![Brother And Sister Death Tragedy In Adilabad - Sakshi](/styles/webp/s3/article_images/2021/11/10/ADB.jpg.webp?itok=Y227LgyS)
సాక్షి, ఇంద్రవెల్లి(ఆదిలాబాద్): అన్నా.. నీ వెంటే నేనూ అంటూ సోదరుడు మరణించిన గంట వ్యవధిలో సోదరి కూడా మృతిచెందింది. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం తేజాపూర్‌లో మంగళవాం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. తేజాపూర్ గ్రామానికి చెందిన నర్వటె మారుతి(65) తెల్లవారు జామున గుండెపోటుతో మృతిచెందాడు. ఆదే గ్రామంలో ఉంటున్న చెల్లెలు మస్కె రేణుక(48) అన్న మరణ వార్త విని వెంటనే సోదరుడి ఇంటికి చేరుకుంది. మారుతి మృతదేహం వద్ద రోదిస్తూ ఒక్కసారిగా కుప్పకూలింది.
బంధువులు వెంటనే రేణుకను ప్రైవేటు వాహనంతో ఆదిలాబాద్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు రేణుక అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. అన్న చనిపోయాడన్న బాధతో రేణుక కూడా గుండెపోటుతో మృతిచెంది ఉంటుందని తెలిపారు. గంట వ్యవధిలోనే అన్నాచెల్లెలు మృతిచెందడంతో తేజాపూర్‌లో విషాదం నెలకొంది. నర్వెట మారుతికి భార్య రత్నాబాయి, మస్కె రేణుకాబాయికి కూతురు నిర్గున, కొడుకు గోరాక్‌నాథ్ ఉన్నారు. బంధువులు అన్నాచెల్లెలిద్దరికీ ఒకేచోట అంత్యక్రియలు పూర్తిచేశారు.
Comments
Please login to add a commentAdd a comment