సాక్షి, హైదరాబాద్: దక్షిణాది రాష్ట్రాల నుంచి భారీగా పన్నుల ఆదాయం పొందుతున్న కేంద్ర ప్రభుత్వం... కేంద్రీయ విద్యాసంస్థల మంజూరులో మాత్రం దక్షిణాదికి తగిన ప్రాధాన్యత ఇవ్వట్లేదు. గత 8 ఏళ్లలో మంజూరు చేసిన 220 కేంద్రీయ విద్యాసంస్థల్లో (157 కేంద్రీయ విద్యాలయాలు, 63 జవహర్ నవోదయ విద్యాలయాలు) దక్షిణాదికి కేవలం 40 (37 కేవీలు, 3 జేవీవీలు) మాత్రమే లభించడం ఈ విషయాన్ని చెప్పకనే చెబుతోంది.
ఈ అంశంపై ఆర్‌టీఐ కార్యకర్త ఇనగంటి రవికుమార్ సమాచార హక్కు చట్టం కింద కోరిన వివరాలను కేంద్రం తాజాగా వెల్లడించింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 2,311 కేంద్రీయ విద్యాసంస్థలు (661 జవహర్ నవోదయ విద్యాలయాలు, 1,650 కేంద్రీయ విద్యాలయాలు) ఉన్నాయని తెలిపింది.
బీజేపీ పాలిత రాష్ట్రాలకు ప్రాధాన్యత...
కొత్తగా విద్యాలయాల మంజూరులో బీజేపీ పాలిత రాష్ట్రాలకే కేంద్రం ప్రాధాన్యత ఇచ్చినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కేవీల్లో అత్యధికంగా మధ్యప్రదేశ్‌కు 20 మంజూరు చేసిన కేంద్రం... ఆ తర్వాత యూపీకి 16, కర్ణాటకకు 13, ఛత్తీస్‌గఢ్‌కు 10 చొప్పున మంజూరు చేసింది. ఇక జవహర్ నవోదయ విద్యాలయాల విషయానికి వస్తే అత్యధికంగా ఛత్తీస్‌గఢ్‌కు 11, గుజరాత్‌కు 8, యూపీకి 6 చొప్పున ఇచ్చింది. దాదాపు 17 రాష్ట్రాలకు కొత్తగా జేఎన్‌వీలు మంజూరు చేయకపోవడం గమనార్హం. దక్షిణాది రాష్ట్రాల్లో కేవలం కర్ణాటకకు మాత్రమే 3 జేఎన్‌వీలు మంజూరవగా మిగతా రాష్ట్రాలకు ఒక్కటీ లభించలేదు.
జిల్లాకో జేఎన్‌వీ ఏమైంది..?
ప్రతి జిల్లాకు ఒక జవహర్ నవోదయ విద్యాలయం ఉండాలని కేంద్ర ప్రభుత్వ నిబంధన ఉంది. ఈ క్రమంలో రాష్ట్రంలో కొత్తగా 23 జిల్లాలు ఏర్పాటవగా కొత్త జిల్లాలకు జేఎన్‌వీలను మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పలుమార్లు ప్రతిపాదనలు పంపింది. రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటై ఆరేళ్లు కావస్తున్నా ఇప్పటికీ ఒక్క జేఎన్‌వీ కూడా కేంద్రం మంజూరు చేయలేదు. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రానికి రాసిన లేఖలో జేఎన్‌వీల ఏర్పాటును సైతం ప్రస్తావించారు. కానీ కేంద్రం నుంచి స్పందన రాకపోవడంతో కొత్తగా ఒక్క పాఠశాల కూడా ఏర్పాటు కాలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో 10 జేఎన్‌వీలు మాత్రమే ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment