సాక్షి, హైదరాబాద్: ఓవైపు ప్రభుత్వపరంగా నిర్ణయాల్లో వేగం పెంచుతూనే... మరోవైపు క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని క్రియా శీలం చేయాలని సీఎం, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. ప్రభుత్వ నిర్ణయాలను వేగంగా అమలు చేయడం ద్వారా వివిధ వర్గాలను సంతృప్తిపర్చడం, పార్టీ కార్యకలాపాల్లో దూకుడు పెంచడం లక్ష్యంగా... ద్విముఖ వ్యూహాన్ని సిద్ధం చేశారు. నెలాఖరులోగా ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ, పదోన్న తులు, ధరణి పోర్టల్‌లో మార్పులు, చేర్పులు వంటి కీలక సమస్యలకు పూర్తిస్థాయిలో పరిష్కారం చూపనున్నారు. వచ్చే నెల 17న జరిగే తన జన్మదిన వేడుకల తర్వాత జిల్లా పర్యటనలకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టను న్నారు.
ఇప్పటికే వేతన సవరణ నివేదిక ప్రభుత్వానికి అందగా, సంక్రాంతి తర్వాత పీఆర్సీపై సీఎం కేసీఆర్ ప్రకటన చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల పదోన్న తుల ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ఇదివరకే ఆదేశించిన నేపథ్యంలో, ఖాళీల సంఖ్యపై స్పష్టత వచ్చాక ఫిబ్రవరి మూడోవారంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉంది. సోమవారం జరిగిన కలెక్టర్ల సమావేశంలో ధరణి పోర్టల్‌లో మార్పులు, చేర్పులకు కూడా వారం రోజుల గడువు ఇచ్చారు. ఎల్‌ఆర్‌ఎస్ వంటి అంశాలపైనా వీలైనంత త్వరగా ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు.
యాదాద్రిలో భారీ యాగం
యాదాద్రి ఆలయ నిర్మాణ పనులను కూడా ఫిబ్రవరి నెలాఖరులోగా పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఆలయ ప్రారంభోత్సవాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని భావిస్తున్న సీఎం ఈ సందర్భంగా భారీ యాగాన్ని కూడా నిర్వహించాలని నిర్ణయించారు. యాగం నిర్వహణ ఏ స్థాయిలో ఉండాలనే అంశంపైనా వేద పండితులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. మరోవైపు ఫిబ్రవరి మూడు లేదా నాలుగో వారం నుంచి జిల్లాల పర్యటనల ద్వారా పార్టీ కార్యకలాపాలను కూడా పట్టాలెక్కించాలని నిర్ణయించారు.
సుమారు రెండున్నరేళ్ల క్రితం అన్ని జిల్లా కేంద్రాల్లో టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాల నిర్మాణం ప్రారంభం కాగా, ఒకటి రెండు జిల్లాలు మినహా అన్ని చోట్లా పనులు దాదాపు పూర్తయ్యాయి. గత ఏడాది డిసెంబర్ 10న సిద్దిపేట జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించిన కేసీఆర్ ఇతర జిల్లా కేంద్రాల్లోనూ తన చేతుల మీదుగా పార్టీ కార్యాలయాలను ప్రారంభించేలా షెడ్యూల్ రూపొందిస్తున్నారు. కార్యకర్తల శిక్షణ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టి ఈ ఏడాది జూన్‌లోగా పూర్తి చేసేలా ప్రణాళిక సిద్దం చేశారు. శిక్షణలో కార్యకర్తలకు బోధించాల్సిన అంశాలపై రూపొందించిన హ్యాండ్‌బుక్ రూపకల్పనకు సంబంధించి సీఎం కేసీఆర్ పలు సూచనలు చేసినట్లు సమాచారం.
నామినేటెడ్ పదవుల భర్తీపైనా కసరత్తు
ఫిబ్రవరిలో జిల్లాల పర్యటనకు ముందే రాష్ట్ర, జిల్లా స్థాయి నామినేటెడ్ పదవుల భర్తీని కూడా పూర్తి చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. ఇప్పటికే జిల్లాలు, నియోజకవర్గాల వారీగా నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న నేతల జాబితా సీఎంకు చేరినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకుంటూనే నామినేటెడ్ పదవుల భర్తీలో తనదైన ముద్ర ఉండేలా కసరత్తు జరుగుతోందని సమాచారం. త్వరలో జరిగే నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక, వరంగల్, ఖమ్మం కార్పోరేషన్ల ఎన్నికకు సంబంధించి ఇప్పటికే టీఆర్‌ఎస్ పరంగా పలు అంతర్గత సర్వేలు జరుగుతున్నాయి.
మరోవైపు పార్టీ జిల్లా ఇన్‌చార్జిలు, సీఎంకు సన్నిహితంగా ఉండే నేతలు నాగార్జునసాగర్ నియోజకవర్గ, పార్టీ స్థితిగతులపైనా వేర్వేరు నివేదికలు సమర్పించారు. పార్టీ అభ్యర్థి ఎంపికపై అన్ని కోణాల్లో సమాచారం సేకరిస్తున్న సీఎం కేసీఆర్, పార్టీ యంత్రాంగాన్ని ఇప్పటి నుంచే ఎన్నికలకు సన్నద్దం చేయాలని నిర్ణయించారు. సాగర్ పరిధిలోని మండలాలు, మున్సిపాలిటీలకు ఒకటి రెండు రోజుల్లో పార్టీ ఇన్‌చార్జిలను ప్రకటించే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment