నిర్మల్: ఆయనో చార్టెడ్ అకౌంటెంట్. పక్షంరోజులు పనులన్నీ పక్కనపెట్టి, ఏకంగా ప్రపంచంలోనే ఎత్తయిన ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కడానికి వెళ్లారు. తొలిసారే అవకాశం లేదనడంతో వెనక్కి తగ్గేది లేదంటూ.. ఎవరెస్ట్ బేస్‌క్యాంప్ వరకూ వెళ్లారు. ఆయన హిమాలయాలకు వెళ్లడానికి, అంత ఎత్తు ఎక్కడానికి కారణం తొమ్మిదో తరగతిలో ఆయన విన్న తెలుగుపాఠం కారణం. ఎవరా సీఏ, ఏమా తెలుగుపాఠం.. వివరాలివిగో!
నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన ముక్క సాయిప్రసాద్ చార్టెడ్ అకౌంటెంట్. ఆయన కరీంనగర్‌లోని పారామిత హైసూ్కల్‌లో చదువుకున్నారు. తెలుగుసార్ సన్యాసిరావు తొమ్మిదో తరగతి పాఠంలో భాగంగా ‘అటజని కాంచె భూమిసురుడు..’ అనే పద్యాన్ని చెబుతూ హిమాలయాలను అందంగా వర్ణించారు. అది సాయిప్రసాద్ మనసులో బలంగా నాటుకుపోయింది. ఎప్పటికైనా హిమాలయాలకు వెళ్లాలని, ఆ అందాలను చూడాలని అప్పుడే ఫిక్స్ అయ్యారు. తరువాత ఉన్నత చదువులు, కెరీర్‌లో పడిపోయినా.. ఇరవైఏళ్ల కిందట విన్న పాఠం, హిమాలయాలకు వెళ్లాలన్న ఆలోచన ఆయన మదిలో మెదులుతూనే ఉంది.
మొదటిసారి కావడంతో..
అయితే.. గతనెల 28న నేపాల్ రాజధాని ఖాట్మాండు వెళ్లిన ఆయన అక్కడి నుంచి హిమాలయాలకు చేరుకున్నారు. మొత్తం ఎవరెస్ట్ శిఖరం ఎత్తు 8,849 మీటర్లు కాగా, బేస్ క్యాంప్ 5,364 మీటర్లు ఉంటుంది. తొలిసారి ఎవరెస్ట్ ఎక్కాలనుకునేవారిని ఈ బేస్ వరకే అనుమతిస్తారు.
సాయిప్రసాద్‌ను సైతం బేస్ వరకే అనుమతించారు. ఏడురోజుల పాటు ఎక్కుతూ ఈనెల 6న ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కు చేరుకున్నారు. తన కుటుంబం, మిత్రుల సహకారంతో ఇక్కడి వరకూ వచ్చానని సాయిప్రసాద్ చెప్పారు. తనతో పాటు ఆయన మిత్రుడు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌కు చెందిన నార్లాపురం గిరిధర్‌ను కూడా ఒప్పించి వెంట తీసుకెళ్లారు.
హిమాలయాలు అద్భుతం..
హిమాలయాల గురించి వింటుంటాం. కనులారా చూస్తేనే వాటి అందం తెలుస్తుంది. నాకు ట్రెక్కింగ్ అనుభవం లేదు. కానీ ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యత ఇస్తాను. అదే నేను ఎవరెస్ట్ బేస్‌క్యాంప్ వరకు చేరడానికి ఉపయోగపడింది. అక్కడికి వెళ్లి హిమాలయాలను చూడటం మర్చిపోలేని ఫీలింగ్. మరోసారి ఎవరెస్ట్ మొత్తం ఎక్కడానికి ప్రయత్నిస్తా. – ముక్క సాయిప్రసాద్, సీఏ, నిర్మల్
Comments
Please login to add a commentAdd a comment