యాదగిరిగుట్ట (ఆలేరు) : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నార్మాణంలో భాగంగా క్యూలైన్ల ఏర్పాటుపై స్పష్టత వచ్చింది. ఈ నెల 13వ తేదీన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పనులను పరిశీలించేందుకు వచ్చిన సీఎం కేసీఆర్ క్యూలైన్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. అంతే కాకుండా వాటిలో పలు మార్పులు చేశారు. ఈ క్యూలైన్లకు సంబంధించిన ఏర్పాట్లను వైటీడీఏ అధికారులు త్వరలోనే ప్రారంభించే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. ఆర్కెటెక్టు ఆనంద్ సాయి పర్యవేక్షణలో నూతన క్యూలైన్ల డిజైన్లు రూపుదిద్దుకుంటున్నాయి.
డిజైన్లకు ఓకే చెప్పిన సీఎం కేసీఆర్
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ప్రధాన ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా ఏర్పాటు చేసే క్యూలైన్లకు సంబంధించిన పలు డిజైన్లను సీఎం కేసీఆర్ ఫైనల్ చేశారు. ఇటీవల ఆలయానికి వచ్చిన సీఎం కేసీఆర్‌కు ప్రధాన ఆలయంలో క్యూలైన్లకు సంబంధించిన పవర్ ప్రజంటేషన్ ఆర్కెటెక్టు ఆనంద్‌సాయి ఇచ్చారు. క్యూలైన్ అద్భుతంగా ఉండటంతో సీఎం కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేసి, వాటిని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా.. ఆలయానికి వచ్చే భక్తులు క్యూలైన్లలో వెళ్లేటప్పుడు ఆకర్షణీయంగా, అద్భుతంగా ఉండేందుకు వైటీడీఏ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అంతే కాకుండా భక్తుల రద్దీ ఉన్న రోజుల్లో క్యూలైన్లను పెంచే విధంగా, భక్తులు లేని రోజుల్లో క్యూలైన్లను ఒకే దగ్గరికి చేర్చే విధంగా క్యూలైన్లను ఏర్పాటు చేయనున్నారు. క్యూలైన్లు ఏ మార్గంలో వస్తుందనే అంశాలపై గతంలోనే లక్నోకు చెందిన అనుభవం ఉన్న టెక్నీషియన్స్ యాదాద్రి ప్రధాన ఆలయం వద్దకు వచ్చి పరిశీలించారు.
క్యూలైన్లలో పలు మార్పులు
ఆలయంలోకి భక్తులు శ్రీస్వామి దర్శనానికి వెళ్లే సమయంలో ఏర్పాటు చేసే క్యూలైన్లపై అధికారులకు సీఎం కేసీఆర్ పలు సూచనలు, సలహాలు, మార్పులు, చేర్పులు చేశారు. నూతనంగా నిర్మాణం అయ్యే ప్రసాదం కౌంటర్ నుంచి బ్రహ్మోత్సవ మండపం వెనుక నుంచి అష్టభుజి ప్రాకార మండలంలో నుంచి తూర్పు రాజగోపురం కింది నుంచి ఒక లైన్, బ్రహ్మోత్సవ మండపం నుంచి అష్టభుజి ప్రాకార మంపం నుంచి దక్షిణ రాజగోపురం కింది నుంచి ప్రధాన ఆలయంలోకి వెళ్లే విధంగా క్యూలైన్లు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ సూచించినట్లు తెలిసింది.అంతే కాకుండా దర్శనం అనంతరం భక్తులు నేరుగా పడమటి రాజగోపురం నుంచి బయటకు వెళ్లకుండా ఆలయ నిర్మాణాలు, ఆధ్మాత్మిక కట్టడాలు చేసేందుకు వీలుగా క్యూలైన్లు ఉండాలని సూచనలు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
ఆలయంలో రెండు వరుసల లైన్లు
స్వామిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు ఇబ్బందులు తలెత్తకుండా క్యూలైన్లలను అద్భుతంగా ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే వైటీడీఏ అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగానే ప్రసాదం కాంప్లెక్స్ నుంచి తూర్పు రాజగోపురం వరకు 16 ఫీట్ల వెడల్పుతో క్యూలైన్ ఏర్పాటు చేయనున్నారు. ఈ క్యూలైన్ తూర్పు రాజగోపురం వరకు ముగియగానే అక్కడి నుంచి భక్తులు ఆలయంలోకి వెళ్లేందుకు ఆకర్షణీయమైన క్యూలైన్లు రానున్నాయి. ఇక ఆలయంలోకి వెళ్లినాక 10ఫీట్లతో క్యూలైన్లు ఏర్పాటు కానున్నాయి. ఈ పది ఫీట్ల వైడల్పుతో వచ్చే లైన్‌లో రెండు లేదా మూడు క్యూలైన్లు రానున్నట్లు తెలిసింది. ఒక క్యూలైన్ మార్గంలో భక్తులు దర్శనానికి వచ్చేది. మరొకటి దర్శనం అనంతరం భక్తులు వెళ్లడానికి, మూడవ క్యూలైన్ ఆలయంలోకి ఆచార్యులు వచ్చేందుకు వీలుగా ఏర్పాటు చేయనున్నారు. ఈ మూడు వరుసల క్యూలైన్ ఏర్పాటు చేయడంతో భక్తులతో పాటు ఆచార్యులకు ఇబ్బందులు తలెత్తకుండా చూసే విధంగా వైటీడీఏ అధికారులు ఆలోచిస్తున్నారు.
బంగారు వర్ణంలో..
ఇప్పటికే ఆలయాన్ని అంతా బంగారు వర్ణంలో తీర్చి దిద్దేందుకు వైటీడీఏ అధికారులు కృషి చేస్తున్నారు. విద్యుత్ దీపాల అలంకరణ, ఆలయంలోని ప్రధాన గర్భాల ద్వారాలు, విమాన రాజగోపురం వంటివి బంగారు రంగులో మెరిసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే క్యూలైన్లను సైతం బంగారు రంగులోనే ఉండే విధంగా చేస్తున్నారు. విశాలమైన క్యూలైన్లు, మధ్యల మధ్యలో భక్తులు కూర్చోవడానికి బెంచీలు, అక్కడక్కడ ఆధ్మాతిక చిత్రాలు ఉండే విధంగా క్యూలైన్ ఏర్పాటు చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment