రెండు జోన్ల సరిహద్దులో ఘటన
రెండు పీఎస్‌లలో కేసులు నమోదు
నిందితుడి కోసం ముమ్మర గాలింపు
బంజారాహిల్స్: చైన్ స్నాచింగ్ చేసేందుకు ఓ వ్యక్తి ఏకంగా కారు చోరీకి పాల్పడిన సంఘటన బంజారాహిల్స్, ఖైరతాబాద్ పోలీస్‌స్టేషన్ల పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బంజారాహిల్స్ రోడ్డునెంబర్–12లోని ఎన్‌బీటీనగర్ బస్తీకి చెందిన అఫ్రోజ్ తన మారుతీ వ్యాన్‌లో పాఠశాల విద్యార్థులను తీసుకెళ్లేవాడు. గురువారం రాత్రి కారులో సాంకేతిక సమస్య తలెత్తడంతో రిపేరు చేయాలని రోడ్డునెంబర్–12లోని కమాన్‌లో మెకానిక్‌కు కారు అప్పగించి ఇంటికి వెళ్లాడు. అర్ధరాత్రి వరకు కారుకు మరమ్మతులు చేసిన మెకానిక్ షెడ్‌కు తాళం వేసీ ఇంటికి వెళ్లిపోయాడు. శుక్రవారం ఉదయం వ్యాన్ తీసుకెళ్లేందుకు అక్కడికి వచి్చన ఆఫ్రోజ్‌కు షెడ్ ఎదుట కారు కనిపించలేదు.
దీంతో మెకానిక్‌కు ఫోన్ చేయడంతో తాను కారు అక్కడే పార్కింగ్ చేసి వెళ్లిపోయానని చెప్పిన అతను ఘటనా స్థలానికి పరిగెత్తుకొచ్చాడు. పరిసర ప్రాంతాల్లో గాలించినా కారు కనిపించకపోవడంతో బాధితుడు ఆఫ్రోజ్ బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. కారు తాజ్‌కృష్ణా హోటల్ వైపు వెళ్లినట్లుగా గుర్తించారు. కాగా ఉదయం 9.45 గంటల ప్రాంతంలో ఆనంద్‌నగర్ కాలనీలో ఓ మహిళ మెడలో గొలుసు చోరీకి గురైనట్లు ఖైరతాబాద్ పోలీసులకు సమాచారం అందింది. అక్కడి పోలీసులు సీసీ ఫుటేజీలు పరిశీలించగా మారుతీ వ్యాన్‌లో వచ్చిన ఓ వ్యక్తి కారు దిగి కొంతదూరం నడిచి వెళ్లి రోడ్డుపై వెళుతున్న నర్సమ్మ అనే మహిళ మెడలోని 2.5 తులాల బంగారు గొలుసు లాక్కుని పరారైనట్లుగా గుర్తించారు.
దీంతో కంట్రోల్ రూం నుంచి అన్ని ఠాణాలకు సమాచారం అందించారు. బంజారాహిల్స్‌లో చోరీకి గురైన కారు అదేనని గుర్తించారు. దీంతో అటు ఖైరతాబాద్ పోలీసులు, ఇటు బంజారాహిల్స్ పోలీసులు ప్రత్యేక బృందీలను ఏర్పాటు చేసి దొంగ కోసం గాలింపు చేపట్టారు. ఈ విషయాన్ని పసిగట్టిన సదరు దొంగ కారును ఖైరతాబాద్‌లో వదిలేసి సందుల్లో పడి ఉడాయించినట్లుగా తేలింది. అర్ధరాత్రి బంజారాహిల్స్‌లో కారు దొంగిలించిన అతను ఉదయం వరకు అటూ ఇటూ తిరుగుతూ ఆనంద్‌నగర్ కాలనీలో ఒంటరిగా కనిపించిన మహిళను టార్గెట్ చేసుకుని చైన్ స్నాచింగ్‌కు పాల్పడినట్లుగా పోలీసులు నిర్థారించారు. స్నాచర్ కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి. వెస్ట్–సెంట్రల్ జోన్ల సరిహద్దులో ఈ ఘటన చోటు చేసుకోవడంతో బంజారాహిల్స్, ఖైరతాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment