జస్టిస్ పినాకిని చంద్రఘోష్ నేతృత్వంలో జ్యుడీషియల్ విచారణకు కేబినెట్ నిర్ణయం
యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంపైనా జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి అధ్యక్షతన మరో కమిషన్
రెండు కమిషన్లకూ 100 రోజుల గడువు
సీఎం రేవంత్ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్
వివరాలు వెల్లడించిన మంత్రులు
కేబినెట్ కీలక నిర్ణయాలివీ..
4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం
త్వరలో అర్హులైన పేదలందరికీ తెల్లరేషన్‌కార్డులు
రేషన్‌కార్డుతో ఆరోగ్యశ్రీ పథకాన్ని విడదీయాలని నిర్ణయం
ఎస్‌హెచ్‌జీలకు ఓఆర్‌ఆర్ చుట్టూ 30 ఎకరాలు
మహిళల సాధికారత కోసం‘తెలంగాణ మహిళా శక్తి’
డీఎస్సీ 2008 క్వాలిఫైడ్ అభ్యర్థులకు కొలువులు
ఓబీసీ, ఎస్సీ, ఎస్టీల కోసం కొత్తగా 16 కార్పొరేషన్లు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ పినాకిని చంద్రఘోష్ అధ్యక్షతన జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. జస్టిస్ చంద్రఘోష్ గతంలో లోక్‌పాల్‌గా, ఏపీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు. మరోవైపు యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణం, ఛత్తీస్‌గఢ్ విద్యుత్ ఒప్పందంపై విచారణకు జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి అధ్యక్షతన మరో జ్యుడీషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని కేబినెట్ తీర్మానించింది.
నివేదికల సమర్పణకు గాను రెండు కమిషన్లకు 100 రోజుల గడువు విధించింది.
సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో 2 గంటలకు పైగా సమావేశమైన కేబినెట్ పలు అంశాలపై చర్చించింది. కొత్త రేషన్‌కార్డులు, తొలివిడతలో 4.5 లక్షల ఇళ్ల నిర్మాణం లాంటి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సమావేశం అనంతరం మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌తో కలిసి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మీడియా సెంటర్‌లో విలేకరులకు వివరాలు వెల్లడించారు.
కాళేశ్వరంలో అవినీతిపై విచారణ: పొంగులేటి
కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, అవకతవకలపైనా, ఎవరి ఒత్తిడితో ప్రాజెక్టును అలా కట్టారో అనే అంశంపై జస్టిస్ పినాకిని చంద్రఘోష్ కమిషన్ విచారణ జరుపుతుందని పొంగులేటి తెలిపారు. టెండర్లు నిర్వహించకుండా నామినేషన్ల విధానంలో ఛత్తీస్‌గఢ్ నుంచి నేరుగా 1000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు చేసేందుకు గత ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుని ఆ విద్యుత్‌ను వాడుకోలేదని మంత్రి ఆరోపించారు. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వంతో కుమ్మక్కై గత ప్రభుత్వం దళారులకు చేసిన చెల్లింపులపై జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ విచారణ జరుపుతుందని చెప్పారు. రాష్ట్రం ఏర్పడ్డాక గత 10 ఏళ్లలో ఇతర రంగాల్లో జరిగిన అవినీతికి సంబంధించి భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేయడంపై మంత్రివర్గంలో చర్చించామని తెలిపారు.
రూ.22,500 కోట్లతో ఇళ్ల నిర్మాణం
ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద తొలి విడతలో ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇళ్లు చొప్పున రూ.22,500 కోట్లతో మొత్తం 4.5 లక్షల ఇళ్ల నిర్మాణ ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇళ్ల స్థలం కలిగిన పేదలు, నిరుపేదలకు దీనిని వర్తింపజేస్తారు. గ్రామాల వారీగా గ్రామసభలు ఏర్పాటు చేసి పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా, కాంగ్రెస్, కమ్యూనిస్ట్, పింక్ షర్ట్ వారు అని చూడకుండా, పైరవీలకు తావు లేకుండా అర్హులను ఎంపిక చేస్తామని పొంగులేటి తెలిపారు.
త్వరలో 93 శాతానికి పైగా రైతులకు రైతుబంధు
ప్రస్తుత ప్రభుత్వం మహిళలను కోటీశ్వరుల్ని చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి పొంగులేటి తెలిపారు. ఇందులో భాగంగా స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) మహిళల ఉత్పత్తులకు బ్రాండింగ్, మార్కెటింగ్ కల్పించడానికి వీలుగా ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటు కోసం అవుటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) చుట్టూ 25 నుంచి 30 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని మంత్రివర్గంలో నిర్ణయించినట్టు తెలిపారు.
ఇక్కడి స్థలాన్ని జిల్లాల వారీగా మహిళా గ్రూపులకు కేటాయిస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నియోజకవర్గ స్థాయిల్లో విశాలమైన మినీ ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేయాలని తీర్మానించినట్టు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 84 శాతం రైతులకు రైతుబంధు ఇచ్చిందని, వచ్చే 2 రోజుల్లో 93 శాతానికి పైగా రైతులకు ఇవ్వాలని మంత్రివర్గంలో నిర్ణయించినట్లు పొంగులేటి తెలిపారు.
త్వరలో కొత్త రేషన్‌కార్డులు
అతి కొద్ది రోజుల్లోనే అర్హులైన పేదలందరికీ కొత్తగా తెల్ల రేషన్‌కార్డులు జారీ చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. రేషన్ కార్డులుంటేనే ఆరోగ్యశ్రీ, ఇతర సంక్షేమ పథకాలు వర్తిస్తాయనే భావన ప్రజల్లో ఉందని, ఈ నేపథ్యంలో రేషన్‌కార్డుతో ఆరోగ్యశ్రీ పథకాన్ని విడదీసి అమలు చేయాలని భావిస్తున్నామని శ్రీధర్‌బాబు తెలిపారు. దీనిపై నివేదిక సమర్పించాలని పౌరసరఫరాల శాఖను ఆదేశించామన్నారు.
2008 డీఎస్సీ అభ్యర్థులకు లైన్‌క్లియర్
2008 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులకు మినిమమ్ పే స్కేల్ (టైమ్ పేస్కేల్) ఇచ్చి ఉద్యోగాల్లో తీసుకోవాలని మంత్రివర్గం నిర్ణయించింది. హైకోర్టు, సుప్రీంకోర్టుల నుంచి అభ్యర్థులు తమకు అనుకూలంగా తీర్పులు తీసుకువచ్చారని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. కాగా వేసవిలో తాగునీటి సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామని మంత్రి చెప్పారు. గత సెపె్టంబర్, అక్టోబర్ మాసంలో వర్షాలు పడక రిజర్వాయర్లలో నిల్వలు అడుగంటిపోయాయని పేర్కొన్నారు.
కొత్తగా 16 కార్పొరేషన్లు
మహిళల సాధికారత కోసం ‘తెలంగాణ మహిళా శక్తి’ అనే కొత్త కార్యక్రమాన్ని చేపట్టాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయపరంగా మహిళలను ముందుకు తీసుకెళ్లేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించింది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఓబీసీ, ఎస్సీ, బీసీ, ఎస్టీల కోసం మొత్తం 16 కార్పొరేషన్లను ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది.
1.యాదవ (కుర్మ), 2.మున్నురుకాపు, 3.పద్మశాలి, 4.పెరిక (పురగిరి క్షత్రియ), 5.లింగాయత్, 6.బలిజ, 7.గంగపుత్ర, 8.మేరా, 9.ముదిరాజ్ కార్పొరేషన్, 10.ఆర్య వైశ్య, 11.రెడ్డి కార్పొరేషన్, 12.మాదిగ, మాదిగ ఉపకులాలు, 13.మాల/మాల ఉపకులాలు, 14.కుమురం భీమ్ ఆదివాసి, 15. సంత్ సేవాలాల్ లంబాడి, 16.ఎరుకలు, ఇతర ఉపకులాల కోసం ఏకలవ్య.. కార్పొరేషన్లు ఏర్పాటు చేయనుంది.
ఈబీసీల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు: పొన్నం
కులగణన నిర్వహణకు ప్రక్రియ ప్రారంభమైందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈబీసీల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించిందని చెప్పారు. ఆర్థికంగా ఎదగడానికి అవసరమైన సాంకేతికత జోడించడం కోసం కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం ఎంబీసీ కార్పొరేషన్‌కు రూ.1,000 కోట్లు కేటాయించి రూ.ఒక్క కోటి కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు.
తాము కొత్త కార్పొరేషన్లకు నిధులు కేటాయిస్తామని, త్వరలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆయా వర్గాల వారితో సంప్రదింపులు జరిపి రెండు మూడు వారాల్లో కార్పొరేషన్లకు సంబంధించిన విధివిధానాలను రూపొందిస్తారని శ్రీధర్‌బాబు తెలిపారు. గీత కార్పొరేషన్ ద్వారా గీత కార్మికులకు త్వరలో రక్షణ పరికరాలను అందజేస్తామని, వాటితో చెట్లను ఎక్కితే కిందపడే ప్రమాదం ఉండదని, మరణాలూ ఉండవని పొన్నం చెప్పారు.
బీఆర్‌ఎస్ ఖాళీ అయింది: కోమటిరెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులందరం కలిసి బృందంగా పనిచేస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. కేటీఆర్, హరీశ్, కేసీఆర్ ఈ రోజు మహిళలపై ప్రేమ ఒలకబోస్తున్నారని, అధికారంలోకి ఉన్నప్పుడు మాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడం ద్వారా ప్రతిపక్ష పాత్ర పోషించాలని సూచించారు. బీఆర్‌ఎస్ పార్టీ ఖాళీ అయిందని, జెడ్పీ/మున్సిపల్ చైర్మన్లు, కింది స్థాయి నేతలు ఆ పార్టీని వీడి కాంగ్రెస్, మరో పార్టీలో చేరుతున్నారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment