
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. పంటి చికిత్స కోసం ఢిల్లీలోని ప్రముఖ డెంటిస్టును కలవడానికి సీఎం వెళ్తున్నారని సమాచారం. ఆయన ఢిల్లీలో ఎన్ని రోజులు ఉంటారన్న అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. రెండు, మూడ్రోజులపాటు ముఖ్యమంత్రి ఢిల్లీలో ఉండే అవకాశాలున్నాయి. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల బకాయిలను విడుదల చేయాలని చాలాకాలంగా సీఎం కేసీఆర్ ఒత్తిడి తెస్తున్నారు. ఈ అంశంపై చర్చించేందుకు మరోసారి ఆయన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసే అవకాశాలున్నాయి. పలువురు ఇతర కేంద్ర మంత్రులను సైతం కలసి రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించే అవకాశముంది. అయితే సీఎం కేసీఆర్ ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్ కోరలేదని, ఆయన్ను కలిసే అవకాశం లేదని ఆయన
కార్యాలయ వర్గాలు తెలిపాయి.
నదీజలాల అంశంపై..: ఇక సీఎం ఢిల్లీ పర్యటన నేపథ్యంలో కృష్ణా, గోదావరి నదీ జలాలకు సంబంధించిన పెండింగ్ అంశాలపై మళ్లీ కసరత్తు మొదలైంది. అపెక్స్ కౌన్సిల్ భేటీ అనంతరం కేంద్ర, రాష్ట్రాల మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు, జరిగిన నిర్ణయాలపై ఇరిగేషన్ శాఖ నివేదికలు సిద్ధం చేసింది. ముఖ్యంగా అంతర్రాష్ట్ర నదీ వివాదాల చట్టంలోని సెక్షన్–3 ప్రకారం రాష్ట్రం చేసిన ఫిర్యాదుకు పరిష్కారం చూపాలని, లేనిపక్షంలో అవే అంశాలతో ట్రిబ్యునల్‌కు సిఫార్సు చేయాలన్న విషయమై ఇప్పటికే అపెక్స్‌లో స్పష్టం చేసినా ఇంతవరకు స్పందన లేకపోవడంతో ఈ అంశాన్ని సీఎం కేసీఆర్ కేంద్రం దృష్టికి తీసుకెళ్లే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కృష్ణా, గోదావరి ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు లేకుండా నియంత్రణ వద్దని తెలంగాణ ప్రభుత్వం కోరుతున్నా కేంద్రం వినిపించుకోవడం లేదు. ఈ నేపథ్యంలోనే సీఎం స్వయంగా మరోసారి కేంద్రం దృష్టికి తీసుకెళ్లే అవకాశాలున్నట్లు నీటిపారుదల వర్గాలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment