కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ)లో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మూలవేతనంపై 25శాతం అధికంగా చెల్లిస్తుండడంపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణమే అధిక వేతనం చెల్లింపులను నిలుపుదల చేయాలని, ఇప్పటిదాకా అదనంగా చెల్లించిన వేతనాలను తిరిగి వసూలు చేయాలని కృష్ణా బోర్డును ఆదేశించింది. లేకుంటే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
అవి కేంద్ర పాలన పరిధిలోనే..
తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖలోని అంతర్రాష్ట విభాగం ఇంజనీర్లకు మూలవేతనంపై 25శాతం అధికంగా చెల్లిస్తుండగా, సమానంగా తమ ఉద్యోగులకు సైతం 25శాతం మూలవేతనాన్ని అధికంగా చెల్లించాలని 2020 అక్టోబర్ 20న కృష్ణా బోర్డు తీర్మానం చేసింది. దాదాపు రెండేళ్ల నుంచి అధిక వేతనాలు చెల్లిస్తూ వస్తోంది. గోదావరి బోర్డు సైతం తమ ఉద్యోగులకు ఇదే తరహాలో అధిక వేతనాలను చెల్లిస్తామని కేంద్ర జలశక్తి శాఖకు ప్రతిపాదనలు పంపగా, ఈ విషయం కేంద్రం దృష్టికి వచ్చింది.
అధిక వేతనాలను నిలిపేయాలని 2021 జూలైలో కృష్ణా బోర్డుకు కేంద్ర జలశక్తి శాఖ ఆదేశించింది. స్వయంప్రతిపత్తి కలిగి ఉన్న నేపథ్యంలో కేంద్రం ఆదేశాలను అమలు చేయాల్సిన అవసరం లేదని కృష్ణా బోర్డు కేంద్రానికి తెలియజేసింది. ఈ నేపథ్యంలో ఏపీ పునర‍్విభజన చట్టంలోని సెక్షన్ 85(3)ను ప్రయోగిస్తూ తక్షణమే అధిక వేతనాల చెల్లింపులను నిలుపుదల చేయాలని తాజాగా కేంద్ర జలశక్తి శాఖ కృష్ణా బోర్డును ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment