
జవహర్‌నగర్: హైదరాబాద్ నగర శివారులోని జవహర్‌నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎస్)కు చెందిన ఓ మాజీ కానిస్టేబుల్ ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సీఐ చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం .. నిజామాబాద్ జిల్లా దోమకొండ మండలం బీబీపేట్ గ్రామానికి చెందిన కుమ్మరి రవీందర్ (30)కు భార్య శిరీష, మూడేళ్ల కుమారుడు ఉన్నాడు.
2017లో సీఐఎస్‌ఎఫ్‌లో చేరిన రవీందర్‌ను కొన్ని కారణాలతో 2020లో తొలగించారు. అయితే ఈ విషయాన్ని ఇంట్లో చెప్పని రవీందర్ రెండేళ్లుగా నిత్యం యూనిఫాం ధరించి హకీంపేట పరిధిలోని సింగాయపల్లిలో ఉంటున్న ఇంటి నుంచి బయటకు వెళ్లి వస్తున్నాడు. మంగళవారం సైతం భార్యకు ఇలాగే చెప్పి వెళ్లిన రవీందర్ కౌకూర్ సమీపంలోని అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అడవికి వెళ్లిన గొర్లకాపరులు ఈ విషయాన్ని జవహర్‌నగర్ పోలీసులకు చెప్పడంతో వారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు.