరకర, రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు చేయొద్దు. జైలు నుంచి విడుదలయ్యే సమయంలో ర్యాలీలు నిర్వహించొద్దు. న్యాయవాది, పిటిషనర్‌తో పాటు నలుగురు కుటుంబ సభ్యులు మాత్రమే జైలుకు వెళ్లాలి. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు ఎలాంటి ఇంటర్వ్యూ ఇవ్వకూడదు’అని న్యాయమూర్తులు జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డి, జస్టిస్ జె.శ్రీదేవి ధర్మాసనం బుధవారం ఆదేశించింది. ఈ షరతులతో పాటు క్రైం నంబర్ 261/2022లో కిందికోర్టు ఇచ్చిన ఆంక్షలు వర్తిస్తాయి. సమాజంలో మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ రాజాసింగ్‌పై ఆగస్టు 25న పోలీసులు పీడీ యాక్టు నమోదు చేసి అరెస్టు చేశారు. పోలీసులు పీడీ చట్టం నమోదు చేయడాన్ని వ్యతిరేకిస్తూ రాజాసింగ్ భార్య ఉషాభాయి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్, పిటిషనర్ తరఫున న్యాయవాది రవిచందర్ వాదనలు వినిపించారు. ‘రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సమాజంలో రెచ్చగొట్టేవిధంగా వ్యవహరిస్తున్నారు. ఆయనపై వందకుపైగా క్రిమినల్ కేసులున్నాయి. అందులో ఒక హత్య కేసు కూడా ఉంది. మంగళ్‌హాట్ పీఎస్‌లో ఇప్పటికీ రౌడీషీట్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం శాంతిభద్రతల పరిరక్షణ చర్యల్లో భాగంగానే మూడు క్రిమినల్ కేసుల ఆధారంగా రాజాసింగ్‌పై పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపింది. పీడీ యాక్ట్ నమోదు కేసులో 12 నెలలపాటు జైల్లో ఉంచేందుకు వీలుగా ప్రభుత్వం జీవో 90ని జారీ చేసింది. రాజాసింగ్‌ను పీడీ యాక్ట్ కింద అరెస్టు చేయడాన్ని అడ్వయిజరీ బోర్డు కూడా సమర్ధించింది’అని ఏజీ వాదించారు.
తప్పుడు ఆరోపణలతో పీడీ యాక్ట్ నమోదు...
‘రాజాసింగ్‌పై ఉన్న కేసుల్లో కిందికోర్టు రిమాండ్‌కు పంపేందుకు నిరాకరించింది. ఈ పరిస్థితుల్లో కావాలని ఆయనపై తప్పుడు ఆరోపణలు చేసి పీడీ యాక్ట్ ప్రయోగించారు. గత పదేళ్లల్లో రాష్ట్ర ప్రభుత్వం పలువురిపై నమోదు చేసిన పీడీ యాక్ట్ కేసుల్ని కోర్టు కొట్టేసింది. సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా పీడీ యాక్ట్‌ను ప్రయోగించారు. ప్రవక్త గురించి రాజాసింగ్ మాట్లాడినట్లుగా తప్పుడు వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. వీడియోలోని ఆ వాయిస్ రాజా సింగ్‌ది కాదు. అసలు ఆయన మహ్మద్ ప్రవక్త గురించి ఏమీ మాట్లాడలేదు. రాజాసింగ్‌పై పీడీ యాక్ట్ ప్రయోగించడానికి పోలీసులు చూపుతున్న 15 కేసుల్లో ఆధారాలు లేవన్నారు. పీడీ యాక్ట్‌ను రద్దు చేయాలి’అని రవిచందర్ వాదనలు వినిపించారు.
సాయంత్రం చర్లపల్లి జైలు నుంచి విడుదల
హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో బుధవారం సాయంత్రం రాజాసింగ్ చర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యారు. చర్లపల్లి జైలు వద్దకు కుటుంబసభ్యులు, రాజాసింగ్ తరఫు న్యాయవాదితో పాటు అభిమానులు, కార్యకర్తలు భారీ ఎత్తున చేరుకున్నారు. జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. సాయంత్రం 6 గంటల 50 నిమిషాల ప్రాంతంలో భార్య, మనుమడు, న్యాయవాది కారులో జైలులోనికి వెళ్లారు. కొద్దిసేపటి తర్వాత రాజాసింగ్ బయటికి వచ్చారు. శాంతిభద్రతల దృష్ట్యా చర్లపల్లి జైలు వద్ద భారీగా పోలీసులు మోహరించారు. రాజాసింగ్ జైలు నుంచి ధూల్‌పేట్‌లోని ఆయన నివాసానికి రావడంతో పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు స్వాగతం పలికి సంబరాలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment