మృతదేహాలను బయటకు తీస్తున్న స్థానికులు
గజ్వేల్: వేములవాడ రాజన్న దర్శనానికి వెళ్లి వస్తుండగా మార్గమధ్యలో సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలం ముని గడపలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని బలితీసుకుంది. అతివేగం వల్ల కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొని రోడ్డు పక్కనే ఉన్న కొండ పోచమ్మసాగర్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్‌లో పడిపోవడంతో ఈ దుర్ఘటన జరిగింది.
ఘటనా స్థలంలోనే ఐదుగురు మృతి చెందగా.. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు కన్ను మూశారు. ప్రత్యక్ష సాక్షులు, పోలీసుల కథనం ప్రకారం.. యాదాద్రి– భువనగిరి జిల్లా బీబీనగర్ మండల కేంద్రానికి చెందిన బొల్లు సమ్మయ్య(38).. భార్య స్రవంతి(36), కూతురు భవ్య(13), కుమారుడు కార్తీక్ అలియాస్ లోకేశ్ (11)లతో పాటు అదే జిల్లా బొమ్మల రామారం మండలం మల్యాల గ్రామానికి చెందిన మామ బిట్టు వెంకటేష్ (58), అత్త రాజమణి(56)లను తీసుకొని ఆల్టో కారులో తనే డ్రైవింగ్ చేస్తూ సోమవారం మధ్యాహ్నం వేములవాడ రాజన్న ఆల యానికి వెళ్లాడు. సమ్మయ్య ఏటా ఆలయానికి ఆనవాయి తీగా వెళ్తుంటాడు. మొక్కుతీర్చుకొని వీరంతా మంగళవారం తిరుగు ప్రయాణమయ్యారు. తక్కువ దూరం ఉంటుందని భావించి రాజీవ్ రహదారిపై ఉన్న గజ్వేల్ మండలం కొడకండ్ల నుంచి జగదేవ్‌పూర్, భువనగిరి వైపు వచ్చారు.
కల్వర్టును ఢీకొట్టిన తర్వాత..
మార్గమధ్యలో మధ్యాహ్నం 3.30గంటల సమయంలో మునిగడప గ్రామ స్టేజీ సమీపంలో ఎల్లమ్మ ఆలయం వద్ద మలుపు దాటిన తర్వాత కొండపోచమ్మసాగర్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్ కోసం నిర్మించిన కల్వర్టును వేగంగా ఢీకొట్టాడు. దాంతో ఒక్కసారిగా కారు అదుపుతప్పింది. ఇదే క్రమంలో స్టీరింగ్ తిప్పి ఎక్సలేటర్ మరింత పెంచడంతో కారు వేగంగా ఎడమ నుంచి కుడివైపు దూసుకువెళ్లి మట్టిగడ్డను తాకింది.
దాని పైనుంచి కాల్వలో మిషన్ భగీరథ పైప్‌లైన్‌ను తాకి అందులో పడిపోయింది. అప్పటికే కాల్వలో నీరు ఉండడం వల్ల కారు తలకిందులైంది. దీంతో కారులో ప్రయాణిస్తున్న వారందరూ తీవ్రంగా గాయపడడంతో పాటు కారులోకి నీరుచేరడంతో నీటమునిగి ఊపిరాడనిస్థితిలో కొట్టుమిట్టా డారు. ఈ ఘటనను చూసిన గ్రామస్తులు హుటాహుటిన పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోవడం, ఇదే సమయంలో ఎస్‌ఐ కృష్ణమూర్తి, గజ్వేల్‌రూరల్ సీఐ రాజశేఖరరెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని నీటమునిగిన వారిని బయటకు తీశారు.
అప్పటికే సమ్మయ్య, స్రవంతి, భవ్య, కార్తీక్‌లతో పాటు రాజమణిలు మృతి చెందినట్లు గుర్తించారు. వెంకటేష్ మాత్రం విషమస్థితిలో ఉన్నట్టు గమనించి ఆయన్ను చికిత్స నిమిత్తం గజ్వేల్‌లోని ప్రభుత్వాస్పత్రికి ఆ తర్వాత సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా... చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహాలను అక్క డి నుంచి పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ఆస్ప త్రికి తరలించారు. ఆర్ధికంగా ఇంకా కుదురు కోని సమ్మయ్య కుటుంబ పోషణ నిమిత్తం స్టీల్ సామాన్ల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. మరో మృతుడు సమ్మయ్య మామ వెంకటేష్‌ది రెక్కాడితేగాని డొక్క నిండని కుటుంబం.
కారు కండీషన్‌లో లేకపోవడం...
మృతులు ప్రయాణించిన కారు కండీషన్ సక్రమంగా లేకపోవడం, అందులో ఆరుగురు ఇరుకుగా కూర్చోవడం కూడా ప్రమాదానికి ఓ కారణంగా భావిస్తున్నారు. కాగా ప్రమాదంలో మృతి చెందిన వెంకటే– రాజమణి దంపతులు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నిరుపేద కూలీలు. రాజమణి గంపలో గాజులు, స్టీల్, ప్లాస్టిక్ సామాన్లు పెట్టుకుని ఇంటింటికి అమ్ముతూ ఉండగా, వెంకటేష్ గ్రామంలో ఎక్కడైనా దినసరి కూలీ లభిస్తే వెళ్లేవాడు. లేని పక్షంలో పూరీ్వకుల నుంచి ఆచారంగా
వచి్చన వృత్తిలో భాగంగా భాగవతం పాటలు పాడుతూ భిక్షాటన చేసేవాడు.
మంత్రి హరీశ్‌రావు దిగ్భ్రాంతి
మునిగడపలో చోటు చేసుకున్న ప్రమాదంలో ఆరుగురు మృతి చెందిన ఘటనపై రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖామంత్రి హరీశ్‌రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతదేహాల పోస్టుమార్టంతో పాటు ఇతర సహాయక చర్యలను వెనువెంటనే జరిపించేందుకు దగ్గరుండి పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్, సీపీ శ్వేతలను ఆదేశించారు. మంత్రి ఆదేశాల నేపథ్యంలో కలెక్టర్, సీపీలు గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి చేరుకొని పోస్టుమార్టం త్వరగా జరిపించి మృతదేహాలను స్వస్థలాలకు తరలించే ఏర్పాట్లు చేయాలని వైద్యాధికారులతో పాటు పోలీసులకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment