రెండో రోజు అసెంబ్లీ ప్రశ్నోత్తరాలకే పరిమితం
సభలో రెండు ప్రభుత్వ బిల్లులు ప్రవేశపెట్టిన ప్రభుత్వం
పలు అంశాలపై బీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఐ వాయిదా తీర్మానాలు
నేడు ఉదయం 10 గంటలకు తిరిగి సమావేశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశాల రెండో రోజు సోమవారం బీఆర్‌ఎస్ నిరసన లు, వాకౌట్, అధికారపక్ష సభ్యుల విమర్శల మధ్య శాసనసభ అర్ధంతరంగా ముగిసింది. ఈ నెల 9న అసెంబ్లీ సమావేశాలు లాంఛనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఆ ఒక్క రోజే భేటీ నిర్వహించి, 16వ తేదీకి (సోమవారానికి) వాయిదావేశారు. ఈమేరకు సోమవారం ఉదయం 10 గంటలకు శాసనసభ సమావేశం ప్రారంభమైనా.. ప్రశ్నోత్తరా లు, సంతాప తీర్మానాలు, ప్రభుత్వ బిల్లుల ప్రతిపాదనకే పరిమితమైంది.
మాజీ సర్పంచ్‌లకు పెండింగ్ బిల్లుల చెల్లింపుపై ప్రభుత్వం నిర్దిష్ట హామీ ఇవ్వలేదని నిరసన తెలుపుతూ బీఆర్‌ఎస్ ప్రశ్నోత్తరాల సమయంలో సభ నుంచి వాకౌట్ చేసింది. ప్రశ్నోత్తరాలు, టీ విరామం తర్వాత సభ తిరిగి సమావేశంకాగానే.. ‘లగచర్ల’అంశంపై చర్చకోసం బీఆర్‌ఎస్ పట్టుబట్టింది. ఈ గందరగోళంతో స్పీకర్ సభ ను మంగళవారం ఉదయానికి వాయిదా వేశారు.
నిర్దేశిత సమయంలోనే ప్రశ్నోత్తరాలు
సోమవారం ఉదయం 10 గంటలకు సభ ప్రారంభమైన వెంటనే ప్రశ్నోత్తరాలకు సంబంధించి స్పీకర్ ప్రకటన చేశారు. రోజూ గంటపాటు జరిగే ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో.. పది ప్రశ్నలకు ఒక్కో ప్రశ్నకు ఆరు నిమిషాల సమయం లభిస్తోందని తెలిపారు. కానీ నిర్దేశిత సమయంలో పూర్తి చేయకపోవడం, కొన్ని ప్రశ్నలు మిగిలిపోవడంతో సభ్యులు అసంతృప్తి చెందుతున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో సభ్యులు, మంత్రులు ప్రశ్నలు, సమాధానాలు సూటిగా, క్లుప్తంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు.
సంతాప తీర్మానాలు.. బిల్లులు..
⇒ ఉమ్మడి ఏపీ శాసనసభలో తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహించిన ముగ్గురు దివంగత సభ్యులకు శాసనసభ రెండు నిమిషాల పాటు సంతాపం ప్రకటించింది. మాజీ ఎమ్మెల్యేలు కొమిరెడ్డి జ్యోతిదేవి (మెట్‌పల్లి), ఊకె అబ్బయ్య (బూర్గంపాడు, ఇల్లందు), డి.రామచంద్రారెడ్డి (దొమ్మాట) మరణం పట్ల స్పీకర్ ప్రసాద్‌కుమార్ సంతాప తీర్మానం ప్రతిపాదించారు.
⇒ ‘యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఆఫ్ తెలంగాణ బిల్లు 2024’ను సీఎం రేవంత్ పక్షాన మంత్రి శ్రీధర్‌బాబు సభకు సమరి్పంచారు. ‘తెలంగాణ యూనివర్సిటీస్ (సవరణ) బిల్లు–2024’ను సీఎం తరఫున మంత్రి దామోదర రాజనర్సింహ సభలో ప్రవేశపెట్టారు. వాయిదా తీర్మానాలన్నీ తిరస్కరించిన స్పీకర్
⇒అసెంబ్లీ సమావేశాల రెండో రోజున బీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఐ సభ్యులు ఇచి్చన పలు వాయిదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరించారు.
⇒ ‘లగచర్ల’అంశంపై చర్చించాలని కోరుతూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, కాలేరు వెంకటేశ్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, విజయుడు, మర్రి రాజశేఖర్‌రెడ్డి వాయిదా తీర్మానం ప్రతిపాదించారు. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెద్దపులి దాడులను అరికట్టడం, బాధితులకు పరిహారం అందించే అంశంపై బీజేపీ ఎమ్మెల్యేలు పాల్వాయి హరీశ్, పాయల్ శంకర్ వాయిదా తీర్మానం ఇచ్చారు.
⇒ మూసీ ప్రక్షాళన, హైడ్రాపై చర్చించాలంటూ సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వాయిదా తీర్మానం ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment