సాక్షి, హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మికి ఉప్పల్ నియోజకవర్గంలో చేదు అనుభవం ఎదురైంది. చిలుకానగర్ డివిజన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలో రసాభాస చోటుచేసుకుంది. మేయర్ విజయలక్ష్మి, స్థానిక కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్‌కు సొంత పార్టీ కార్యకర్తల నుంచే నిరసన సెగ తగిలింది. స్థానిక ఎమ్మెల్యే సుభాష్ రెడ్డిని పిలవకుండా ఎలా శంకుస్థాపనలు చేస్తారంటూ మేయర్ విజయలక్ష్మిని స్థానిక బీఆర్‌ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. మేయర్ ప్రోటోకాల్ పాటించట్లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మేయర్ విజయలక్ష్మి తీరుకు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ కార్యకర్తలు నిరసనకు దిగారు. ఎమ్మెల్యే అనుచరులు, మేయర్ వర్గం మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రెండు వర్గాలు పోటా పోటీగా నినాదాలు చేసుకున్నాయి. దీంతో బీఆర్ఎస్ కార్యకర్తలపై విజయలక్ష్మి అసహనం వ్యక్తం చేశారు. జీహెచ్‌ఎంసీ నిధులతో చేస్తున్న కార్యక్రమాలకు ఎమ్మెల్యేను పిలవాల్సిన అవసరం లేదంటూ ఆగ్రహించారు. ప్రోటోకాల్‌తో తనకు సంబంధం లేదని, అది అధికారుల పనంటూ శంకుస్థాపన చేయకుండానే మేయర్ వెనుదిరిగారు.
Comments
Please login to add a commentAdd a comment