చెట్టును పట్టుకొని ఉన్న మేఘనాథ్ దగ్గరకు వెళ్లిన పోలీసులు
సాక్షి, హయత్‌నగర్/లింగోజిగూడ: జారిన చెప్పులను పట్టుకోవాలని ప్రయత్నించి చెరువులో మునిగి బాలుడు మృతి చెందగా చెట్టుకొమ్మను పట్టుకొని మరో బాలుడు తన ప్రాణాలను రక్షించుకున్నాడు. ఈ ఘటన మంగళవారం హయత్‌నగర్ పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తట్టిఅన్నారం హనుమాన్‌నగర్ కాలనీలో నివాసం ఉండే రావుల వాసుదేవరెడ్డి కుమారుడు ధీరజ్‌రెడ్డి భార్య సింధుతో కలిసి గతంలో ఆస్ట్రేలియా వెళ్లారు. వీరికి కుమారుడు రావుల రిషిత్‌రాంరెడ్డి(8).
ఆస్ట్రేలియాలో ఉండగానే సింధు మృతి చెందడంతో కుమారుడిని తీసుకొని మూడేళ్ల క్రితం ఇండియాకు తిరిగి వచ్చి తండ్రి వాసుదేవారెడ్డి వద్ద ఉంటున్నారు. అనంతరం ధీరజ్‌రెడ్డికి బెంగళూర్‌లో ఉద్యోగం రావడంతో తన కుమారుడిని తాత వద్దే వదిలేసి వెళ్లాడు. రిషిత్ ప్రస్తుతం హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో మూడో తరగతి చదువుతున్నాడు. బెంగళూరు నుంచి అప్పుడప్పుడు వచ్చి వెళ్తున్న ఆయన వారం క్రితమే తిరిగి వెళ్లాడు.
చదవండి: నేను ఇవ్వను.. ప్రధాని నాకోసం ఆ పైసలు పంపారు !
మంగళవారం మధ్యాహ్నం భోజనం చేసిన అనంతరం రిషిత్ తన స్నేహితుడు మేఘనాథ్‌ను తీసుకొని సైకిల్‌పై బయటకు వెళ్లాడు. కాలనీకి ఆనుకొని తట్టిఅన్నారం ఊర చెరువు ఉండటంతో ఇటీవల కురిసిన వర్షాలకు కాలనీలోకి నీరు వచ్చి చేరింది. రిషిత్ సైకిల్ తొక్కుతుండగా మేఘనాథ్ వెనుక కూర్చున్నాడు. చెరువు సమీపంలోకి రాగానే సైకిల్ అదుపు తప్పి నీటిలో పడ్డారు. రిషిత్ చెప్పులు ఊడిపోవడంతో వాటిని తీసుకునేందుకు ఇద్దరూ చెరువు లోపలికి వెళ్లారు.
లోతు ఎక్కువ ఉండటంతో రిషిత్ నీటిలో మునిగిపోగా మేఘనాథ్ పక్కనే ఉన్న చెట్టును పట్టుకొని ఉండి పోయాడు. సాయంత్రం సమయంలో అక్కడి నుంచి అరుపులు వినిపిస్తుండటంతో స్థానికంగా ఉన్న దేవాలయానికి వచ్చిన వారు బాలుడిని గమనించి స్థానికులకు విషయం చెప్పారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న కానిస్టేబుల్ కృష్ణ, వి.మధు, రాణి తాడు సాయంతో మేఘనాథ్‌ను రక్షించారు. అక్కడే చెట్లలో ఇరుక్కుపోయిన రిషిత్‌ను కూడా బయటకు తీయగా అప్పటికే మృతి చెందాడు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు నెలకొన్నాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: Hyderabad: అక్క ఇంటికే కన్నం వేసిన చెల్లెలు
Comments
Please login to add a commentAdd a comment