కవితను అరెస్టు చేస్తరా.. చేయనీయండి..
బీజేపీ ప్రభుత్వం కక్షసాధింపు ధోరణి అవలంబిస్తోందని కేసీఆర్ పేర్కొన్నట్టు తెలిసింది. ‘‘తెలంగాణ ప్రగతిని బీజేపీ ఓర్వడం లేదు. ఈ అక్కసుతో కుట్రలకు పాల్పడుతోంది. టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులను వేధిస్తోంది. మంత్రి గంగుల కమలాకర్, మల్లారెడ్డి, ఎంపీ రవిచంద్రలతోపాటు మరికొందరిపై సీబీఐ, ఐటీ, ఈడీ తప్పుడు ఆరోపణలతో దాడులు చేశాయి. ఇప్పుడు ఎమ్మెల్సీ కవితకు నోటీసులు ఇచ్చారు. కవితను మహా అయితే ఏం చేస్తారు? అరెస్టు చేస్తరా, జైలుకు పంపుతరా.. అంతేకదా! ఎన్ని అరెస్టులు చేసినా, ఎంత వేధించినా భయపడేది లేదు. ఏం చేస్తారో చేసుకోనివ్వండి. ప్రజలే అంతిమ నిర్ణేతలు. కేంద్రంలో దుర్మార్గపు ప్రభుత్వం ఉంది. బీజేపీలో చేరని వారిని కేసులతో వేధిస్తున్నారు. కవితను కూడా బీజేపీలో చేరాలని అడిగారు. ఏం చేసినా కేంద్రంపై రాజకీయ పోరాటం ఆపేది లేదు. ’’ అని సీఎం కేసీఆర్ స్పష్టం చేసినట్టు సమాచారం
దళితబంధు, గృహలక్ష్మిలో చేతివాటాన్ని సహించబోం
అణగారిన దళిత వర్గాలను ఉన్నత స్థితికి తెచ్చేందుకు పెట్టిన పథకం దళితబంధు. ఒక దళిత కుటుంబం బాగుపడటానికి రూ.10 లక్షలను ప్రభుత్వం అందజేస్తుంది. కానీ దళితబంధు లబ్ధిదారుల నుంచి కొందరు ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు లంచాలు తీసుకుంటున్నట్టు నా దృష్టికి వచ్చింది. వరంగల్‌లో ఓ ఎమ్మెల్యే, ఆదిలాబాద్‌లో మరో ఎమ్మెల్యే డబ్బులు తీసుకున్న వ్యవహారంపై నా దగ్గర సమాచారం ఉంది. ప్రభుత్వం, పార్టీ తరఫున సాయం అందించాలే తప్ప.. లబ్ధిదారుల నుంచి లంచాలు తీసుకోవడమేంటి? దళితబంధు, గృహలక్ష్మి వంటి పథకాల్లో అక్రమాలకు పాల్పడితే సహించే ప్రసక్తి లేదు.
– సీఎం కేసీఆర్ హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు వస్తాయని జరుగుతున్న ప్రచారానికి బీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెరదించారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే ప్రసక్తే లేదని, షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు, నేతలు నియోజకవర్గాల్లో ప్రజల మధ్యే ఉండాలని.. పనులన్నీ పూర్తి చేసుకోవాలని ఆదేశించారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది.
మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గంతోపాటు కార్పొరేషన్ల చైర్మన్లు, మేయర్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్యక్షులు ఈ భేటీలో పాల్గొన్నారు. ఇటీవల మరణించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్నకు నివాళి అర్పించిన తర్వాత సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీ కక్ష సాధింపు, సిట్టింగ్‌లకు సీట్లు, దళితబంధులో చేతివాటం, సంక్షేమ పథకాల అమలు, వాటి ప్రచారం తదితర అంశాలపై ప్రసంగించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. కేసీఆర్ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే..
బీఆర్‌ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్. చిత్రంలో మధుసూదనాచారి, మల్లారెడ్డి, నిరంజన్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, పువ్వాడ, తలసాని, హరీశ్‌రావు, మహమూద్‌అలీ, తోట చంద్రశేఖర్, శ్రీనివాస్‌గౌడ్, కేటీఆర్, జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ప్రశాంత్‌రెడ్డి
‘‘రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో మంచి పనులు చేస్తోంది. వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. మీ నియోజకవర్గాల్లో జరిగిన పనులను జనానికి చెప్పాలి. ఎమ్మెల్యేలు వీలైనంత వరకు ప్రజల్లోనే ఉండాలి. అందుకోసం పాదయాత్రలు చేయాలి. వేరే పార్టీలు చేస్తున్న విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టాలి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కక్షపూరిత వైఖరిని జనం ముందు పెట్టాలి. సెప్టెంబర్ తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ రావచ్చు. సిట్టింగ్‌లందరికీ టికెట్లు ఇస్తాం. ఎమ్మెల్యేలు ప్రజలతో, కార్యకర్తలతో మమేకమై పనిచేయాలి.
కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనాలు
బీఆర్‌ఎస్ పార్టీకి కార్యకర్తలే బలం. వారితో ఆత్మీ య సమ్మేళనాలు నిర్వహించాలి. ఇందుకు ఎమ్మెల్యే లు బాధ్యత తీసుకోవాలి. ప్రతి పది గ్రామాలను ఒక యూనిట్‌గా తీసుకొని ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహించాలి. వీటికి స్థానిక ఎంపీ, ఎమ్మెల్సీ, కా ర్పొరేషన్ చైర్మన్లను, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు తదితర పార్టీ ముఖ్యులను కలుపుకొని పోవాలి. ఆత్మీయ సమ్మేళనాలను 2 నెలల్లోపు పూర్తి చేయాలి.
బీఆర్‌ఎస్వీని బలోపేతం చేయాలి
బీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం (బీఆర్‌ఎస్వీ)ను మరింత బలోపేతం చేయాలి. రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయి కమిటీలను ఏర్పాటు చేసి సంఘం బలోపేతానికి చ ర్యలు చేపట్టాలి. ఇంకా మిగిలిన పార్టీ జిల్లా కార్యా లయాల ప్రారంభోత్సవాలను పూర్తి చేయాలి.
ఏప్రిల్‌లో ప్రతినిధుల సభ.. అక్టోబర్‌లో ఆవిర్భావ సభ
పార్టీ ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో.. ఏప్రిల్ 25న గ్రామాల్లో పార్టీ జెండాలు ఆవిష్కరించాలి. తర్వాత నియోజకవర్గ కేంద్రాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజాప్రతినిధుల సభ నిర్వహించాలి. ఏప్రిల్ 27న ఎల్బీ స్టేడియంలో రాష్ట్రస్థాయి ప్రతినిధుల సభ నిర్వహిస్తాం. సభలో పార్టీకి సంబంధించిన అన్ని కేటగిరీల ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవ బహిరంగ సభను అక్టోబర్‌లో వరంగల్‌లో నిర్వహిస్తాం.
తలసరి ఆదాయంలో దేశంలోనే ముందు..
ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా పోరాడి సాధించుకున్న తెలంగాణలో తలెత్తి నిలబడ్డాం. తలసరి ఆదాయంలో దేశంలోనే ముందు వరుసలో తెలంగాణ దూసుకుపోతోంది. రాష్ట్రం సాధించిన పురోగతిని చూసిన ప్రజలు తర్వాత జరిగిన ప్రతీ ఎన్నికలో మనకు అండగా నిలబడ్డారు. విద్యుత్ కోతలు లేకుండా చేసుకున్నాం. సాగునీటి రంగాన్ని తీర్చిదిద్దుకున్నాం. ఇవాళ ప్రతీ ఇంటికి నల్లాల ద్వారా తాగునీరు అందుతున్నది.
సంక్షేమ, అభివృద్ధి రంగాల్లో దేశంలోనే నంబర్ వన్ స్థాయికి చేరాం. విదేశాల నుంచి రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ కొనసాగుతోంది. మన పారిశ్రామిక విధానాలను ప్రపంచం మెచ్చుకుంటోంది. మొన్న రాష్ట్రానికి వచ్చిన ప్రపంచ ప్రఖ్యాత కంపెనీ ఫాక్స్‌కాన్ చైర్మన్ తెలంగాణ అభివృద్ధిని చూసి నేర్చుకోవాల్సినది చాలా ఉందనడం మనందరికీ గర్వకారణం..’’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
సమావేశంలో సీఎం చెప్పిన మరిన్ని అంశాలివీ..
► జూన్ 2న అన్ని నియోజకవర్గాల్లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిర్వహించాలి.
► ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత మిగతా డబు ల్ బెడ్రూం ఇండ్ల పంపిణీని పూర్తి చేయాలి.
► 58, 59 జీవోల ప్రకారం భూముల క్రమబద్ధీకరణకు దరఖాస్తు గడువు పెంచిన నేపథ్యంలో.. ఈ అవకాశాన్ని పేదలు సద్వినియోగం చేసుకునేలా ఎమ్మెల్యేలు చూడాలి.
► దళితబంధు రెండో విడత పంపిణీకి స్థానిక ఎమ్మెల్యేల ప్రతిపాదనల మేరకు కలెక్టర్లు లబ్ధిదారులను ఎంపిక చేయాలి. పథకం అమల్లోకి వచ్చిన ఆగస్టు 16న దళితబంధు వేడుకలను నిర్వహించాలి.
► గృహలక్ష్మి పథకం కింద సొంత జాగాలో ఇండ్ల నిర్మాణానికి రూ.3 లక్షలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో.. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను స్థానిక ఎమ్మెల్యేలు సిద్ధం చేసి కలెక్టర్లకు పంపించాలి. ఈ పథకంలో అవినీతికి తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులదే.
► త్వరలో ప్రారంభించే భూముల పంపిణీ పథకాన్ని ఎమ్మెల్యేలు అర్హులందరికీ న్యాయం జరిగేలా చూసుకుంటూ జాగ్రత్తగా జరిపించాల్సిన అవసరం ఉంది.
► త్వరలో నిర్వహించే పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలకు సిద్ధమై ఉండాలి. అన్ని కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి.
Comments
Please login to add a commentAdd a comment