సాక్షి, నాగర్‌కర్నూల్: శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో సంభవించిన భారీ అగ్నిప్రమాదంపై సీఐడీ విచారణ కొనసాగుతోంది. సీఐడీ చీఫ్ గోవింద్ సింగ్, డీఐజీ సుమతి నేతృత్వంలో సోమవారం విచారణ జరుగుతోంది. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందా? ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అన్న కోణంలో సీఐడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద స్థలంలో చీకటి, వేడి ఎక్కువగా ఉండడంతో పూర్తి అండర్ గ్రౌండ్‌కు దర్యాప్తు బృందం వెళ్లలేకపోయింది. కొన్ని చోట్ల కాలిన పదార్థాల నుండి సీఐడీ బృందం షాంపిల్స్ సేకరించారు. మానవ తప్పిదమా? లేదా సాంకేతిక లోపమా? అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. (శ్రీశైలం ప్రమాదం: మృతుల చివరి సంభాషణ)
ఇప్పటికే అధికారుల నుంచి స్టేట్‌మెంట్‌లను రికార్డ్ చేసిన విషయం తెలిసిందే. మరికొన్ని సాక్ష్యాల కోసం సీఐడీ అధికారులు నేడు విచారణ చేట్టారు. అదే విధంగా పవర్ హౌస్‌లోకి భారీగా నీరు చేరడంతో చేస్తున్న మరమ్మతుల వల్ల దర్యాప్తుకు కొంత ఆటంకం ఏర్పడింది. పవర్ హౌస్‌లోకి విద్యుత్ సరఫరా లేకపోవడంతో సిబ్బంది బయటి నుంచి లోపలికి విద్యుత్ వైర్లను తీసుకెళ్లారు. ఊట నీరును మోటార్ల ద్వారా ఎత్తిపోస్తున్నారు. మళ్లీ విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించాలంటే మరింత సమయం పట్టే అవకాశం ఉందని విద్యుత్ అధికారులు పేర్కొన్నారు. (శ్రీశైలం పవర్ హౌస్ ప్రమాదంపై మరో కమిటీ)
Comments
Please login to add a commentAdd a comment