రైళ్లు, విమానాల రాకపోకలకు బ్రేక్‌ | 120 Trains Disrupted And 20 Flight Services Stop At Shamshabad Due To Michang Cyclone, See Details Inside - Sakshi
Sakshi News home page

Michang Cyclone: రైళ్లు, విమానాల రాకపోకలకు బ్రేక్‌

Published Wed, Dec 6 2023 2:01 AM | Last Updated on Wed, Dec 6 2023 9:27 AM

Break for trains and planes - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మిచాంగ్‌ తుపాన్‌ ప్రభావంతో మంగళవారం కూడా వివిధ ప్రాంతాలకు వెళ్లే రైళ్లు రద్దయ్యాయి. కొన్ని రూట్‌లలో పరిమితంగా సర్విసులను పునరుద్ధరించారు. ముంబయి మీదుగా చెన్నైకి వెళ్లే కొన్ని రైళ్లను ఇతర మార్గాల్లో మళ్ళించారు. ఈ నెల 8వ తేదీ వరకు వివిధ మార్గాల్లో సుమారు 120 రైళ్లను రద్దు చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు.

తుపాన్‌ తగ్గుముఖం పట్టి, సాధారణ పరిస్థితులు నెలకొంటే రైళ్లను పునరుద్ధరించనున్నట్లు దక్షిణమధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌కుమార్‌ జైన్‌ తెలిపారు. తెలుగు రాష్ట్రాలతో పాటు, చెన్నై, భువనేశ్వర్, కోల్‌కతా, తదితర ప్రాంతాలకు వెళ్లే రైలు మార్గాల్లో వరదల ప్రభావాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. పట్టాలపై వరదనీటిని తొలగించేందుకు క్షేత్రస్థాయిలో సిబ్బంది రాత్రింబవళ్లు విధులను నిర్వహిస్తున్నారని వివరించారు. 

రాకపోకలు నిలిచిన రైళ్ళు ఇవే: కాచిగూడ–చెంగల్పట్టు, హైదరాబాద్‌–తాంబరం, సికింద్రాబాద్‌–కొల్లాం, సికింద్రాబాద్‌–తిరుపతి, లింగంపల్లి–తిరుపతి. సికింద్రాబాద్‌–రేపల్లె, కాచిగూడ–రేపల్లె. చెన్నై–హైదరాబాద్, సింద్రాబాద్‌–గూడూరు, సికింద్రాబాద్‌–త్రివేండ్రమ్‌ తదితర ప్రాంతాల మధ్య నడిచే రైళ్లను రద్దు చేశారు. మరోవైపు చెన్నై నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే రైళ్ల రాకపోకలు కూడా నిలిచిపోయాయి. రైళ్ల రాకపోకలపై ప్రయాణికులకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేసేందుకు సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్లలో అధికారులు ఏర్పాట్లు చేశారు.  

ఆ రూట్‌లో రైలు సర్విసులు పునరుద్ధరణ: తిరుపతి–సికింద్రాబాద్, లింగంపల్లి–తిరుపతి, సికింద్రాబాద్‌–గూడూరు రూట్‌లలో కొన్ని సర్విసులను పునరుద్ధరించినట్లు అధికారులు పేర్కొన్నారు. తుపాన్‌ కారణంగా రద్దయిన రైళ్లలో ఇప్పటికే రిజర్వేషన్‌లు బుక్‌ చేసుకొన్న ప్రయాణికులు రైళ్ల పునరుద్ధరణకు అనుగుణంగా తిరిగి తమ టికెట్‌లను బుక్‌ చేసుకోవచ్చు. 

20 విమాన సర్విసులు రద్దు 
శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే సుమారు 20 దేశీయ విమాన సర్విసులు నిలిచిపోయినట్లు అధికార వర్గాలు తెలిపాయి. హైదరాబాద్‌ నుంచి విజయవాడ, విశాఖ, చెన్నై, రాజమండ్రి, భువనేశ్వర్‌ తదితర ప్రాంతాలకు బయలుదేరే విమానాలను వాతావరణ ప్రభావం కారణంగా అధికారులు రద్దు చేశారు. మరోవైపు చెన్నై నుంచి హైదరాబాద్‌కు రావలసిన విమాన సర్వీసులు కూడా ఆగిపోయాయి. తప్పనిసరిగా వెళ్లవలసిన వాళ్లు రైళ్లతో పాటు విమానాలు కూడా రద్దవడంతో ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement