సాక్షి, హైదరాబాద్: చిన్న పట్టణాల్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతోపాటు ఐటీ ఆధారిత సేవల పరిశ్రమను ప్రోత్సహించేందుకు కేంద్రప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయనున్న సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా(ఎస్టీపీఐ)లో రాష్ట్రానికి ఒక్కటి కూడా దక్కలేదు. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ కొత్తగా ఏర్పాటు చేయనున్న 22 ఎస్టీపీఐ పార్కులను మధ్యప్రదేశ్, పంజాబ్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, బిహార్, హరియాణా, గుజరాత్, కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాలకు కేటాయించింది. కొత్త ఎస్టీపీఐలు ఏర్పాటయ్యే రాష్ట్రాల జాబితాలో ఒడిశా మినహా మిగతావన్నీ బీజేపీ పాలిత రాష్ట్రాలే కావడం గమనార్హం.
చిన్న పట్టణాలకు ఐటీ పరిశ్రమను విస్తరించడం ద్వారా కొత్త ఉద్యోగాలను కల్పించడం ఎస్టీపీఐల లక్ష్యం. అయితే కొన్ని రాష్ట్రాలకే ఎస్టీపీఐలను కేటాయించడంపై విమర్శలు వస్తున్నాయి. దేశంలోని 62 ఎస్టీపీఐలను పది రీజియన్లుగా విభజించగా, హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఎస్టీపీఐ పరిధిలో కాకినాడ, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్ సబ్‌సెంటర్లు ఉన్నా యి. తెలంగాణ పరంగా చూస్తే హైదరాబాద్‌లో ప్రధాన ఎస్టీపీఐతోపాటు వరంగల్‌లో ఎస్టీపీఐ సబ్‌సెంటర్ పనిచేస్తోంది. దేశంలోని ఇతర ఎస్టీపీఐలతో పోలిస్తే హైదరాబాద్ ఎస్టీపీఐ, దాని పరిధి లోని సబ్ సెంటర్ల ద్వారా ఐటీ, ఐటీ ఆధారిత సేవ లు, ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ డిజైన్, మాన్యుఫాక్చరింగ్(ఈఎస్‌డీఎం) ఎగుమతుల విలువ ఏటా గణనీ యంగా పెరుగుతోంది. 1992–93లో హైదరాబాద్ ఎస్టీపీఐ ద్వారా రూ.4.76 కోట్ల ఐటీ, ఐటీ ఆధారిత సేవల ఉత్పత్తులు ఎగుమతి కాగా, 2020–21 నాటికి రూ.72,457 కోట్లకు చేరడం గమనార్హం.
రాష్ట్రంలో చిన్న నగరాలకు చోటేదీ?
ఐటీ రంగంలో దేశంలోనే రాష్ట్రం అగ్రస్థానానికి చేరేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో రాష్ట్ర ప్రభు త్వం హైదరాబాద్‌లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్ మెంట్ రీజియన్(ఐటీఐఆర్)ను ఏర్పాటు చేయా లని చాలాకాలంగా కోరుతోంది. మరోవైపు జిల్లా కేంద్రాల్లో రాష్ట్ర ప్రభుత్వం సొంత ఖర్చుతో ఐటీ హబ్‌లను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే వరంగల్, కరీంనగర్, ఖమ్మంలలో ఐటీ హబ్‌లలో ఐటీ కంపెనీల కార్యకలాపాలు ప్రారంభం కాగా, నిజామాబాద్, మహబూబ్‌నగర్, సిద్దిపేటలో ఐటీ హబ్‌ల నిర్మాణం కొనసాగుతోంది. వీటితోపాటు రామగుండం, నల్లగొండ, వనపర్తిలోనూ ఐటీ హబ్‌లు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు జారీచేసింది.
డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్‌లో భాగంగా ఎస్టీపీఐల కోసం కేంద్రం ఇండియా బీపీవో ప్రమోషన్ స్కీమ్‌ను ప్రారంభించింది. ఇందులో భాగంగా బీపీవో లేదా ఐటీ ఆధారిత కార్యకలాపాలు ప్రారంభించే సంస్థలకు కేంద్రం నుంచి ఒక్కో సీటుకు లక్ష రూపాయల చొప్పున ఆర్థికసాయం అందుతుంది. ‘ఎస్‌టీపీఐల ఏర్పాటు ద్వారా మరిన్ని ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకు ఐటీ రంగాన్ని విస్తరించే అవకాశమున్నా రాష్ట్రంలో ఏ ఒక్క పట్టణాన్ని కూడా కేంద్రం పరిగణనలోకి తీసుకోలేదు. చిన్న నగరాలు, పట్టణాలకు ఐటీ రంగాన్ని విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు కేంద్రం నుంచి సహకారం అందించాల్సిన అవసరం ఉంది’అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ‘సాక్షి’కి వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment