మోదీ సభలో కేసీఆర్‌కు 7 నిమిషాలు! | CM KCR Speech in PM Narendra Modi Public Meeting | Sakshi
Sakshi News home page

మోదీ సభలో కేసీఆర్‌కు 7 నిమిషాలు!

Published Fri, Apr 7 2023 3:09 AM | Last Updated on Fri, Apr 7 2023 3:09 AM

CM KCR Speech in PM Narendra Modi Public Meeting - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటనకు సంబంధించి సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం అందింది. ప్రధాని పాల్గొననున్నవి కేంద్ర ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు కావడంతో ప్రోటోకాల్‌ ప్రకారం సీఎం, ఇతర ప్రముఖులకు హోదాల ప్రకారం ఆహ్వానించారు. ఈ మేరకు షెడ్యూల్‌లోనూ చేర్చారు.

ఇందులోభాగంగా సికింద్రాబాద్‌ పరేడ్‌గ్రౌండ్స్‌లో ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా పాల్గొనే బహిరంగసభలో సీఎం కేసీఆర్‌ ప్రసంగం కోసం ఏడు నిమిషాలు కేటాయించారు. ఇక ప్రధాని రాష్ట్ర పర్యటన కేవలం రెండు గంటల్లోనే ముగియనుంది. శనివారం ఉదయం 11.30కు హైదరాబాద్‌కు చేరుకోనున్న మోదీ.. 1.30 గంటల సమయంలో ఢిల్లీకి తిరుగు ప్రయాణం కానున్నారు. 

కేసీఆర్‌ హాజరవుతారా? 
కొంతకాలం నుంచి ప్రధాని మోదీ పాల్గొంటున్న ఏ ప్రభుత్వ, ఇతర కార్యక్రమాల్లోనూ సీఎం కేసీఆర్‌ పాల్గొనలేదు. ఇంతకుముందు పలుమార్లు మోదీ హైదరాబాద్‌ పర్యటనకు వచ్చినా.. స్వాగతం పలకడానికి సీఎం వెళ్లలేదు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులనే పంపారు. అయితే ఈ నెల 8న పరేడ్‌గ్రౌండ్స్‌ సభలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు, భూమిపూజ, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. దీనికి సంబంధించి అధికారికంగా షెడ్యూల్‌ విడుదల చేశారు.

ఇందులో పరేడ్‌గ్రౌండ్స్‌ సభలో కేసీఆర్‌ ప్రసంగానికి ఏడు నిమిషాల సమయాన్ని కేటాయించారు. ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రధాని కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌ పాల్గొంటారా? లేక గతంలో లాగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఓ మంత్రిని ప్రతినిధిగా పంపుతారా? అన్నది ఆసక్తికరంగా మారింది. 

శనివారం మోదీ షెడ్యూల్‌ ఇదీ.. 
► ఉదయం 11.30 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేటకు రాక 
► 11.45కు రోడ్డు మార్గాన సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు ప్రధాని.. 
► 11.45 నుంచి 12 గంటల దాకా అక్కడే కార్యక్రమాలు. సికింద్రాబాద్‌–తిరుపతి మధ్య వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రారంభం 
► మధ్యాహ్నం 12.15 గంటలకు పరేడ్‌గ్రౌండ్స్‌కు చేరుకోనున్న మోదీ 
► 12.20 నుంచి 12.30 గంటల వరకు కేంద్ర రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్, కేంద్ర పర్యాటక మంత్రి కిషన్‌రెడ్డి ప్రసంగాలు 
► 12.30 నుంచి 12.37 గంటల దాకా సీఎం కేసీఆర్‌ ప్రసంగం 
► 12.37 నుంచి 12.50 గంటల వరకు ఎంఎంటీఎస్‌ ఫేజ్‌–2తోపాటు పలు రైల్వే, రోడ్డు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు 
► మధ్యాహ్నం 12.50 నుంచి 1.20 వరకు ప్రధాని మోదీ ప్రసంగం 
► 1.30 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని ఢిల్లీకి తిరుగుప్రయాణం కానున్న ప్రధాని.

ఎయిమ్స్‌ వసతులతో తెలంగాణకు లబ్ధి: ప్రధాని 
సాక్షి, న్యూఢిల్లీ: బీబీనగర్‌లోని ఎయిమ్స్‌లో మౌలిక సదుపాయాలు పెంపొందించడం వల్ల తెలంగాణకు ప్రయోజనం చేకూరుతుందని, ఆరోగ్యవంతమైన భారతదేశాన్ని సృష్టించే ప్రయత్నాలకు మరింత ఊపునిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ నెల 8న బీబీనగర్‌ ఎయిమ్స్‌లో నూతన అత్యాధునిక సౌకర్యాలకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయనున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్సుఖ్‌ మాండవీయా చేసిన ట్వీట్‌కు.. ప్రధాని మోదీ గురువారం ఈ మేరకు రీట్వీట్‌ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement