గవర్నర్‌ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న భట్టి. చిత్రంలో మహేశ్‌కుమార్ గౌడ్, పొన్నాల, శ్రీధర్‌బాబు, అంజన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా తీవ్ర స్థాయిలో ఆస్తి, పంట నష్టపోయిన వారిని వెంటనే ఆదుకోవాలని, ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తక్షణమే నష్టపరిహారం ఇవ్వాలని సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్క కోరారు. మంగళవారం కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు అంజన్ కుమార్ యాదవ్, మహేష్ కుమార్ గౌడ్, సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవితో కలిసి భట్టి రాజ్‌భవన్‌కి వెళ్లి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా జరిగిన నష్టం వివరాలను అందజేశారు.
అనంతరం భట్టి మీడియాతో మాట్లాడుతూ భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అప్రమత్తం చేసినప్పటికీ , రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగాన్ని సమాయత్తం చేయకుండా నిర్లిప్తంగా వ్యవహరించడం వల్లనే ఇంత నష్టం జరిగిందన్నారు. కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టుల నిర్మాణం అశాస్త్రీయంగా జరగడం వల్లనే అనేక ప్రాంతాలు, గిరిజన గూడేలు ముంపునకు గురయ్యాయన్నారు. మున్నేరు, కిన్నెరసాని నదులపై నిర్మించిన చెక్ డ్యాములను ఇంజనీరింగ్ అధికారులతో శాస్త్రీయంగా డిజైన్ చేసి ఉంటే ఇంత నష్టం జరిగేది కాదన్నారు.
మహారాష్ట్రకు విమానాలు పంపించారు కానీ ఇక్కడ వరద ప్రాంతాలకుహెలికాప్టర్లు పంపించలేదు
ప్రజల అవసరాల కోసం కాకుండా కేసీఆర్ తన రాజకీయ అవసరాల కోసం అధికార యంత్రాంగాన్ని వాడుకున్నారని భట్టి ఆరోపించారు. మహారాష్ట్రకు ప్రత్యేక విమానాలు పంపించి అక్కడి నాయకులను ప్రగతిభవన్‌కు పిలిపించుకొని గులాబీ కండువాలు కప్పే దానిపై ఉన్న శ్రద్ధ వరద బాధితులను ఆదుకోవడంలో లేకుండా పోయందని విమర్శించారు. మహారాష్ట్రకు విమానాలు పంపించిన సీఎం కేసీఆర్ గోదావరి వరదలతో మునిగిపోయిన ఏజెన్సీ ఏరియాలో గిరిజన ప్రజలను ఆదుకోవడానికి హెలికాప్టర్లు పంపించ లేకపోయారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో వరదలతో ప్రజలు అల్లాడుతుంటే బాధితులను, ఏజెన్సీ ప్రాంతాలను సందర్శించకుండా కేసీఆర్ మహారాష్ట్ర టూర్ కి వెళ్లడం ఏంటని ప్రశ్నించారు.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం కాంగ్రెస్ విజయమే
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని గతంలో తాము కోరినప్పుడు సీఎం కేసీఆర్ వ్యక్తిగతంగా దుర్భాషలాడుతూ నీతిమాలిన, పనికిమాలిన, ఆలోచన లేని నాయకులంటూ తప్పు పట్టారని భట్టి విక్రమార్క గుర్తుచేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి అధికారంలోకి రాగానే ఆరీ్టసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ప్రకటించిందని, ఆ భయంతోనే కేసీఆర్ విలీన నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ఆర్టీసీకి ఆస్తులు కూడబెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, కాంగ్రెస్ సంపాదించి పెట్టిన ఆర్టీసీ ఆస్తులను బీఆర్‌ఎస్ ప్రభుత్వం కొల్లగొట్టడానికి చూస్తే రోడ్లపైకి వస్తామని భట్టి హెచ్చరించారు.
వరద సహాయం సరిపోదు: గవర్నర్ తమిళిసై
- ఊహించిన దానికంటే పరిస్థితులు దయనీయంగా ఉన్నాయి
- పునరావాస కేంద్రాలను పెంచాలి
- ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు, దాతలు ముందుకు రావాలి
కుంభవృష్టిగా కురిసిన వర్షాలతో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాల పట్ల రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఊహించిన దానికంటే పరిస్థితులు అత్యంత దయనీయంగా ఉన్నాయని, ఈ క్లిష్ట సమయంలో బాధిత కుటుంబాలకు అందిస్తున్న సహాయం సరిపోదని తాను భావిస్తున్నానని స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. పాఠశాలలు, ప్రభుత్వ భవనాల్లో ప్రభుత్వం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసిందని, వరదల విధ్వంసం కొనసాగుతున్న నేపథ్యంలో వీటి సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందన్నారు.
వరదలతో తీవ్రంగా నష్టపోయిన ఉత్తర తెలంగాణలోని 10 జిల్లాలతో పాటు మధ్య తెలంగాణకు పరీక్షా సమయమని, ఇక్కడ తీవ్రంగా నష్టపోయిన కుటుంబాలకు సాధ్యమైనంతగా సహకారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి, స్వచ్ఛంద సంస్థలకు పిలుపునిచ్చారు. వరద బాధిత కుటుంబాలకు తక్షణమే సహాయం అందించాలని ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర, కేంద్ర, జిల్లా కార్యాలయాలకు పిలుపునిచ్చారు. జిల్లా యంత్రాంగంతో కలిసి వరద బాధితులకు ఇప్పటికే రెడ్‌క్రాస్ సహాయం అందిస్తోందన్నారు.
వరద బాధిత కుటుంబాలకు తక్షణమే ఆహారం, ఆశ్రయం, వంట సామాగ్రి, ఆరోగ్య శిబిరాలు నిర్వహించేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని, వరద నష్టాన్ని వేగంగా అంచనా వేయాలని సూచించారు. దాతలు, స్వచ్ఛంద సంస్థలు, లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్, యూఎన్డీపీ, యూనిసెఫ్, సీఎస్‌ఆర్ ఫౌండేషన్లు, వైద్యులు, మీడియా భాగస్వామ్యంతో కింది సేవలు అందించాలని పిలుపునిచ్చారు. తక్షణ ఉపశమనంగా షెల్టర్ హోమ్స్, ఆహారం, తాగునీటి సరఫరా, అత్యవసర వైద్య బృందాల ను పంపించాలి. శిథిలాల తొలగింపు చేపట్టాలి. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించడానికి ఎన్డీ ఆర్‌ఎఫ్ బృందాలు చర్యలు తీసుకోవాలి. చిన్నారులు, బాలికలు, మహిళల రక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ప్రాణ, ఆస్తి, ఉపాధికి జరిగిన నష్టాన్ని కచ్చితంగా మదించి పునరావాసం కల్పించాలి.
బిల్లులు తిప్పి పంపడానికి కారణాలున్నాయి..
ప్రభుత్వానికి మూడు బిల్లులు వెనక్కి పంపించడానికి కారణాలున్నాయని గవర్నర్ తమిళిసై వ్యాఖ్యానించారు. గవర్నర్ తిప్పి పంపిన బిల్లు లను అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదించి మళ్లీ గవర్నర్‌కు పంపిస్తామని, అప్పుడు ఆమోదించక తప్పదంటూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్య లపై ఆమె మీడియాతో మాట్లాడుతూ స్పందించారు. ‘నేను పంపించిన మూడు బిల్లులు ఎందుకు పంపించానో వివరంగా పేర్కొన్నాను. అందుకు సహేతుక కారణాలున్నాయి. ప్రతి బిల్లుపై నాకున్న అనుమానాలను నివృత్తి చేయాలని కోరా. కావాలని ఏ బిల్లునూ కారణం లేకుండా తిప్పి పంపలేదు. బిల్లులు ఆపేశానని అనవసరంగా నిందించడం సరి కాదు’ అని గవర్నర్ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment