సాక్షి, హైదరాబాద్: ప్రజాభవన్ వద్ద ర్యాష్ డ్రైవింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈకేసులో పంజాగుట్ట సీఐ దుర్గారావు సస్పెండ్ అయ్యారు. మాజీ ఎమ్మెల్యే కుమారుడి కేసులో నిర్లక్ష్యం వహించినందుకు దుర్గారావును ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. కాగా, ర్యాష్ డ్రైవింగ్ చేసి వ్యక్తులన బోధన్ మాజీ ఎమ్మెల్యే కుమారుడు సొహైల్ మార్చేసిన విషయం తెలిసిందే.
వివరాల ప్రకారం.. ప్రజాభవన్ వద్ద ర్యాష్ డ్రైవింగ్ కేసును పోలీసు ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకుని దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ క్రమంలో సీసీ ఫుటేజ్ ఆధారంగా ర్యాష్ డ్రైవింగ్ చేసింది బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సోహైల్ అని నిర్ధారించారు. ప్రధాన నిందితుడిగా సోహైల్‌ను చేర్చటమే కాకుండా.. అతనిపై 17 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ప్రజాభవన్ యాక్సిడెంట్ కేసు దర్యాప్తులో పోలీసుల నిర్వాకం బయటపడింది. ప్రమాదం తర్వాత సోహైల్‌ను పోలీసులు అరెస్ట్ చేసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సోహైల్‌ను అదుపులోకి తీసుకోవడంతో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అనుచరులు పీఎస్‌కు వచ్చారు. షకీల్ కొడుకును విడిపించుకుపోయారు. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. దీంతో, నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గానూ.. పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్ దుర్గరావును సస్పెండ్ చేశారు.
Panjagutta Inspector B. Durga Rao suspended for negligence in former MLA Shakeel's son Sohail case. #Telangana pic.twitter.com/qvq11aSRNC
— Mubashir.Khurram (@infomubashir) December 26, 2023
ఘటన జరిగిన రోజున (డిసెంబర్ 24న) నైట్ డ్యూటీలో సీఐ దుర్గారావుతో పాటు విధుల్లో ఉన్న సిబ్బంది.. సోహైల్‌ను తప్పించి వేరే వ్యక్తి పేరును చేర్చారంటూ.. పెద్ద ఎత్తున ఆరోపణలు రావటంతో.. అధికారులు వారిపై విచారణ చేపట్టారు. వెస్ట్ జోన్ డీసీపీ పూర్తి స్థాయిలో విచారిస్తున్న క్రమంలో దుర్గారావు అస్వస్థతకు గురయ్యారు. బీపీ డౌన్ కావటంతో.. దుర్గారావు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ కేసులో దుర్గారావు వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపిన అధికారులు ఆయనను సస్పెండ్ చేశారు.
ఇదిలా ఉండగా.. ఈ ప్రమాదం వ్యవహారంపై రాజకీయపరంగా తీవ్ర స్థాయిలో ఆరోపణలు రావటంతో.. సమగ్ర దర్యాప్తు జరిపి తనకు నివేదిక ఇవ్వాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ఆదేశించడంతో.. పోలీసుల నిర్వాకం బయటపడింది. ఇక, పరారీలో ఉన్న సొహైల్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment