
సాక్షి, న్యూఢిల్లీ: మునుగోడు నియోజకవర్గంలోని బ్యాంకు ఖాతాలకు రూ.5.24 కోట్ల బదిలీకి సంబంధించి వివరణ ఇవ్వాలని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం రాత్రి షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఓటర్లను ప్రభావితం చేసేందుకు నగదు బదిలీ చేయడం ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకమని.. ఆ నగదుకు సంబంధించి సోమవారం సాయంత్రం 4 గంటలలోగా పూర్తి వివరాలు అందజేయాలని ఆదేశించింది. ఉప ఎన్నిక పోలింగ్ సమీస్తున్న సమయంలో ఈసీ నిర్ణయం సంచలనంగా మారింది.
మునుగోడులోని ఖాతాలను నగదుతో..
మునుగోడు ఉప ఎన్నికలో భారీగా నగదు పంచడం ద్వారా ఓటర్లను ప్రభావితం చేసేందుకు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని టీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్‌కుమార్ ఈ నెల 29న కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కుటుంబానికి చెందిన సుషీ ఇన్‌ఫ్రా అండ్ మైనింగ్ లిమిటెడ్ కంపెనీకి చెందిన స్టేట్ బ్యాంకు ఖాతా నుంచి ఈ నెల 14, 18, 29 తేదీల్లో మునుగోడు నియోజకవర్గానికి చెందిన 23 వేర్వేరు వ్యక్తులు/కంపెనీల ఖాతాలకు రూ.5.24 కోట్లు బదిలీ అయ్యాయని.. ఆ ఖాతాలను సీజ్ చేసి, తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఆ రూ.5.24 కోట్లు పొందిన మునుగోడు వ్యాపారులు, ఇతర వ్యక్తులకు సుషీ ఇన్‌ఫ్రా అండ్ మైనింగ్ లిమిటెడ్‌తో ఎలాంటి వ్యాపార సంబంధాలు లేవని వివరించారు. దీనిపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం రాజగోపాల్‌రెడ్డికి షోకాజ్ నోటీసు జారీ చేసింది.
ఆ నగదును దేనికి బదిలీ చేశారు?
టీఆర్‌ఎస్ ఆరోపించిన విధంగా రాజగోపాల్‌రెడ్డి ద్వారాగానీ, ఆయన ఆదేశానుసారం కుటుంబ యాజమాన్యంలోని కంపెనీ ద్వారాగానీ 23 బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసిన రూ.5.24 కోట్లను ఓటర్లను ప్రభావితం చేయడానికి ఉపయోగించట్లేదని నిర్ధారించాల్సిన బాధ్యత రాజగోపాల్‌రెడ్డిపై ఉంటుందని ఎన్నికల సంఘం పేర్కొంది. ఓటర్లను ప్రభావితం చేసేందుకు నగదు బదిలీ చేయడం అవినీతి పద్ధతి అని స్పష్టం చేసింది.
ఈ ఆరోపణలపై సోమవారం సాయంత్రం 4 గంటలలోపు పూర్తి వివరణ ఇవ్వాలని రాజగోపాల్‌రెడ్డిని ఆదేశించింది. ఆయన ఇచ్చే వివరణతో సంతృప్తి చెందని పక్షంలో తగిన నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాశ్ కుమార్ నోటీసులో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment