సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితకు సీబీఐ శుక్రవారం రాత్రి నోటీసులు జారీ చేసింది. సీఆర్‌పీసీ 160 కింద నోటీసులు ఇచ్చి.. ఈ నెల 6వ తేదీన హైదరాబాద్‌లోగానీ, ఢిల్లీలోగానీ ఎక్కడైనా విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. తనకు సీబీఐ నుంచి నోటీసులు అందిన మాట వాస్తవమేనని కవిత చెప్పారు. హైదరాబాద్‌లోని తన నివాసంలోనే విచారణకు హాజరవుతానని సీబీఐ అధికారులకు సమాచారం ఇచ్చినట్టు వెల్లడించారు.
సౌత్ గ్రూపులో కీలకమంటూ..
రెండు రోజుల కింద ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సన్నిహితుడు అమిత్ అరోరాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. ఈ సమయంలో కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో కవిత పేరును ప్రధానంగా ప్రస్తావించారు. సౌత్ గ్రూపు నుంచి విజయ్‌నాయర్‌కు రూ.100 కోట్లు ముడుపులు అందాయని, ఎక్సైజ్ అధికారులకు రూ.కోటి లంచం ఇచ్చారని అధికారులు పేర్కొన్నారు.
ఈ సౌత్ గ్రూపును కల్వకుంట్ల కవిత, శరత్‌చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాస్‌రెడ్డి నియంత్రించారని రిమాండ్ రిపొర్టులో వెల్లడించారు. అంతేగాకుండా లిక్కర్ కుంభకోణం బయటికి వచ్చినప్పటి నుంచి సాక్ష్యాలు లభించకుండా ఉండడానికి 36 మంది నిందితులు/అనుమానితులు తమ సెల్‌ఫోన్లను ధ్వంసం చేశారని వివరించారు.
రిమాండ్ రిపోర్టు ఆధారంగా..
ఈడీ కోర్టులో దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టు ఆధారంగానే సీబీఐ అధికారులు కల్వకుంట్ల కవితకు సీఆర్‌పీసీ 160 కింద నోటీసు ఇచ్చారు. సీబీఐ డిప్యూటీ సూపరింటెండెంట్ అలోక్ కుమార్ షాహి దీనిని జారీ చేశారు. ఢిల్లీ మద్యం పాలసీలో కుట్రకోణానికి సంబంధించి జూలై 22న ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, మరో 14 మందిపై నమోదైన కేసు విచారణ సమయంలో పలు అంశాలు వెలుగులోకి వచ్చాయని అందులో పేర్కొన్నారు. ఆయా అంశాలపై దర్యాప్తులో భాగంగా విచారణకు హాజరుకావాలని కోరారు. ఢిల్లీ లేదా హైదరాబాద్‌లలో ఎక్కడ అనువుగా ఉంటే అక్కడ విచారణకు హాజరుకావాలని సూచించారు.
లోతుగా సీబీఐ, ఈడీ దర్యాప్తు
ఢిల్లీ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ఈడీ, సీబీఐ లోతుగా దర్యాప్తు చేస్తున్నాయి. ఇప్పటికే పలువురిని అరెస్టు చేశాయి. చాలా మందిని విచారించాయి. ఈ సందర్భంగా వెల్లడైన అంశాల ఆధారంగా.. కేసుతో సంబంధమున్న వ్యక్తులను గుర్తించి ప్రశ్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈడీ రిమాండ్ రిపోర్టు ఆధారంగా సాధారణ విచారణ కోసం కవితకు సీబీఐ నోటీసు ఇచ్చింది. సౌత్ గ్రూపు పేరిట రూ.వంద కోట్లు సమకూర్చిన విషయంతోపాటు ఈ కుంభకోణానికి సంబంధించి కవితకు తెలిసిన అంశాలను రాబట్టే దిశగా సీబీఐ అధికారులు విచారణ చేయనున్నారు.
నా నివాసంలోనే హాజరవుతా: కవిత
ఈ నెల ఆరో తేదీన (మంగళవారం) ఉదయం 11 గంటలకు తన నివాసంలోనే విచారణకు హాజరవుతానని సీబీఐ అధికారులకు సమాచారం అందించినట్టు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. సీబీఐ నోటీసులు అందిన తర్వాత ఆమె ఈ ప్రకటన చేశారు. సెక్షన్ 160 సీఆర్‌పీసీ కింద తన వివరణ తీసుకోవడానికి నోటీసులు ఇచ్చారని ఆమె వివరించారు.
ఏమిటీ సీఆర్‌పీసీ 160 నోటీసులు
ఏదైనా కేసు దర్యాప్తులో భాగంగా ఆ కేసుకు సంబంధించిన సమాచారం/వివరాలు తెలిసి ఉంటాయని భావించిన వ్యక్తులకు సీఆర్‌పీసీ 160 కింద అధికారులు నోటీసులు జారీ చేస్తారు. సంబంధిత వ్యక్తుల నుంచి వివరణ/సమాచారం తీసుకోవడం కోసం మాత్రమే ఈ నోటీసులు పరిమితం. వారిని నిందితులు/సాక్షులుగా పరిగణించడంగానీ, అరెస్టు చేయడం వంటివిగానీ దీనిలో ఉండబోవని న్యాయ నిపుణులు చెప్తున్నారు. సదరు వ్యక్తుల నుంచి సేకరించిన సమాచారం/వివరాల ఆధారంగా దర్యాప్తు అధికారులు తదుపరి నిర్ణయం/చర్యలు తీసుకుంటారని అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment