త్వరలోనే కుల గణన!  | Caste Census After end of Assembly budget meetings says CM Revanth | Sakshi
Sakshi News home page

త్వరలోనే కుల గణన! 

Published Sun, Jan 28 2024 1:23 AM | Last Updated on Sun, Jan 28 2024 7:54 AM

Caste Census After end of Assembly budget meetings says CM Revanth - Sakshi

సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో త్వరలోనే కుల గణన చేపడతామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రకటించారు. దీనిపై ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీకి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. కులగణనకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. శనివారం సచివాలయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమ శాఖలపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. బిహార్‌ ప్రభుత్వం ఆ రాష్ట్రంలో ఇప్పటికే కుల గణన నిర్వహించి ఫలితాలను ప్రకటించిందని.. కర్ణాటకలో కాంగ్రెస్‌ సర్కారు కుల గణన చేపట్టిందని, ఫలితాలను ప్రకటించాల్సి ఉందని సమావేశంలో సీఎం రేవంత్‌ వివరించారు. ఈ క్రమంలో రాష్ట్ర శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు ముగిశాక కుల గణన ప్రక్రియను ప్రారంభించేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. కులాల వారీగా  రాష్ట్ర జనాభా వివరాలు తెలిస్తే.. రిజర్వేషన్లతోపాటు అభివృద్ధి, సంక్షేమ పథకాల అమల్లో కచ్చితమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. 

గ్రీన్‌చానల్‌ ద్వారా డైట్‌ చార్జీలు.. 
ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు ఇచ్చే డైట్‌ చార్జీలు, కాస్మెటిక్‌ చార్జీలు, వంట బిల్లులు పెండింగ్‌లో ఉండకుండా చూడాలని.. వీటికి గ్రీన్‌ చానల్‌ ద్వారా చెల్లింపులు చేయాలని అధికారులను సీఎం రేవంత్‌ ఆదేశించారు. మహాత్మా జ్యోతిబా పూలే ఓవర్‌సీస్‌ స్కాలర్‌íÙప్‌ పథకాన్ని మరింత సమర్థంగా అమలు చేయాలని.. ఇప్పుడున్న దానికంటే ఎక్కువ మంది అర్హులైన విద్యార్థులకు మేలు జరిగేలా చూడాలని సూచించారు. ర్యాంకింగ్స్‌ ఆధారంగా టాప్‌ విదేశీ యూనివర్సిటీలను గుర్తించి ఫ్రేమ్‌వర్క్‌ తయారు చేయాలని.. వాటిలో చదివేందుకు వెళ్లే విద్యార్థులకు ఈ పథకం కింద మొదటి ప్రాధాన్యమివ్వాలని ఆదేశించారు. 

ఒకేచోట ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాలు.. 
రాష్ట్రంలో అద్దె భవనాల్లో నిర్వహిస్తున్న సంక్షేమ గురుకుల పాఠశాలలకు సంబంధించి పూర్తి వివరాలను అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. వాటికి సొంత భవనాలను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. యుద్ధ ప్రాతిపదికన భవనాల నిర్మాణానికి సరిపడా స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించాలని సూచించారు. ఒక్కో పాఠశాల భవనం నిర్మాణానికి ఎంత ఖర్చవుతుందో అంచనా వేసి బడ్జెట్‌ ప్రతిపాదనలను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ గురుకుల విద్యా సంస్థలన్నీ వేర్వేరు చోట్ల కాకుండా.. నియోజకవర్గానికో ఇంటిగ్రేటెడ్‌ ఎడ్యుకేషన్‌ హబ్‌ ఏర్పాటు చేయాలని, దీనిపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని చెప్పారు. దీనితో పాఠశాలల నిర్వహణ, పర్యవేక్షణ, అజమాయిషీ మరింత మెరుగవుతుందని పేర్కొన్నారు.

ఎక్కువ మంది విద్యార్థులు ఒకే ప్రాంగణంలో చదువుకోవటం ద్వారా వారిలో పోటీతత్వం, ప్రతిభా పాటవాలు పెరుగుతాయని అభిప్రాయపడ్డారు. వెంటనే అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఎడ్యుకేషన్‌ హబ్‌ల నిర్మాణానికి స్థలాలను గుర్తించాలన్నారు. నియోజకవర్గ కేంద్రంలో వీలుకాకుంటే.. ప్రత్యామ్నాయంగా అదే సెగ్మెంట్లోని మరో పట్టణం లేదా మండల కేంద్రాన్ని ఎంచుకోవాలని సూచించారు. ఇప్పటికే 20 ఎకరాలకుపైగా విస్తీర్ణమున్న స్కూల్‌ ప్రాంగణాల్లో మిగతా భవనాలు నిర్మించి హబ్‌గా తీర్చిదిద్దే అవకాశాలను పరిశీలించాలన్నారు. 

భవనాల కోసం విరాళాల సమీకరణ 
ఎడ్యుకేషన్‌ హబ్‌ల నిర్మాణానికి కార్పొరేట్‌ సంస్థలు, కంపెనీల సహకారం తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబులిటీ (సీఎస్‌ఆర్‌) ఫండ్‌ను సమీకరించాలని.. ముందుకొచ్చే దాతల నుంచి విరాళాలు స్వీకరించి భవన నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో అవసరమైన మౌలిక సదుపాయాలు, విద్యార్థులకు ఇచ్చే దుప్పట్లు, నోట్‌బుక్స్, యూనిఫామ్స్, పుస్తకాల కోసం కూడా సీఎస్‌ఆర్‌ ద్వారా నిధులు సమీకరించాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు. 

బడ్జెట్‌ సమావేశాలకు ఏర్పాట్లు 
వచ్చే నెల 9 లేదా 14వ తేదీ నుంచి రాష్ట్ర శాసనసభ బడ్జెట్‌ సమావేశాలను నిర్వహించే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుత ఆదాయ, వ్యయాలు, కొత్తగా అమలు చేయాల్సిన పథకాలు, అందుకు అయ్యే వ్యయం, నిధుల సమీకరణ తదితర అంశాలపై ఇప్పటికే కాంగ్రెస్‌ సర్కారు విస్తృత కసరత్తు చేపట్టింది. వివిధ శాఖల నుంచి ప్రతిపాదనలు స్వీకరిస్తోంది. త్వరలోనే తుది బడ్జెట్‌ ప్రతిపాదనలను రూపొందించనున్నారు. బడ్జెట్‌ సమావేశాలు పూర్తికాగానే ప్రభుత్వం కులగణనపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టనుంది.  

ఆడపిల్లల వివాహాలకు తులం బంగారం 
కల్యాణమస్తు, షాదీ ముబారక్‌ లబ్ధిదారులకు నగదుతోపాటు తులం బంగారం అందించడం కోసం.. అంచనా బడ్జెట్‌ను రూపొందించాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో ఇప్పుడున్న బీసీ స్టడీ సర్కిళ్లను ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గం యూనిట్‌గా ఏర్పాటు చేసే అంశంపై అధ్యయనం చేయాలని సూచించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement