Nalgonda Road Accident: 9 Deceased And 11 Injured, Telangana CM KCR Condolence | ఘోర రోడ్డు ప్రమాదం: సీఎం కేసీఆర్‌ దిగ్భ్రాంతి - Sakshi
Sakshi News home page

ఘోర రోడ్డు ప్రమాదం: సీఎం కేసీఆర్‌ దిగ్భ్రాంతి

Published Thu, Jan 21 2021 9:31 PM | Last Updated on Fri, Jan 22 2021 10:29 AM

CM KCR Condolense To People Lost Life In Nalgonda Road Accident - Sakshi

సాక్షి, పెద్దఅడిశర్లపల్లి/కొండమల్లేపల్లి: వారంతా రెక్కాడితేగాని డొక్కాడని నిరుపేద కుటుంబాలకు చెందినవారు. ఒకే గ్రామానికి చెందిన రోజు వారీ కూలీలు. రోజులాగే గురువారం కూడా కూలి పనులకు వెళ్లి ఆటోలో తిరిగి వస్తున్నారు. కొద్ది సేపట్లో ఇంటికి వెళ్లేవారు.. కానీ లారీ, బొలెరో రూపంలో తొమ్మిది మందిని మృత్యువు కబళించింది. బొలొరో వాహనాన్ని దాటే ప్రయత్నంలో ఎదురుగా వస్తు న్న ఆటోను లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఆరుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ హృదయ విదారక సంఘటన నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలం అంగడిపేట స్టేజీ సమీపంలోని హైదరాబాద్‌ – నాగార్జునసాగర్‌ ప్రధాన రహదారిపై గురువారం సాయంత్రం చోటు చేసుకుంది.

కాగా, ఆస్పత్రికి తరలిస్తుండగా.. తీవ్ర గాయాల పాలైన వారిలో ముగ్గురు మృతి చెందారు.  స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. దేవరకొండ మండలం చింతబాయి గ్రామానికి చెందిన 20 మంది కూలీలు పెద్ద అడిశర్లపల్లి మండల పరిధిలోని రంగారెడ్డిగూడెం, పోతునూరు గ్రామాల్లో వరి నాట్లు వేసేందుకు ఆటోలో వెళ్లారు. సాయంత్రం వరకు వరినాట్లు వేశారు. పని ముగించుకుని అదే ఆటోలో తిరుగు పయనమయ్యారు. పెదఅడిశర్లపల్లి మండలం అంగడిపేట క్రాస్‌రోడ్‌ సమీపంలోని ఎస్‌ఆర్‌ పెట్రోల్‌ బంక్‌ సమీపంలోకి రాగానే హైదరాబాద్‌ నుంచి సాగర్‌ వైపు వెళ్తున్న బొలెరో వాహనాన్ని ఓ లారీ ఓవర్‌టేక్‌ చేయబోయింది. ఈ క్రమంలో ఎదురుగా  కూలీలు వెళ్తున్న ఆటోను లారీ వేగంగా ఢీ కొట్టింది. బొలోరో వాహనం కూడా అదుపుతప్పి బోల్తాపడింది.

రక్తసిక్తమైన రోడ్డు..
అతి వేగంగా ఆటోను లారీ ఢీకొనడంతో అందులో ఉన్న కూలీలంతా రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయారు. అసలు ఏం జరిగిందో తెలుసుకునే లోపే వారిలో కొందరు మృతి చెందారు. మిగిలిన వారు తీవ్రగాయాలతో రక్తమోడుతూ ఆర్తనాదాలు చేశారు. పెట్రోల్‌ బంక్‌లో పనిచేస్తున్న సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు, స్థానికులు కలసి ఆటోలో చిక్కుకున్న క్షతగాత్రులను బయటకు తీశారు.

ప్రమాదంలో ఆటోడ్రైవర్‌ కొట్టం మల్లేశం (40)తో పాటు నోముల పెద్దమ్మ(51), నోముల సైదమ్మ (28), గొడుగు ఇద్దమ్మ (45), కొట్టం పెద్దమ్మ (42), నోముల అంజమ్మ (46)లు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో తీవ్ర గాయాల పాలైన కొట్టం చంద్రమ్మ (68), గొడుగు లింగమ్మ, నోముల అలివేలును హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందారు. పోలీసులు, స్థానికులు క్షతగాత్రులను మొదట దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో 9 మంది పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ
సంఘటనా స్థ«లాన్ని గురువారం నల్లగొండ జిల్లా ఎస్పీ రంగనాథ్, డీఎస్పీ ఆనంద్‌రెడ్డి పరిశీలించారు. ప్రమాదానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. అక్కడినుంచి దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు.

మద్యం సేవించిన లారీడ్రైవర్‌
ప్రమాదానికి కారణమైన లారీడ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ రంగనాథ్‌ తెలిపారు. డ్రైవర్‌కు బ్రీత్‌ ఎనలైజర్‌ పరీక్ష నిర్వహించామని, మద్యం సేవించినట్లు తేలిందని చెప్పారు. మద్యం సేవించి ఉండటం, అతివేగమే ప్రమాదానికి కారణంగా భావిస్తున్నట్లు తెలిపారు.

ఓవర్‌లోడ్‌పై చర్యలు
కరోనా నేపథ్యంలో బస్సులు ఎక్కువగా తిరగకపోవడంతో ప్రయాణికులు ఆటోలపై ఆధారపడుతున్నారని ఎస్పీ పేర్కొన్నారు. ఓవర్‌లోడ్‌పై ప్రజలకు అవగాహన ఉండాలని, తాము వాహనాలపై తనిఖీలు చేస్తూ చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కూలీలంతా గ్రామం నుంచి ఆటో మాట్లాడుకుని పనులకు వెళ్లారని, అదే ఆటోలో తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు.

తీవ్రంగా గాయపడిన వారు
వెంకటమ్మ, లింగమ్మ, అనిత, యాదమ్మ, అంజమ్మ, వెంకటమ్మ, రామంజ, నర్సమ్మ, నర్సమ్మ, యాదమ్మ, అంజమ్మ. 

ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి
ఈ విషాదకర సంఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఉన్నారు. వీరిలో ఆటోడ్రైవర్‌ కొట్టం మల్లేశ్, అతడి భార్య కొట్టం చంద్రమ్మ, తల్లి కొట్టం పెద్దమ్మలు ఉన్నారు. మల్లేశ్‌ రోజూ ఆటో నడుపుకుని కుటుంబాన్ని పోషిస్తుంటే.. భార్య చంద్రమ్మ, తల్లి పెద్దమ్మలు కూలీకి వెళ్లి చేదోడుగా ఉండేవారు. తల్లిదండ్రుల మృతితో మల్లేష్‌ పిల్లలు అరవింద్, హరీష్‌ అనాథలయ్యారు.

సీఎం కేసీఆర్‌ దిగ్భ్రాంతి
అంగడిపేట రోడ్డు ప్రమాదం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో మృతిచెందిన కూలీల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement